Macherla Niyojakavargam Movie Review: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీ రివ్యూ-nithiin macherla niyojakavargam movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nithiin Macherla Niyojakavargam Movie Review

Macherla Niyojakavargam Movie Review: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీ రివ్యూ

Nelki Naresh Kumar HT Telugu
Aug 12, 2022 12:51 PM IST

Macherla Niyojakavargam Movie Review: కెరీర్‌లో తొలిసారి రాజకీయ నేపథ్య కథాంశాన్ని ఎంచుకొని నితిన్ (Nithiin) చేసిన సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం(Macherla Niyojakavargam Movie). ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్‌జకుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

నితిన్
నితిన్ (twitter/nithiin)

macherla niyojakavargam movie review: ఇర‌వై ఏళ్ల సినీ ప్ర‌యాణంలో యాక్ష‌న్‌, ప్ర‌యోగాల‌తో పోలిస్తే ప్రేమ‌క‌థా చిత్రాలే నితిన్‌కు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ల‌ను తెచ్చిపెట్టాయి. ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను దాటుకొని మాస్‌ హీరోగా ఎద‌గాల‌ని నితిన్ చాలా ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. కానీ అత‌డి కోరిక మాత్రం ఫ‌లించ‌డం లేదు.

ఈ సారి ఎలాగైనా ఈ ఇమేజ్ అడ్డంకిని దాటాల‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కంతో నితిన్ చేసిన చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ఈ సినిమాతో ఎడిట‌ర్ ఎం.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. నితిన్ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ప‌తాకంపై అత‌డి తండ్రి సుధాక‌ర్‌రెడ్డి, సోద‌రి నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ తొల‌గిపోయిందా? మాస్ క‌థ‌తో అత‌డు ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? హ్యాట్రిక్ ప‌రాజ‌యాల నుండి నితిన్ ను ఈ సినిమా గ‌ట్టెక్కించిందా? కొత్త ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అత‌డికి విజ‌యాన్ని అందించాడా లేదా అన్న‌ది చూద్దాం

ఐఏఎస్ ఆఫీసర్ ప్రయాణం

సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ (నితిన్) సివిల్ సర్వీస్ సెలెక్షన్ పూర్తి చేసుకొని పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుంటాడు. బీచ్ లో స్వాతి (కృతిశెట్టి) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ఆమెతో ఫ్రేమలో ప‌డ‌తాడు. స్వాతికి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఆమె త‌న అభిప్రాయం చెప్ప‌కుండా త‌న సొంత ఊరు మాచ‌ర్ల‌కు వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ సిద్ధార్థ్ కూడా మాచ‌ర్ల వెళ‌తాడు.

స్వాతిని చంప‌డానికి రాజ‌ప్ప తో పాటు అతడి కొడుకు వీర (సముద్రఖని) ప్ర‌య‌త్నిస్తారు. వారి బారి నుంచి స్వాతిని సిద్ధార్థ్ కాపాడ‌తాడు. స్వాతి ఎవ‌రు? రాజ‌ప్ప మ‌నుషులు స్వాతిని చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించారు?

మాచర్లలో ముప్పై ఏళ్లుగా పోటీ లేకుండా ఎన్నిక‌ల్లో యునాన‌మ‌స్ గెలుస్తూ వ‌స్తున్న రాజ‌ప్ప అధికారానికి, రౌడీయిజానికి చెక్ పెట్టాల‌ని అనుకున్న సిద్ధార్థ్ ప్ర‌య‌త్నాలు నెర‌వేరాయా? మాచ‌ర్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని అనుకున్న అత‌డి క‌ల తీరిందా? స్వాతి నిధిల‌లో(కేథరిన్) సిద్ధు ఎవ‌రిని ప్రేమించాడు అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

కమర్షియల్ ఎంటర్ టైనర్

హీరోయిజం, యాక్ష‌న్‌ అంశాల‌తో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా తెర‌కెక్కింది. నితిన్‌ను మాస్ హీరోగా ఆవిష్క‌రించాల‌నే ఆలోచ‌నతోనే ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది.

క‌థ గురించి ఆలోచించ‌కుండా రెగ్యుల‌ర్ సినిమాల్లో క‌నిపించే కొన్ని ప‌డిక‌ట్టు సూత్రాల‌ను ఫాలో అవుతూ ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఈ సినిమాను రూపొందించారు.

macherla niyojakavargam movie review: ఫస్ట్ సీన్ తోనే..

ఫ‌స్ట్ సీన్‌తోనే ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందో మెయిన్ ఫ్లాట్ ఏమిటో చెప్పేశారు ద‌ర్శ‌కుడు. మాచ‌ర్ల అనే ప్రాంతంలో ఎప్ప‌టికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చేస్తాన‌ని విల‌న్ శ‌ప‌థం చేసే సీన్‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ సీన్‌తోనే హీరో ల‌క్ష్యం, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌నుందనేది హింట్ ఇచ్చేశాడు. రౌడీయిజం, రాజ‌కీయ‌బ‌లంతో ఎదురులేకుండా మాచ‌ర్ల‌ను ఏలుతున్న విల‌న్ ను హీరో ఎలా ఎదురించాడ‌న్న‌దే మాచర్ల నియోజకవర్గం కథ.

