Jaya Jaya Jaya Jaya Hey Review: జయ జయ జయ జయహే మూవీ రివ్యూ - భర్తను భార్య కొడితే
Jaya Jaya Jaya Jaya Hey Review: దర్శన రాజేంద్రన్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం జయజయజయ జయహే అదే పేరుతో తెలుగులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు.
Jaya Jaya Jaya Jaya Hey Review: మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన హృదయం సినిమాతో హీరోయిన్‌గా యువతరం ప్రేక్షకులకు చేరువైంది దర్శన రాజేంద్రన్. ఆమె కథానాయికగా నటించిన మలయాళం సినిమా జయ జయ జయ జయహే. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈసినిమాకు విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. దాదాపు ఐదు కోట్ల వ్యయంతో మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన జయ జయ జయ జయహే అరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తెలుగులో అదే పేరుతో డిస్నీ ప్లస్‌హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాకు వినోదాన్ని జోడించి రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందంటే....
Jaya Jaya Jaya Jaya Hey Story - జయ కథ...
జయ (దర్శన రాజేంద్రన్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. డిగ్రీ పూర్తి చేసి స్వతంత్రంగా బతకాలని ఆశపడుతుంది. మంచి మార్కులతో ఇంటర్ పూర్తిచేస్తుంది. తాను కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చినా తల్లిదండ్రులు వ్యతిరేకించడంతోనే ఊరి కాలేజీలోనే డిగ్రీ చేరుతుంది.
అదే కాలేజీలోనే పనిచేసే అభ్యుదయ భావాలు కలిగిన లెక్చరర్‌ను ప్రేమిస్తుంది. కానీ ప్రతి విషయంలో జయను అతడు అనుమానిస్తుంటాడు. వారి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో జయకు ఇష్టం లేకపోయినా రాజేష్ (బాసిల్ జోసెఫ్) అనే వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తారు ఇంట్లోవాళ్లు. రాజేష్ కోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. కోపం ఎక్కువ. ప్రతి విషయంలో జయపై చేయిచేసుకుంటాడు. తల్లిదండ్రులకు చెబితే సర్దుకుపోమని సలహా ఇస్తారు.
ఒకరోజు తనపై చేయిచేసుకోవడానికి వచ్చిన రాజేష్‌ను తిరిగి కొడుతుంది జయ. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని జయపై తనపై దాడి చేసిందని రాజేష్ గ్రహిస్తాడు. తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని భార్య జయపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ మరోసారి భర్తను చిత్తుగా కొట్టేస్తుంది జయ.
ఆ తర్వాత రాజేష్ ఏం చేశాడు. భార్యపై రివేంజ్ తీసుకోవడానికి అతడు వేసిన మరో ప్లాన్ ఏమిటి? రాజేష్ వేసిన ప్లాన్స్‌ను జయ ఎలా తిప్పికొట్టింది? జయపై కోపంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన రాజేష్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? భర్త హింస నుంచి దూరకావడానికి జయ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నదన్నదే జయజయజయజయహే (Jaya Jaya Jaya Jaya Hey Review)సినిమా కథ.
సమకాలీన సమస్యతో...
భర్త చేతిలో భార్య వేధింపులకు గురవ్వడం అన్నది చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ హింసను భరించే వారు సమాజంలో ఎక్కువ మంది కనిపిస్తుంటారు. భర్త వేధింపులపై ఎదురుతిరిగే ఓ అమ్మాయి కథను వినోదాత్మకంగా దర్శకుడు విపిన్ దాస్ ఈసినిమాను తెరకెక్కించారు.
ఆడపిల్లల పట్ల కుటుంబం, సమాజంలో కనిపించే వివక్షను జయ క్యారెక్టర్ ద్వారా అర్థవంతంగా చూపించారు దర్శకుడు. ఆటలాడే వయసు నుంచి పెళ్లి వరకు అడుగడుగునా ఆంక్షల పేరుతో వారి కలలు ఎలా భగ్నం అవుతున్నాయో హృద్యంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. కనీసం స్నేహితులతో కలిసి టూర్ కూడా వెళ్లడానికి జయ ఇబ్బందులు పడే సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తాయి.
స్వేచ్ఛ...సమానత్వం...
పెళ్లి తర్వాత చదువును కొనసాగించాలని కోరుకున్నా కుటుంబ బాధ్యతల కారణంగా ఆ కోరిక తీరలేక మహిళల సంఘర్షణను జయ పాత్ర ద్వారా ఆవిష్కరించిన తీరు బాగుంది. భార్యభర్తల బంధం సాఫీగా సాగాలంటే స్వేచ్చ సమానత్వం స్వతంత్రం ఉండాలని ప్రధానంగా దర్శకుడు జయజయజయజయహే ఈ సినిమాతో చాటిచెప్పారు.
గృహహింస విషయంలో సమాజం ఆలోచన తీరును సంభాషణల ద్వారా చెప్పిన తీరు ఆలోచింపజేస్తుంది. భర్తను భార్య కొట్టిందంటే ఎంత అవమానం అని అడిగిన ప్రశ్నకు అలాంటప్పుడు భార్యను కొట్టడం భర్తకు తప్పు అనిపించడం లేదా దర్శన రాజేంద్రన్ సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది.
లెక్చర్‌లా కాకుండా...
చాలా సెన్సిటివ్ ఈష్యూను దర్శకుడు లెక్చర్ ఇస్తున్నట్లుగా సీరియస్‌గా కాకుండా ఆద్యంతం నవ్వులు పంచేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. రాజేష్‌ను జయ కొట్టే సీన్స్ నుంచి చక్కటి ఫన్‌ను రాబట్టుకున్నాడు డైరెక్టర్. . జయను చూసి రాజేష్ భయపడటం, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతడు వేసే ప్లాన్స్ కామెడీని పండించాయి. రాజేష్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చే సీన్‌తో డిఫరెంట్‌గా సినిమా ఎండ్ అవుతుంది.
దర్శన రాజేంద్రన్ వన్ ఉమెన్ షో...
జయగా దర్శన రాజేంద్రన్ తన నటనతో ఈ సినిమాను నిలబెట్టింది. తక్కువ డైలాగ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కళ్లతోనే చక్కటి ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించింది. భర్త హింసను ఎదురించే మహిళ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. భార్య చేతిలో దెబ్బలు తినే భర్తగా బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ కామెడీని పంచుతుంది. రాజేష్‌కు లేనిపోని సలహాలు ఇచ్చే అన్నగా అజీస్ క్యారెక్టర్ కామెడీ పరంగా ఈసినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.
Jaya Jaya Jaya Jaya Hey Review- ఫ్యామిలీ డ్రామా
జయజయజయజయహే నవ్విస్తూనే ఆలోచింపజేసే మంచి ఫ్యామిలీ డ్రామా సినిమా. రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు చక్కటి వినోదాన్ని పంచుతుంది.