Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?
Devara Pre Release Event: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. ఈ మచ్ అవేటెడ్ ఈవెంట్ ఈ నెల 22న జరగబోతోంది.
Devara Pre Release Event: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్సయింది. మూవీ రిలీజ్ కంటే ముందు ఏ హీరో అభిమాని అయినా.. ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. దేవర రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రీరిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మొత్తానికి ఈ ఈవెంట్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 22) జరగబోతోంది.
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్
దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి గురువారం (సెప్టెంబర్ 19) మేకర్స్ వెల్లడించారు. దేవర మూవీ అఫీషియర్ ఎక్స్ అకౌంట్ ప్రీరిలీజ్ గురించి చెబుతూ.. "వాళ్ల డెమీగాడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సముద్రమంతటి అభిమానుల కోసం.. అతడు కూడా మిమ్మల్ని చూడటానికి ఆతృతగా ఉన్నాడు. మనం ప్రేమ వరదను మోసుకొద్దాం. 22న కలుద్దాం" అనే క్యాప్షన్ ఉంచింది.
ఇక దేవర మూవీని నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ కూడా ఇదే పోస్ట్ చేసింది. "బిగ్ స్క్రీన్స్ ను తాకే ముందే ఈ ఆవేశానికి స్వాగతం పలుకుదాం. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న. మరిన్ని వివరాలు త్వరలోనే.." అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే అంటే.. అప్పుడే వెన్యూ వివరాలు కూడా తెలవనున్నాయి.
అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ఓపెన్ ఏరియాలో ఈ ఈవెంట్ నిర్వహించాలని భావించినా.. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జోరుగా దేవర ప్రమోషన్లు
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ కోసం మేకర్స్ ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. దేవర టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్దూ జొన్నలగడ్డలతో కూడిన ఇంటర్వ్యూను మేకర్స్ శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అటు ఇప్పటికే చెన్నైలో మూవీ ప్రమోషన్లు నిర్వహించారు. దీనికి మూవీ టీమ్ అంతా వెళ్లింది. అక్కడ తారక్, జాన్వీలాంటి వాళ్లు తమిళంలో మాట్లాడి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తాను తమిళంలో వెట్రిమారన్ తో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు కూడా తారక్ చెప్పాడు.
విజయ్ సర్ డ్యాన్స్ ఇష్టం
తనకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టం అని ఈ మధ్యే తారక్ అన్నాడు. వికటన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడాడు.
"డ్యాన్స్ డ్యాన్స్ లాగే ఉండాలి. అదేదో ఫైట్ లేదా జిమ్నాస్టిక్స్ లాగా అనిపించకూడదు. దానిని సులువుగా చేసేయాలి. విజయ్ సర్ లాగా. అతడు చాలా కష్టపడుతున్నట్లుగా ఎప్పుడూ అనిపించదు. కూల్ గా ఉంటూనే చాలా అందంగా అతడు డ్యాన్స్ చేస్తాడు. అతని డ్యాన్స్ కు నేను వీరాభిమానిని" అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.