Sita Ramam Collections: రూ.50 కోట్లు దాటిన సీతా రామం కలెక్షన్లు
Sita Ramam Collections: దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ నటించిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా సీతా రామం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ఈ మూవీ రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం.
చాలా రోజులుగా ఓ పెద్ద సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్‌కు ఒకే రోజు రిలీజైన సీతా రామం, బింబిసార కొత్త ఊపిరిలూదాయి. ఈ రెండు సినిమాలూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో.. ఒకదానితో మరొకటి పోటీ పడుతూనే బాక్సాఫీస్ దగ్గర కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కొత్తగా రిలీజైన లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం సినిమాలకు బ్యాడ్ టాక్ రావడంతో ఈ సినిమాలకు ఎదురు లేకుండా పోయింది.
ముఖ్యంగా క్లాసిక్ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సీతా రామం మూవీ సోమవారం (ఆగస్ట్ 15) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విటర్‌లో ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఇదే మూవీలో దుల్కర్ వీడియోను దీనికోసం వాడుకున్నారు. అంతేకాదు అమెరికాలోనూ మిలియన్ డాలర్ల ఫిగర్ అందుకుంది. ఈ మార్క్ దాటిని మూడో దుల్కర్ సల్మాన్ మూవీగా సీతా రామం నిలవడం విశేషం. 1960ల నాటి కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ప్రేమకథగా సీతా రామం తెరకెక్కింది.
లవ్‌స్టోరీలను చాలా అందంగా తెరకెక్కించే హను రాఘవపూడి ఈ మూవీని కూడా అంతే అందంగా చెక్కారు. దుల్కర్, మృనాల్‌ల కెమెస్ట్రీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. గత వారమే ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి హీరో, హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రొడ్యూసర్ అశ్వనీదత్ వచ్చారు.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దుల్కర్, మృనాల్‌లతోపాటు రష్మికా మందన్నా, సుమంత్‌లు కూడా ఈ సినిమాలో నటించారు.