Highest Paid Villain: హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న విలన్ ఇతడే.. అతని క్రేజ్ మామూలుగా లేదు
Highest Paid Villain: ఓ సినిమాను ముందుండి నడిపించే హీరో కంటే కూడా ఓ విలన్ ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం ఎప్పుడైనా చూశారా? కానీ అలాంటి ఓ విలన్ ఉన్నాడు. ఒకప్పుడు ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకున్న నటుడిగా నిలిచాడు.
Highest Paid Villain: ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమాలన్నీ దాదాపు హీరో చుట్టే తిరుగుతాయి. దీంతో మూవీలోని నటీనటుందరి కంటే ఆ హీరో రెమ్యునరేషనే ఎక్కువగా ఉండటం సహజం. కానీ బాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల కిందట ఓ విలన్.. హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలుసా? ఆ విలన్ పేరు ప్రాణ్. 1960, 70ల్లో బాలీవుడ్ ను ఏలిన విలన్ అతడు.
అమితాబ్ కంటే ప్రాణ్ రెమ్యునరేషన్ ఎక్కువ
ప్రాణ్ అంటే బాలీవుడ్ లో తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. విలన్ పాత్ర పోషిస్తూ ఆ స్థాయి క్రేజ్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా చరిత్రలో హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక విలన్ కూడా ప్రాణే. తాను నటించిన కాలంలో సూపర్ స్టార్లు అయిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలాంటి వాళ్ల కంటే ఎక్కువ వసూలు చేశాడతడు.
1969 నుంచి 1982 మధ్య అమితాబ్ బచ్చన్ తో కలిసి ప్రాణ్ 8 సినిమాలు చేశాడు. అన్ని మూవీస్ లోనూ బిగ్ బీ కంటే ఈ విలన్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం విశేషం. అతడు ఉంటే సినిమా హిట్ అన్న నమ్మకంతో ప్రొడ్యూసర్లు ప్రాణ్ వెంట పడేవారు. ఓ హీరోకి ఉన్న డిమాండ్ ఆ రోజుల్లోనే ఈ విలన్ కు ఉందంటే నమ్మశక్యం కాదు.
ఎవరీ విలన్ ప్రాణ్?
ప్రాణ్ 1920లో ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో జన్మించాడు. ఆగస్ట్ 14, 1947లో పాకిస్థాన్ కు స్వతంత్రం రాగానే అతడు లాహోర్ వదిలి ముంబై వచ్చేశాడు. అప్పటికే అంటే 1940ల నుంచే అతడు సినిమాల్లో నటిస్తున్నాడు. మొదట్లో అన్నీ పాజిటివ్ రోల్సే చేశాడు. కానీ ఆ తర్వాత మెల్లగా నెగటివ్ రోల్స్ వైపు వచ్చాడు. 1960ల నాటికి బాలీవుడ్ లో టాప్ విలన్ గా ఎదిగాడు.
1970ల్లో అమితాబ్, ధర్మేంద్ర కంటే ఎక్కువ రెమ్యునరేషన్ పొందాడంటేనే ప్రాణ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో ప్రాణ్ కంటే ఎక్కువ మొత్తం అందుకున్న ఏకైక హీరో రాజేష్ ఖన్నా మాత్రమే. 1980ల్లో అమితాబ్ బచ్చన్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచే వరకు దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడిగా ప్రాణ్ నిలిచాడు.
మంచి పాత్రలు వద్దునుకొని..
ఓ విలన్ అంటే ఇలా ఉండాలన్నట్లుగా ప్రాణ్ జీవించేవాడు. అందుకే తనకు వచ్చిన పాజిటివ్ రోల్స్ ను తిరస్కరిస్తూ విలన్ గానే మిగిలిపోయాడు. ఓ హీరోగా చెట్లు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ లు చేయడం తనకు ఇష్టం ఉండేదని ప్రాణ్ అనేవాడట. అతడు పోషించిన విలనీకి ఎన్నో అవార్డులు వచ్చాయి. 1960ల నుంచి 1970ల వరకూ ఇండియాలో టాప్ విలన్ ప్రాణ్.
కేవలం అతని పేర్లతోనే పోస్టర్లు రిలీజ్ చేసే స్థాయి ఈ ప్రాణ్ ది కావడం గమనార్హం. ఆ కాలంలో సినిమాల్లో అతని క్రూరమైన పాత్రలు చూసి తల్లిదండ్రులు తమ పిల్లలకు అతని పేరు మాత్రం పెట్టకూడదని అనుకున్నారంటే ప్రాణ్ ఎంతలా విలనీ పండించాడో అర్థం చేసుకోవచ్చు. 2000 వరకూ అతడు నటిస్తూనే ఉన్నాడు. చివరికి 2013లో 93 ఏళ్ల వయసులో కన్నుమూశాడు.