Kalki 2898 AD Ticket: ఒక్క టికెట్ రూ.2300..అదీ ముంబైలో.. కల్కి 2898 ఏడీ మూవీ మరో రికార్డు
Kalki 2898 AD Ticket: కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఒక్క టికెట్ ధర దేశంలో గరిష్ఠంగా రూ.2300గా ఉండటం విశేషం. అది కూడా ముంబైలోని ఓ మల్టీప్లెక్స్‌లో. ఈ ధర ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Kalki 2898 AD Ticket: కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ ధర రూ.2300. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇదేమంత పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు. బెనిఫిట్ షోలు, బ్లాక్ టికెట్లు ఇంత కంటే ఎంతో ఎక్కువకి కూడా కొని చూస్తారు. కానీ ఈ టికెట్ ధర అధికారికంగా ఓ థియేటర్లో అంటే నమ్మగలరా? అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు. ముంబైలో కావడం మరో విశేషం.
కల్కి 2898 ఏడీ టికెట్ ధర
కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఏపీ, తెలంగాణల్లో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలా చూసినా గరిష్ఠంగా రూ.500 వరకు ఓ టికెట్ ఉండొచ్చు. కానీ ముంబైలోని మైసన్ పీవీఆర్ మల్టీప్లెక్స్ లోని ఓ స్క్రీన్ లో ఈ సినిమా టికెట్ ధర రూ.2300 కావడం విశేషం. తొలి రోజు రాత్రి 9.15 గంటల షో కోసం లివింగ్ రూమ్ స్క్రీన్ లో టికెట్ ధరను ఈ స్థాయిలో నిర్ణయించారు.
దేశంలో ఈ మూవీకి ఓ అధికారిక టికెట్ కు అత్యధక ధర ఇదే కావడం విశేషం. ఈ ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది హిందీ వెర్షన్ కోసం అమ్ముతున్న టికెట్ ధర. ఇక తొలి రోజు రూ.2300 ధర నిర్ణయించిన మైసన్ ఐనాక్స్ థియేటర్.. వీకెండ్ కోసం రూ.2000 టికెట్లను కూడా అమ్ముతోంది.
రికార్డు మాత్రం జవాన్‌దే..
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ కోసం దేశంలో ఇదే రికార్డు ధర అయినా.. అత్యధిక టికెట్ ధర రికార్డు మాత్రం షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి దక్కుతుంది. గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన ఈ సినిమా కోస ఓ టికెట్ ధరను రూ.2400గా నిర్ణయించారు. పఠాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన షారుక్ మూవీ కావడంతో జవాన్ పై ఓ రేంజ్ లో బజ్ నెలకొంది. దీనిని థియేటర్ల యజమానులు బాగానే క్యాష్ చేసుకున్నారు. ఇలా జవాన్ మూవీ మొత్తంగా రూ.1100 కోట్లకుపైగానే వసూలు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఏపీ విషయానికి వస్తే ఈ సినిమా కోసం టికెట్ల ధరలను సింగిల్ స్క్రీన్ అయితే రూ.75 వరకు, మల్టీప్లెక్స్ అయితే రూ.125 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు 14 రోజుల వరకు రోజుకు ఐదు షోలు కూడా వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న బజ్, టికెట్ల ధరల పెంపు, దమ్ము రేపుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ మూవీకి రికార్డు ఓపెనింగ్స్ ఖాయమని భావిస్తున్నారు.
తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్ అందుకోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రికార్డు అది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రేపే (జూన్ 27) రిలీజ్ కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే ఈ మూవీ హంగామా మొదలు కానుంది.