Dhoomam Movie Review: ధూమం మూవీ రివ్యూ - ఫహాద్ ఫాజిల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Dhoomam Movie Review:ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళ మూవీ ధూమం ఇటీవల థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Dhoomam Movie Review: దక్షిణాది చిత్రసీమలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్(Fahad Faasil). హీరో, విలన్ అనే భేదాలు లేకుండా కథ నచ్చితే ఏ పాత్రనైనా చేయడానికి సిద్ధపడతాడు. అతడు హీరోగా నటించిన మలయాళ(Malayalam) మూవీ ధూమం ఇటీవల థియేటర్లలో రిలీజైంది.
కేజీఎఫ్(KGF) నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీలో అపర్ణ బాలమురళి(Aparna Balamurali), రోషన్ మాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ధూమం సినిమా ఎలా ఉంది? తన యాక్టింగ్ తో సౌత్ ఆడియెన్స్‌ను ఫహాద్ ఫాజిల్ మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం...
సిగరెట్ కంపెనీ ఉద్యోగి కథ...
అవినాష్ (ఫహాద్ ఫాజిల్) ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్ హెడ్‌గా పనిచేస్తుంటాడు. తన తెలివితేటలు, మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో కంపెనీ అమ్మకాల్ని చాలా పెంచుతాడు. సిగరెట్ కంపెనీ ఎమ్‌డీ సిద్ధార్థ్ అలియాస్ సిధ్ (రోషన్ మాథ్యూ) అవినాష్‌ను ఎంప్లాయ్‌లా కాకుండా స్నేహితుడిలాగే భావిస్తుంటాడు. సిద్దార్థ్ తో అభిప్రాభేదాల కారణంగా హఠాత్తుగా తన ఉద్యోగానికి అవినాష్ రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత రోజు తన భార్య దియాతో (అపర్ణ బాలమురళి) అవినాష్ కలిసికారులో ప్రయాణిస్తోన్న సమయంలో అతడిపై ఓ ముసుగు వ్యక్తి ఎటాక్ చేసి డ్రగ్ ఇంజెక్షన్స్ ఇస్తాడు.
ఆ డ్రగ్ మత్తు నుంచి బయటకు వచ్చే సరికి అవినాష్ ఓ కొండ ప్రాంతంలో ఉంటాడు. అతడి భార్య దియా శరీరంలో ఓ మైక్రో బాంబ్ ఫిక్స్ చేశానని, ఆ బాంబ్ పేలకుండా దియా ప్రాణాలు నిలవాలంటే తాము చెప్పింది చేయాలని ఓ అపరిచితుడు అవినాష్‌ను ఫోన్‌లో బ్లాక్ మెయిల్ చేస్తాడు. కోటి రూపాయల్ని తాము చెప్పిన అడ్రస్‌లలో అందజేయాలని డిమాండ్ చేస్తాడు.
సిగరెట్ కంపెనీ రహస్యాలు తెలియడంతోనే సిద్ధార్థ్ తో పాటు అతడి అంకుల్, బిజినెస్ పార్ట్‌నర్ ప్రవీణ్ కలిసి తనను ఈ ట్రాప్‌లో ఇరికించారని అవినాష్ అనుకుంటాడు. కానీ వారు కాదనే నిజం అతడి అన్వేషణలో బయటపడుతుంది. ఫోన్‌లో తనను బెదిరిస్తోన్న అపరిచితుడి ఆచూకీని అవినాష్ ఎలా కనిపిపెట్టాడు?
ఆ ట్రాప్ నుంచి అతడు ఏ విధంగా బయటపడ్డాడు? తన భార్య దియాను అవినాష్ కాపాడుకున్నాడా? సిగరెట్ కంపెనీ సేల్స్ పెంచుతూ తాను చేస్తోంది ఉద్యోగం మాత్రమే అని భావించిన అవినాష్ తన తప్పు,ను ఏ విధంగా గ్రహించాడు? ప్రవీణ్ మర్డర్ కేసులో అనుమానితుడిగా అవినాష్ మారడానికి కారకులు ఎవరు? ప్రవీణ్‌ను చంపింది ఎవరు? సిద్ధార్థ్ నిజంగా మంచివాడేనా? అన్నదే ధూమం(Dhoomam Movie Review) కథ.
సోషల్ మెసేజ్‌తో...
సందేశాత్మక కథాంశాల్ని కమర్షియల్ హంగులతో జనరంజకంగా వెండితెరపై చెప్పడం ఓ ఆర్ట్. శంకర్, మురుగదాస్‌తో పాటు పలువురు దర్శకులు ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌తో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. ధూమం సినిమాతో పవన్ కుమార్ ఇదే రూట్‌ను ఫాలో అయ్యారు. ధూమపానం వల్ల తలెత్తే అనర్థాల్ని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ధూమం(Dhoomam Movie Review) సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించారు.
