Heeramandi OTT Release Date: సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..
Heeramandi Web Series OTT Release Date: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న హీరామండి వెబ్ సిరీస్‍పై సందిగ్ధత వీడింది. ఈ పీరియడ్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.
Heeramandi OTT Release Date: బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ రానుంది. ఆయన ఈ సిరీస్‍ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్నారు. కొన్ని అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన భన్సాలీ.. ఈ సిరీస్‍తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైన ‘హీరామండి’ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
హీరామండి వెబ్ సిరీస్ ఈ ఏడాది మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. చాలాకాలం సందిగ్ధత తర్వాత ఎట్టకేలకు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఖరారైంది. మే 1న ఈ సిరీస్ రానుందని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
హీరామండి వెబ్ సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ నుంచి ఫిబ్రవరిలో ఫస్ట్ లుక్ రాగా.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‍పై బజ్ బాగా ఏర్పడింది. దీంతో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్‍కు మే 1వ తేదీన ఫిక్స్ చేసింది నెట్‍ఫ్లిక్స్.
హీరామండి స్టోరీ బ్యాక్‍డ్రాప్
భారత్ బ్రిటీష్ పాలనలో ఉన్న 1940ల కాలం బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి వెబ్ సిరీస్ రూపొందుతోంది. హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్‍లో దర్శకుడు భన్సాలీ చూపించనున్నారు. బ్రిటీష్ పాలనలో దారుణాలను ఎదుర్కొన్న ఆ మహిళల గురించిన విషయాలను తెరకెక్కిస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ సమయం నాటి కథ ఇది.
హీరామండి వెబ్ సిరీస్‍కు సంజీయ్ లీలా భన్సాలీతో పాటు మితాక్షర కుమార్, విభు, సేహిల్ దీక్షిత్ మెహరా, మొయిన్ బేగ్, దివ్య్ నిధి శర్మ కూడా కథను అందించారు. ఈ సిరీస్‍కు సంగీతం కూడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సానీనే అందిస్తున్నారు. భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ లీలా భన్సాలీతో పాటు ప్రేరణ సింగ్ ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు.
2022లోనే హీరామండి వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. 2023 ఆరంభంలో ఈ సిరీస్ గురించి సంజయ్ లీలా భన్సాలీ అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రొడక్షన్‍లో సమస్యల కారణంగా ఈ సిరీస్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్‍ను ఖరారు చేసుకుంది.
హీరామండి ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. మొఘలుల కాలంలో ఈ ప్రాంతం గాయకులు, డ్యాన్సర్లకు ప్రసిద్ధిగా ఉండేది. ఈ అద్భుమైన నైపుణ్యాలు ఉండే మహిళలను తవైఫ్స్ అని పిలిచేవారు. అయితే, బ్రిటీష్ పాలన వచ్చాక ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. క్రమంగా ఆ ప్రాంతం వ్యభిచారానికి ఫేమస్ అయింది. అక్కడ చాలా దారుణాలు జరిగాయి. హీరామండి అనే ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది.