Chiranjeevi on Tollywood: వాళ్లు ముదుర్లు.. నేను ఇండస్ట్రీ పెద్దను కాను: చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi on Tollywood: వాళ్లు ముదుర్లు.. నేను ఇండస్ట్రీ పెద్దను కాను అంటూ మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గురువారం (డిసెంబర్ 29) చిత్రపురి కాలనీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మీడియాతో మాట్లాడాడు.
Chiranjeevi on Tollywood: టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా పేరుగాంచిన నటుడు చిరంజీవి. నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ఇండస్ట్రీలో ఉన్న చిరు.. ప్రస్తుతం అత్యంత సీనియర్. ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉన్న దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి తీసుకుంటారని, తీసుకోవాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.
అయితే ఈ ఇండస్ట్రీ పెద్ద ట్యాగ్‌పై తాజాగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గురువారం (డిసెంబర్ 29) హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం నిర్మించిన ఎంఐజీ, హెచ్‌ఐజీ క్వార్టర్స్‌ను చిరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందులో ఇళ్లు సంపాదించిన సినీ కార్మికులు అందరికీ అతడు శుభాకాంక్షలు చెప్పాడు. ఇది వారి జీవితాల్లో మరచిపోలేని రోజు అని అన్నాడు.
ఈ సందర్భంలోనే టాలీవుడ్ పెద్ద అనే ట్యాగ్‌పై చిరు స్పందించాడు. తాను ఇండస్ట్రీ పెద్ద కాదని స్పష్టం చేశాడు. నిజానికి ఆ ట్యాగ్ కావాలని కూడా తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపాడు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే మాత్రం దానిని పరిష్కరించడానికి తాను అందరికంటే ముందు ఉంటానని మాత్రం ఈ సందర్భంగా సినీ కార్మికులకు భరోసా ఇచ్చాడు.
ఇండస్ట్రీలో ఎక్కువ మందికి మేలు చేసే పని కోసం తాను చేయూత అందిస్తానని తెలిపాడు. సినీ కార్మికులకు పూర్తి మద్దతుగా ఉంటానని చెప్పాడు. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సీ కల్యాణ్‌లపై చిరు సరదాగా సెటైర్లు వేశాడు. "వాళ్లు నన్ను పెద్ద అంటారు. నేను పెద్ద కాదు. వాళ్లే ముదుర్లు" అని చిరు నవ్వుతూ అనడంతో అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వారు.
ఆ వెంటనే వాళ్లు తనకంటే వయసులో పెద్ద వారని చిరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చిత్రపురి కాలనీ కోసం కృషి చేసిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకున్నాడు. ఆయన తన భూమిని దీనికోసం దానం చేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నాడు. దాసరితోపాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులను కూడా చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్