అసెంబ్లీ రౌడీ నుంచి సరైనోడు వరకు

అసెంబ్లీ రౌడీ నుంచి స‌రైనోడు వ‌ర‌కు వంద‌లాది సినిమాల్లో చూపించిన కామ‌న్ పాయింట్ ను ఎంచుకొని ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఈ క‌థ‌ను రాసుకున్నారు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా క‌థ‌నం కూడా అదే రీతిలో సాగుతుంది. ఓ పాట, ఫైట్, కామెడీ ఇలా వ‌రుస‌గా ఒక్కో స‌న్నివేశం పేర్చుకుంటూ వెళ్లిపోయారు. ట్విస్ట్‌లు, మెరుపులు ఆశించ‌డం అత్యాశే అవుతుంది. భ‌లే ఉంది ఈ సీన్ ప్రేక్ష‌కులు ఫీల‌య్యే సంద‌ర్భాలు క‌నిపించ‌దు.

కామెడీ వర్కవుట్ కాలేదు

త‌న క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే స‌హించ‌లేని మ‌న‌స్త‌త్వ‌మున్న యువ‌కుడిగా యాక్ష‌న్ సీన్‌తో నితిన్ క్యారెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు ద‌ర్శ‌కుడు. కేథ‌రిన్ వ‌న్ సైడ్ ల‌వ్ తో పాటు గుంత‌ల‌కిడి గుర్నాథం అంటూ ఈగో పేరుతో వెన్నెల కిషోర్ చేసే బూతు కామెడీతో ఫ‌స్ట్ హాఫ్ మొత్తం క‌ల‌గ‌పుల‌గంగా సాగిపోతుంది.

క‌థ‌నేది లేకుండా కేవ‌లం కామెడీ ట్రాక్‌ల‌తోనే సినిమా సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌లోనే మెయిన్ ఫ్లాట్ మొద‌ల‌వుతుంది. క‌లెక్ట‌ర్ గా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప్రాంతంలో అడుగుపెట్ట‌డంతో ఏదైనా అద్భుతం జ‌రుగ‌వ‌చ్చున‌ని తిరిగి థియేట‌ర్ లో వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని ఫ‌స్ట్ సీన్ నుండే చుక్క‌లు చూపించారు. హీరో విల‌న్ పోరులో ఎలాంటి ఆస‌క్తి క‌నిపించ‌లేదు. చివ‌రి వ‌ర‌కు ఒక‌రికొక‌రు పంచ్ డైలాగ్స్ చెప్పుకుంటూ నీరసాన్ని తెప్పించారు. క్లైమాక్స్ ను రొటీన్ గానే ముగించారు.

ట్రాయాంగిల్ లవ్ స్టోరీ...

పేరుకు ఇద్ద‌రు నాయిక‌లు ఉన్నా ఒక్క హీరోయిన్‌కు స‌రైన ప్రాధాన్య‌త లేదు. ట్రాయాంగిల్ ల‌వ్‌స్టోరీ వ‌ర్క‌వుట్ కాలేదు. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ మొత్తం బూతుల‌తో నిండిపోయి ఓపిక‌కు ప‌రీక్ష పెడుతుంది. నితిన్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు మిగిలిన పాత్ర‌ల్లో కొత్త‌ద‌నం మ‌చ్చుకైనా క‌నిపించ‌దు.

మాస్ హీరోగా నితిన్...

మాస్ క్యారెక్ట‌ర్ నితిన్‌కు అంత‌గా సెట్‌కాలేదు. గ‌తంలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసి చాలా సార్లు విఫ‌ల‌మ‌య్యారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో త‌ప్పులేదు. కానీ క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుంటుంది. రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో కాకుండా విభిన్నంగా అడుగులు వేస్తే స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

సిద్ధార్థ్ గా అత‌డి లుక్ బాగుంది. యాక్టింగ్ ప‌రంగా ఒకే కానీ హిట్ మాత్రం ద‌క్క‌డం క‌ష్ట‌మే. కృతిశెట్టి కూడా మూస క్యారెక్ట‌ర్స్‌కు అల‌వాటుప‌డిపోతుంది. ఎలాంటి ఛాలెంజెస్ లేని సింపుల్ క్యారెక్ట‌ర్ కావ‌డంతో సింపుల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయింది. కేథ‌రిన్ క్యారెక్ట‌ర్ వ‌ల్ల సినిమాతో పాటు ఆమె కెరీర్‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేదు.

ముర‌ళీశ‌ర్మ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ లాంటి అనుభ‌వ‌జ్ఞుల న‌ట‌న‌ను తొలిసారి భ‌రించ‌లేని ఫీలింగ్ ను క‌లిగించారు. స‌ముద్ర‌ఖ‌ని ద్విపాత్రాభిన‌యం కూడా ఆక‌ట్టుకోలేదు. విల‌న్ ను డ్యూయ‌ల్ షేడ్ లో చూపించాల‌నే ఆలోచ‌న బాగుంది. కానీ క్యారెక్ట‌రైజేష‌న్స్ లో కూడా ఆ న‌వ్య‌త క‌నిపించాలి.

తొలి అవకాశం వినియోగించుకోలేదు..

ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మెప్పించ‌లేక‌పోయారు. తొలి సినిమా ద‌ర్శ‌కుల్లో ఉండే త‌ప‌న‌, క‌సి అత‌డిలో క‌నిపించ‌లేదు. పంచ్ డైలాగ్స్ స‌రిగా కుద‌ర‌లేదు. సాగ‌ర్ మ‌హ‌తి పాట‌ల్లో రారా రెడ్డి మాస్ సాంగ్ ఒక్క‌టే బాగుంది.

ఫ్రెష్ నెస్ మిస్…

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూడు ఫైట్లు, ఆరు పాట‌ల ఫార్ములాతో రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఫ్రెష్‌నెస్ అనే మాట మ‌చ్చుకైనా క‌నిపించని ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం అనుమానమే.

మాచర్ల నియోజకవర్గం మూవీ రేటింగ్ : 2.5/ 5

WhatsApp channel

టాపిక్