Iraivan Review: ఇరైవన్ రివ్యూ - జయంరవి, నయనతార సైకో కిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Iraivan Review: జయంరవి, నయనతార కాంబినేషన్‌లో రూపొందిన తమిళ మూవీ ఇరైవన్ ఇటీవల థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఐ అహ్మద్ దర్శకత్వం వహించాడు.
Iraivan Review: జయంరవి(Jayam Ravi), నయనతార(Nayanathara) జంటగా నటించిన తమిళ మూవీ ఇరైవన్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఐ అహ్మద్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ (Rahul Bose) విలన్‌గా నటించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే….
ఏసీపీ అర్జున్ కథ...
ఏసీపీ అర్జున్ (జయంరవి) ధైర్యం, మొండితనం ఉన్న పోలీస్ ఆఫీసర్. క్రిమినల్‌ను శిక్షించడానికి అవసరమైతే చట్టాన్ని అతిక్రమించడంలో తప్పులేదని నమ్ముతుంటాడు. కోపం ఎక్కువ. సిటీలోని చాలా మంది అమ్మాయిల్ని బ్రహ్మ అలియాస్ స్మైలీ కిల్లర్ (రాహుల్ బోస్) దారుణంగా హత్య చేస్తుంటాడు.
బ్రహ్మను పట్టుకునే బాధ్యతను అర్జున్‌తో పాటు అతడి స్నేహితుడు ఆండ్రూకి (నరేన్) అప్పగిస్తాడు పోలీస్ కమీషనర్ (ఆశీష్ విద్యార్థి). బ్రహ్మను పట్టుకునే ప్రయత్నంలో ఆండ్రూ చనిపోతాడు. ఆండ్రూ కుటుంబబాధ్యతల్ని తీసుకున్న అర్జున్ పోలీస్ ఉద్యోగానికి లివ్ పెట్టి ఆండ్రూ చెల్లెలు ప్రియతో (నయనతార) కలిసి కాఫీషాప్ ఓపెన్ చేస్తాడు.
జైలు నుంచి తప్పించుకున్న బ్రహ్మ మళ్లీ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి హత్యలు చేయడం కొనసాగిస్తుంటాడు. బ్రహ్మను తెలివిగా పోలీసులే షూట్ చేసేలా అర్జున్ ప్లాన్ చేస్తాడు. బ్రహ్మ చనిపోయినా హత్యలు ఆగవు. అతడి స్టైల్‌లో మరో సైకో కిల్లర్ అమ్మాయిల్ని చంపడం మొదలుపెడతాడు. అతడు ఎవరు?
ఆ సైకో కిల్లర్ బారి నుంచి ఆండ్రూ భార్యా కూతురితో పాటు ప్రియను అర్జున్ ఎలా కాపాడుకున్నాడు? బాబు (వినోద్ కిషన్) అనే అనాథను సైకో కిల్లర్‌గా అర్జున్ ఎందుకు అనుమానించాడు? అర్జున్ మాటల్ని పోలీసులతో పాటు మీడియా నమ్మకపోవడానికి కారణం ఏమిటి? బ్రహ్మతో బాబుకు ఉన్న సంబంధం ఏమిటి? అర్జున్‌ను ప్రేమించిన ప్రియ అతడిని పెళ్లి చేసుకున్నదా? లేదా? అన్నదే ఈ సినిమా(Iraivan Review) కథ.
రాక్షసన్…పోర్ తొళిల్…
తమిళంలో సైకో కిల్లర్ కథాంశాలతో రూపొందిన రాక్షసన్, పోర్ తొళిల్ సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాల్ని అందుకున్నాయి.ఈ సినిమాల స్పూర్తితోనే దర్శకుడు అహ్మద్ ఇరైవన్ కథను రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఒకే ఫార్మెట్...
