Crew Review OTT: ముగ్గురు హీరోయిన్ల హీస్ట్ కామెడీ మూవీ మెప్పించిందా? క్రూ సినిమా రివ్యూ
Crew Review in Telugu: క్రూ సినిమా ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి ఈ మూవీ ఆకట్టుకునేలా ఉందా అనేది ఈ రివ్యూలో చూడండి.
Crew Review OTT: హీరోయిన్లు కరీనా కపూర్, టబు, కృతిసనన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘క్రూ’ సినిమా థియేటర్లలో మంచి హిట్ అయింది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హీస్ట్ థ్రిల్లర్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజై రూ.150కోట్లపైగా వసూళ్లను రాబట్టి విజయం సాధించింది. ఇటీవలే మే 24న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి ఈ సినిమా నవ్విస్తుందా.. ఆకట్టుకునేలా ఉందా అనే విషయాలు ఈ రివ్యూలో తెలుసుకోండి.
క్రూ కథ ఇదే..
ఎయిర్‌లైన్స్ సంస్థ దివాళా తీయడం, ఆ సంస్థలో పని చేసే ముగ్గురు ఎయిర్‌హోస్టెస్ బంగారం స్మగ్లింగ్ చేయడం చుట్టూ క్రూ మూవీ స్టోరీ సాగుతుంది. జాస్మిన్ కోహ్లీ (కరీనా కపూర్), గీతా సేథీ (టబు), దివ్యా రాణా (కృతి సనన్).. కోహినూర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‍గా పని చేస్తుంటారు. అయితే, కంపెనీ ఆర్థిక కష్టాలతో దివాళా దశలో ఉందని చైర్మన్ విజయ్ వాల్యా (స్వస్థ్ ఛటర్జీ) ప్రకటిస్తాడు. విదేశాలకు వెళ్లిపోతాడు. దీంతో ఆరు నెలలుగా ఉద్యోగులకు ఆ సంస్థ జీతాలు ఇవ్వదు. అంతా సవ్యంగానే ఉందంటూ హెచ్ఆర్ హెడ్ (రాజేశ్ శర్మ) ఉద్యోగులతో చెబుతుంటాడు. ఈ క్రమంలోనే జాస్మిన్, గీత, దివ్య ఇళ్లలో ఆర్థిక సమస్యలు పెరుగుతుంటాయి. గీత భర్త అరుణ్ సేథీ (కపిల్ శర్మ) రెస్టారెంట్ బిజెనెస్‍లో నష్టాలు వస్తాయి. జాస్మిన్ లగ్జరీ లైఫ్‍కు అలవాటు పడి ఉంటుంది. పైలట్ కావాలని దివ్య లక్ష్యంగా పెట్టుకొని ఉంటుంది. ఈ తరుణంలో సంస్థ దివాళా తీయటంతో వారికి జీతాలు రాక ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతారు. దీంతో డబ్బు కోసం బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఆ ముగ్గురు సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ముగ్గురు స్మగ్లింగ్ ఎలా చేశారు? కోహినూర్ ఎయిర్‌లైన్స్ దివాళా ఎందుకు తీసింది.. యజమాని ప్లాన్ ఏంటి? అనేది ఈ మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
మెప్పించేలా కామెడీ
క్రూ సినిమాను కామెడీ ప్రధానంగానే ముందుకు నడిపాడు దర్శకుడు రాజేశ్ ఏ కృష్ణన్. నిధి మెహరా, మెహుల్ సూరి రాసిన కథను పర్‌ఫెక్ట్‌గా తెరక్కించాడు. ముఖ్యంగా చాలా సీన్లలో ఫన్ జనరేట్ చేయడం ఈ మూవీకి కలిసి వచ్చింది. అందుకే ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు. క్రిస్ప్‌గా అనిపిస్తుంది. జాస్మిన్, గీత, దివ్యను పోలీసులు అదుపులోకి తీసుకునే సీన్‍తో ఈ మూవీ మొదలవుతుంది. ఆ తర్వాత ప్లాష్‍బ్యాక్ వస్తుంది. ఇలా ఆరంభంలోనే ఇంట్రెస్టింగ్‍గా నడిపించారు డైరెక్టర్. కథలోకి త్వరగానే తీసుకెళ్లాడు.
నరేషన్ ఫ్లాట్ అయినా.. ఫుల్ ఫన్
అయితే, ఓ దశలో క్రూ మూవీ నరేషన్ ఒకే లైన్‍లో ఫ్లాట్‍గా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే, కామెడీ పండటంతో డ్రాగ్ చేసినట్టు అనిపించదు. కామెడీ పంచ్‍లు, వన్‍లైనర్లు నవ్విస్తాయి. ఈ చిత్రంలో ఫన్ అంతా జెన్యూన్‍గా అనిపించడం కూడా ప్లస్‍గా మారింది. జాస్మిన్, గీతూ, దివ్య స్మగ్లింగ్ చేసే సమయంలో పడే హడావుడి, కంగారు.. వారి ప్లాన్‍లు అలరిస్తాయి.
క్రూ మూవీ ఫస్ట్ హాఫ్ మంచి వేగంతో ఫన్‍తో ముందుకు సాగుతుంది. అయితే, రెండో భాగంలో కొన్ని సీన్లు మడత పెట్టేసినట్టు హడావుడిగా ఉంటాయి. విమానం క్రాష్ ల్యాండ్ అయినట్టు అనిపిస్తాయి. అయితే, ఫన్ ఏ మాత్రం తగ్గదు. దుబాయ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కూడా మెప్పిస్తుంది.అయితే, లాజిక్‍లు మాత్రం చాలా చోట్ల మిస్ అవుతాయి. కథ కూడా ఏమంత కొత్తగా అనిపించదు. విజయ్ వాల్యా పేరుతో ఇన్‍డైరెక్ట్‌గా కింగిఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థను గుర్తు తెప్పించారు మేకర్స్.
ముగ్గురూ ముగ్గురే.. కామెడీ టైమింగ్స్ అదుర్స్
క్రూ సినిమాలో కరీనా కపూర్, టబు, కృతిసనన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా నటించారు. ముగ్గురి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా టబు మరింత అద్భుతంగా జీవించారు. టబు, కరీనా కంటే జూనియర్ అయినా కృతి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కస్టమ్స్ ఆఫీసర్‌గా దిల్జీత్ దోశంజ్ మెప్పించారు. గీతా భర్తగా కపిల్ శర్మ కాసేపు కనిపించారు. రాజేశ్ శర్మ, స్వస్థ చటర్జీ తమ పరిధి మేర నటించారు.
మొత్తంగా..
క్రూ చిత్రాన్ని కామెడీ, కాస్త సస్పెన్స్‌తో తెరకెక్కించటంతో దర్శకుడు రాజేశ్ విజయవంతం అయ్యారు. పాటలు మోస్తరుగా అనిపిస్తాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు సూటయ్యేలా సాగుతుంది. ఈ వీకెండ్‍లో ఓటీటీలో చూసేందుకు క్రూ మంచి ఆప్షన్‍గా ఉంది. మంచి ఫన్‍తో ఏ మాత్రం బోర్ కొట్టకుండా సాగుతుంది. ఫుల్ టైమ్ పాస్‍గా ఉంటుంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో స్ట్రీమ్ అవుతోంది. ఓ లుక్కేయండి.
రేటింగ్: 3/5