Captain Miller: ధనుశ్ సినిమా కూడా రెండు పార్ట్‌లుగా రానుందా?
Captain Miller: ధనుశ్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా గురించి ఓ కీలకమైన సమాచారం వెల్లడైంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది.
Captain Miller: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్వీకెల్స్ హవా నడుస్తోంది. కొన్ని భారీ సినిమాలు రెండు భాగాలను ప్లాన్ చేసుకుంటున్నాయి. బాహుబలి తర్వాతి నుంచి ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలను రెండు పార్ట్‌లుగా తీసుకొచ్చేందుకు కొందరు మేకర్స్ మొగ్గు చూపుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుశ్ కూడా ఈ ట్రెండ్‍లోకి వచ్చేస్తున్నారు. ధనుశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ కూడా రెండు పార్ట్‌లుగా రావడం ఖాయమైంది. ఆ వివరాలివే..
1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ రూపొందుతోంది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే వీరుడు కెప్టెన్ మిల్లర్ పాత్ర చేస్తున్నారు ధనుశ్. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, కెప్టెన్ మిల్లర్ మూవీ రెండు భాగాలుగా రావడం ఖాయమైందని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై సినీ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ధనుశ్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ రెండు భాగాలుగా రావడం కన్‍ఫామ్ అయిందని పేర్కొన్నారు.
కెప్టెన్ మిల్లర్ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నారు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, ప్రియాంక అరుల్ మోహన్, అదితి బాలన్, జాన్ కొక్కెన్, ఎడ్వర్డ్ సొన్నెన్‍బ్లిక్, నివేదిక సతీశ్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన కెప్టెన్ మిల్లర్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.
కెప్టెన్ మిల్లర్ సినిమాను డిసెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇది తొలి భాగంగా ఉండే అవకాశం ఉంది. రెండు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానుండడంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కెప్టెన్ మిల్లర్ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సిద్ధార్థ నూని సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. టీజర్లో సినిమాటోగ్రఫీ కూడా ఓ హైలైట్‍గా కనిపించింది.