సైకో కిల్లర్ సినిమాలు చాలా వరకు ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. భయంకరమైన కిల్లర్...తెలివిపరుడైన పోలీస్ ఆఫీసర్...ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతోనే ఈ కథల్ని సిల్వర్ స్క్రీన్స్‌పై డైరెక్టర్ ఆవిష్కరిస్తుంటారు. వారిద్దరి మధ్య డ్రామా ఎంగేజింగ్‌గా ట్విస్ట్‌లు, టర్న్‌లతో చెప్పినప్పుడే ఈ జోనర్ సినిమాలు(Iraivan Review) ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. కానీ ఇరైవన్‌లో అలాంటి థ్రిల్స్ పెద్దగా కనిపించవు.
హీరో...విలన్ క్యారెక్టర్స్...
డ్యూటీలో చట్టం, రూల్స్ లాంటివేవి ఫాలో కానీ భయం అసలే లేని ఓ పోలీస్ ఆఫీసర్, జాలి, దయాలాంటివేవి లేని భయంకరమైన సైకో కిల్లర్ పాత్రల నేపథ్యంలో ఇరైవన్ సినిమాను నడిపించాలని అనుకున్నాడు డైరెక్టర్. హీరో, విలన్ పాత్రలను పరిచయం చేసిన తీరు బాగుంది. కానీ ఆ తర్వాత వచ్చే డ్రామా మొత్తం నత్తనడకన సాగుతుంది. బ్రహ్మ హత్యలు చేసే సీన్స్, అతడిని పట్టుకోవడానికి అర్జున్, ఆండ్రూ కలిసి చేసే ప్రయత్నాలు ఏ మాత్రం ఆసక్తిని కలిగించవు. ఆండ్రూ చనిపోవడం, పోలీస్ ఉద్యోగానికి అర్జున్ దూరమయ్యే సన్నివేశాల్లో ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదు.
లాజిక్‌లకు అందదు...
ఉద్యోగానికి దూరమైన నిరంతరం సైకో కిల్లర్ ఆలోచనలతోనే అర్జున్ ఎందుకు సంఘర్షణ పడుతున్నాడన్నది లాజిక్‌లకు అందదు. బ్రహ్మ చనిపోయిన తర్వాత మరో సైకో కిల్లర్ ఎంట్రీతో సెకండాఫ్(Iraivan Review) మొదలవుతుంది. ఆ హత్యలు చేసేది ఎవరన్నది సీరియల్ మాదిరిగా సాగదీశాడు. చివరకు తాము వెతుకుతోన్న సైకో కిల్లర్ అర్జున్ అని పోలీసులు ఎందుకు అనుమానించారు? ఆ కిల్లర్‌కు బ్రహ్మకు ఉన్న సంబంధం కూడా కన్వీన్సింగ్‌గా చూపించలేదని అనిపిస్తుంది. ఓ మోడల్, ఆమె బాయ్‌ఫ్రెండ్ అంటూ రకరకాల పాత్రలను ప్రవేశపెట్టాడు డైరెక్టర్. అవన్నీ గొందరగోళాన్ని కలిగిస్తాయి.
జయం రవి వన్ మెన్ షో...
జయం రవి వన్ మెన్ షోగా ఇరవైన్ సినిమా(Iraivan Review) నిలుస్తుంది. ఇదివరకు పోలీస్ పాత్రలు చాలా సినిమాల్లో చేయడంతో ఈజీగా క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ అనడం కంటే గెస్ట్ అని చెప్పడం బెటర్. ఏ మాత్రం ప్రాధాన్యం లేని ఈ పాత్రను నయనతార ఎందుకు ఒప్పుకున్నదన్నది అర్థం కాదు.
విలన్‌గా రాహుల్ బోస్ గెటప్, లుక్ బాగున్నాయి. హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ మూవీ సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ సినిమాలోని విలన్ పాత్ర నుంచి ఇన్‌స్పైర్ అయ్యి అతడి క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరో సైకో కిల్లర్‌గా వినోద్ కిషన్ మెప్పించాడు. యువర్ శంకర్ రాజా బీజీఎమ్ కథకు తగ్గట్లుగా ఉంది.
Iraivan Review -సైకో కిల్లర్ మూవీ....
ఇరైవన్ సస్పెన్స్ థ్రిల్ లేని సైకో కిల్లర్ మూవీ. జయం రవి యాక్టింగ్ బాగున్నా దర్శకుడు రాసుకున్న కథలో బలం లేదు.
టాపిక్