Harish Shankar OTT: ఆ ఓటీటీతో కలిసి పని చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన డైరెక్టర్
Harish Shankar In Valari Trailer Launch: ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ మూవీ వళరి ట్రైలర్‌ను విడుదల చేశారు. వళరి ట్రైలర్ లాంచ్‌లో ప్రముఖ ఓటీటీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను హరీష్ శంకర్ మనసులో మాట బయటపెట్టాడు.
Harish Shankar About Working With OTT: డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ లేకుండా వరుసగా ఫ్లాప్స్ చూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ మూవీతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్. మాస్ మహారాజా రవితేజ హీరోగా షాక్ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేదు.
అనంతరం మళ్లీ రవితేజతో మిరపకాయ్ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు హరీష్ శంకర్. తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో అలరించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో రామయ్య వస్తావయ్య తెరకెక్కించి భారీ డిజాస్టర్ చవి చూశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథం తీసి మరో ఫ్లాప్ చూశాడు హరీష్ శంకర్.
ప్రస్తుతం మరోసారి పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు హరీష్ శంకర్. అయితే, ఇటీవల ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు హారర్ మూవీ వళరి ట్రైలర్‌ను హరీష్ శంకర్ చేతులమీదుగా లాంచ్ చేయించారు మేకర్స్. ఈ వళరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ ఓటీటీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టాడు డైరెక్టర్ హరీష్ శంకర్. దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
"వళరి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్‍లో కట్స్ చాలా బావున్నాయి. చాలా క్రియేటివ్‌గా ఉంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకురాలు సంతోషిణి కి అభినందనలు. వళరి టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఒకవైపు రాజమౌళి గారితో పని చేసిన ఎడిటర్ తమ్మిరాజు గారు ఈటీవీలో పని చేసిన కృతజ్ఞతతో ఈ సినిమాకి పని చేయడం ఆయన డెడికేషన్, ప్యాషన్‌ని తెలియజేస్తుంది" అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు.
"రామోజీ సంస్థల నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా అది తెలుగువారింట్లో ఒక స్థానం సంపాదించుకుంటుంది. ఇప్పుడు సాలిడ్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. రామోజీ సంస్థ నిర్మించిన ఓ సినిమాకి గెస్ట్‌గా రావడం గర్వంగా భావిస్తున్నాను. హీరో శ్రీరామ్ అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. ట్రైలర్‌లో రితికా నటన అద్భుతంగా ఉంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్‌తో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. మార్చి 6న ఈటీవీ విన్‌లో వళరిని మిస్ కావద్దు'' అని హరీష్ శంకర్ తెలిపారు.
కాగా శ్రీరామ్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూనిక్ హారర్ మూవీ వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి ఈ తెలుగు హారర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై వళరి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.