Atlee And Priya Announce Pregnancy: తండ్రి కాబోతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. సోషల్ మీడియాలో ప్రకటన
Atlee And Priya Announce Pregnancy: కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తన అభిమానులు శుభవార్త చెప్పాడు. తన భార్య త్వరలోనే తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
Atlee And Priya Announce Pregnancy: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. తమిళంతో పాటు తన సినిమాలతో తెలుగులోనూ మంచి పాపులరయ్యారు. ఆయన తెరకెక్కించిన మొదటి చిత్రం రాజా రాణి నుంచి బిగిల్ వరక్ అన్నీ సినిమాలు ఇక్కడ డబ్ అవ్వడమే కాకుండా మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా అట్లీ శుభవార్త చెప్పారు. తన సతీమణి ప్రియ తల్లి కాబోతుందని వెల్లడించారు. అంతేకాకుండా బేబీ బంప్‌తో ఉన్న ప్రియ ఫొటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ దంపతులకు విశేషంగా అభినందనలు తెలియజేస్తున్నారు.
"మా కుటుంబం పెద్దదవుతుందనే శుభవార్తను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అద్భుత ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి." అని అట్లీ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అట్లీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది వీరికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
అట్లీ-ప్రియ కొన్నాళ్ల పాటు ప్రేమించుకుని 2014లో వివాహంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
అట్లీ 2013లో రాజా రాణి సినిమాతో డైరెక్టర్‌గా చిత్రసీమలో అడుగుపెట్టారు. అనంతరం పోలీసుడు(తమిళంలో తేరీ), అదిరింది(మెర్సెల్), విజిల్(బిగిల్) లాంటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో జవాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సంబంధిత కథనం