Waltair Veerayya Trailer: వాల్తేరు వీరయ్య ట్రైలర్ వచ్చేసింది.. బాసు దెబ్బకు పూనకాలతో పిచ్చెక్కిపోవాల్సిందే
Waltair Veerayya Trailer: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా చిరు, రవితేజ మధ్య వచ్చే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
Waltair Veerayya Trailer: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు అన్ని సూపర్ హిట్‌గా నిలిచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వాల్తేరు వీరయ్యలో పూనకాలు లోడింగ్ అంటూ దర్శకుడు బాబీ చెబుతుంటే అతిశయోక్తిగా అనిపించింది. కానీ ట్రైలర్ చూస్తుంటే నిజంగానే పూనకాలే అన్నట్లుగా ఉంది. మెగాస్టార్‌తో పాటు మాస్ మహారాజా రవితేజ చెప్పిన డైలాగ్స్‌కు అభిమానులకే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈల వేయకుండా ఉండలేరు. అంతగా ఈ ట్రైలర్ ఆకట్టుకుంది.
శనివారం సాయంత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిరంజీవి తన గెటప్పుతో పాటు స్లాంగుతోనూ అదరగొట్టారు. అంతేకాకుండా తనదైన శైలి మాస్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. రవితేజ ఎంట్రీ అయితే వేరే లెవల్‌లో ఉంది. చిరు, రవితేజ మధ్యన వచ్చే డైలాగ్స్ అయితే అదిరిపోయాయి.
ఈ ట్రైలర్ గమనిస్తే.. "మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు" అంటూ మెగాస్టార్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటాయి. "వీడు నా ఎర.. నువ్వే నా సొర" అనే మాస్ డైలాగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. చివర్లో "రికార్డుల్లో నా పేరుండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి" అనే డైలాగ్ మాస్ ప్రియులను ఆకర్షిస్తుంది.
మరోపక్క రవితేజ ఎంట్రీతోనే "వైజాగ్‌లో గట్టి వేటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట" అంటూ తనతో పాటు మెగాస్టార్‌కు ఎలివేషన్ ఇస్తారు. చివర్లో చిరంజీవిని ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని చెబుతూ.. "ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయని" వార్నింగ్ ఇస్తారు. అనంతరం చిరంజీవి కూడా తనదైన శైలిలో "సిటీకి ఎంతో మంది కమీషనర్లు వస్తూ ఉంటారు.. పోతుంటారు" కానీ వీరయ్య లోకల్ అంటూ రవితేజ డైలాగ్స్ చెప్పడం ఆసక్తికరంగా ఉంటుంది.
బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.