Kalki 2898 AD Advance Bookings: ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రికార్డు.. అడ్వాన్స్ మోత మోగిస్తున్న కల్కి 2898 ఏడీ
Kalki 2898 AD Advance Bookings: కల్కి 2898 ఏడీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దుమ్ము రేపుతోంది. తాజాగా నార్త్ అమెరికాలో ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది.
Kalki 2898 AD Advance Bookings: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది. అయితే చాలా రోజుల కిందటే నార్త్ అమెరికాలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ లోనే ఈ మూవీ గతంలో ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న మూవీ రిలీజ్ కానుండగా.. అక్కడ జూన్ 26న ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేశారు.
కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్
కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందో చెప్పడానికి తొలి ఆధారం ఇది. నార్త్ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల మార్క్ కూడా అందుకుంది.
మూవీ రిలీజ్ కు మరో 9 రోజుల సమయం ఉండగా.. ఇప్పటికే ఫాస్టెస్ట్ 2 మిలియన్ డాలర్ రికార్డు సొంతం చేసుకుంది. ఆ లెక్కన రానున్న రోజుల్లో మరెన్నో రికార్డులు తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది. కచ్చితంగా మరో రూ.1000 కోట్ల సినిమాగా నిలుస్తుందన్న అంచనాల మధ్య నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల మోత మోగిస్తోంది.
కల్కి 2898 ఏడీ ప్రమోషన్లు
కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఏళ్లుగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మే 9నే మూవీని రిలీజ్ చేస్తామని మొదట అనౌన్స్ చేసినా.. ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 27న రిలీజ్ కాబోతుండగా.. మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఏదో ఒక రకంగా ఈ సినిమా వార్తల్లో నిలిచేలా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
సోమవారమే (జూన్ 17) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ ఆంథెమ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు, పంజాబీ మిక్స్ చేస్తూ సాగిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ తొడగొట్టడం ఈ పాటకే హైలైట్. పాపులర్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఇందులో పంజాబీ వెర్షన్ పాడాడు.
అయితే కల్కి మూవీ ప్రమోషన్లపై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నట్లు వాళ్ల సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే తెలుస్తోంది. ఇప్పటి వరకూ సినిమా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో లేవని, మూవీ గురించి ఇంకా ప్రభాస్ గానీ, మిగతా టీమ్ గానీ పబ్లిగ్గా అసలు ఏమీ మాట్లాడలేదన్నది వాళ్ల ఫిర్యాదు. సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న వేళ ఇండియా మొత్తం ఇంకెప్పుడు మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ టీమ్ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఈ ఈవెంట్ ద్వారా అసలు కల్కి 2898 ఏడీ మూవీ స్టోరీ, ఇతర వివరాలు తెలుస్తాయని వాళ్లు ఆశిస్తున్నారు. మరి ఫ్యాన్స్ అసంతృప్తిపై టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
టాపిక్