Anushka Shetty on Sita Ramam: అనుష్క ఇచ్చిన సీతా రామం రివ్యూ చూశారా?
Anushka Shetty on Sita Ramam: అందరి మనసులను హత్తుకుంటున్న సీతా రామం లవ్‌స్టోరీ ఇప్పుడు అనుష్కనూ తాకింది. ఆమె కూడా గురువారం (ఆగస్ట్ 18) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మూవీ రివ్యూ ఇచ్చింది.
దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ నటించిన సీతా రామం మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలుసు కదా. యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ క్లాసిక్ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఇప్పటికే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడం బాగా కలిసొచ్చింది.
అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఈ మూవీపై తన రివ్యూ రాసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె సీతా రామం లవ్‌స్టోరీ గురించి చెప్పింది. అంతేకాదు మూవీ సక్సెస్ కావడంతో అందరికీ కంగ్రాట్స్ చెప్పింది. "సీతా రామం ఓ అందమైన సినిమా. మిమ్మల్ని మెల్లగా పట్టేసుకొని అలా సీతా రామ్ ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. కంగ్రాచులేషన్స్ సీతా, రామ్, అఫ్రీన్.. ఈ సినిమాలో పని చేసిన ప్రతి మనిషికి, ప్రతి కళకు.. హృదయాన్ని కదిలించింది. ఇలాంటి స్టోరీలన్నింటికీ చీర్స్" అని అనుష్క రాసింది.
హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన సీతా రామం లవ్ స్టోరీ చాలా మందికి నచ్చింది. ముఖ్యంగా ఇందులో సీత పాత్రలో కనిపించిన మృనాల్ ఠాకూర్ తన అందంతో కట్టిపడేసింది. ఆ మధ్య జరిగిన సక్సెస్ మీట్‌లో ఈ సినిమా చూసిన తర్వాత తాను మృనాల్‌తో ప్రేమలో పడిపోయానని నాగార్జున అనడం విశేషం. ఈ మూవీతో మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.