టెర్రరిస్ట్‌లే...
సిగరెట్, పొగాకు ఉత్పత్తుల వ్యాపారాల్ని చేసే వారిని టెర్రరిస్ట్‌లతో సమానం అని, వారి వల్ల సొసైటీకి ఎంతో నష్టం ఉందని ధూమం సినిమాలో చూపించారు పవన్‌కుమార్. సిగరెట్, లిక్కర్ వ్యాపారాల్లో లాభానష్టాలే తప్పితే మంచి చెడులు వంటి నైతిక విషయాలకు తావు ఉండదని చాటిచెప్పారు డైరెక్టర్.
లాభాల కోసం సిగరెంట్ కంపెనీలు వేసే ఎత్తులను ఆలోచననాత్మకంగా ప్రజెంట్ చేస్తూనే మరోవైపు ఓ ట్రాప్‌లో ఇరుక్కున్న యువకుడు తన భార్యతో కలిసి అందులో నుంచి బయటపడేందుకు సాగించిన పోరాటాన్ని చివరి వరకు థ్రిల్లింగ్‌గా సినిమాలో చూపించారు.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో...
హీరోహీరోయిన్ల ప్రజెంట్, పాస్ట్ ను సమాంతరంగా చూపిస్తూ నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేలో డిఫరెంట్‌గా డైరెక్టర్ పవన్ కుమార్ ఈ మూవీని(Dhoomam Movie Review) తెరకెక్కించాడు. . ఫహాద్‌ఫాజిల్ ట్రాప్‌లో ఇరుక్కున్నట్లుగా చూపించిన సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం భార్య దియాతో అవినాష్ చెప్పడం, మరోవైపు ప్రజెంట్‌లో బ్లాక్‌మెయిలర్ కోసం అతడు సాగించే అన్వేషణతో ఎంగేజింగ్‌గా సినిమా నడుస్తుంది.
ఎంత ట్రై చేసినా విలన్‌కు సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడంతో హీరోహీరోయిన్లు ఎదుర్కొనే సంఘర్షణ రియలిస్టిక్‌గా చూపించారు. చివరకు హీరో ఓ మర్డర్ కేసులో అనుమానితుడిగా మారిపోవడం, మరోవైపు అతడిని చంపడం కోసం ఓ మినిస్టర్ గ్యాంగ్ కూడా వెతికే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌ను కలిగిస్తాయి.
క్లైమాక్స్ హైలైట్...
రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా క్లైమాక్స్ సాహోసేపోతంగా ఎండ్ చేశారు డైరెక్టర్. ఇలాంటి క్లైమాక్స్‌ను చూపించడానికి ఎంతో ధైర్యం కావాలి. కమర్షియల్ సూత్రాలను ఫాలో కాకుండా తాను ఏది చెప్పాలని అనుకున్నారో దానినే స్క్రీన్‌పై చూపించారు. ఈ సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌ను జీర్ణించుకోవడం కష్టమే.
సందేశం బాగుంది కానీ...
ధూమం సినిమా(Dhoomam Movie Review) ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం బాగున్నా చెప్పిన విధానమే చాలా కన్ఫ్యూజన్‌గా ఉంది. అవినాష్ ట్రాప్‌లో ఇరుక్కుకోవడం, దాని బయటపడే సన్నివేశాల్లో థ్రిల్లింగ్ మిస్సయింది. రిపీటెడ్ సీన్స్‌తో చాలా నత్తనడకన ఈ ఎపిసోడ్ సాగుతాయి. విలన్ ఎవరనే ట్విస్ట్ కూడా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది.
వన్ మెన్ షో…
ఫహాద్ ఫాజిల్ వన్ మెన్ షో ఇది. అవినాష్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవించాడు. భార్యను కాపాడుకునే భర్తగా, తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు తపించే యువకుడి పాత్రలో జీవించాడు. సింపుల్ స్టోరీని తన యాక్టింగ్‌తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దియాగా అపర్ణ బాలమురళి నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది. మంచివాడిగా నటించే నెగెటివ్ షేడ్ పాత్రలో రోషన్ మాథ్యూ, ప్రవీణ్‌గా వినీత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రైటర్‌గా పవన్ కుమార్ వైవిధ్యతను చాటుకున్నా డైరెక్టర్‌గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు.
ధూమపానం అనర్థాల్ని…
ధూమపానం వల్ల జరిగే అనర్థాల్ని చాటిచెప్పే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. కమర్షియల్‌గా కోణంలో చూస్తే ధూమం మెప్పించడం కష్టమే.