Boycott Sai Pallavi: బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్న నెటిజన్లు.. ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్.. ఇదీ కారణం
Boycott Sai Pallavi: బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్నారు ఎక్స్ లో కొందరు నెటిజన్లు. ఇప్పుడీ #Boycottsaipallavi హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. దీనికి రెండేళ్ల కిందటి వీడియో కారణమైంది.
Boycott Sai Pallavi: సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందు ఎక్స్ అకౌంట్లో బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్నారు కొందరు నెటిజన్లు. ఆమె ఇండియన్ ఆర్మీని అవమానించిందంటూ రెండేళ్ల కిందటి ఓ వీడియోను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి విమర్శిస్తుండటం గమనార్హం. విరాట పర్వం మూవీ రిలీజ్ కు ముందు ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సాయిపల్లవితోపాటు అమరన్ మూవీ టీమ్ మెడకు చుట్టుకుంటున్నాయి.
బాయ్‌కాట్ సాయి పల్లవి అంటున్న నెటిజన్లు
సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ మూవీ ప్రమోషన్లలో సాయి పల్లవితోపాటు టీమ్ అంతా బిజీగా ఉంటే.. సడెన్ గా ఆమె పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదే ఇప్పుడు బాయ్‌కాట్ సాయి పల్లవి టాప్ ట్రెండింగ్ గా మారడానికి కారణమైంది. ఆ వీడియో విరాట పర్వం మూవీ రిలీజ్ కు ముందు సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూ. అందులో ఆమె మాట్లాడుతూ.. మన ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకు టెర్రరిస్టులుగా కనిపించవచ్చు అని అనడం వినిపిస్తుంది. ఇది చూసి ఆమె ఇండియన్ ఆర్మీని అవమానించిందని, ఆమెను బాయ్‌కాట్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు.
ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్
సోమవారం (అక్టోబర్ 28) ఎక్స్ అకౌంట్లో బాయ్‌కాట్ సాయి పల్లవి హ్యాష్‌ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అదే కాదు కశ్మీర్ ఫైల్స్ మూవీలో కశ్మీరీ పండితుల ఊచకోతను ఆమె ఓ ముస్లిం డ్రైవర్ ను కొట్టి చంపడంతో పోల్చి చెబుతూ గతంలో చేసిన కామెంట్స్ కూడా దీనికి తోడయ్యాయి. దీంతో నెటిజన్లు సాయి పల్లవిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఆమె ఇండియన్ ఆర్మీనే కాదు.. వాళ్ల కుటుంబాలను కూడా అవమానించిందని ఒకరు.. సాయి పల్లవి హీరో టెర్రరిస్ట్ కసబ్ అని మరొకరు.. ఇలాంటి వ్యక్తి సీతగా ఎలా నటిస్తోందని ఇంకొకరు కామెంట్స్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు ఆమెకు మద్దతుగా కూడా కొందరు పోస్టులు చేస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి ఇలా బాయ్‌కాట్ అంటున్నారంటే ఆమె ఎంత ద్వేషం నింపుకున్నారో అర్థమవుతోందని వాళ్లు అంటున్నారు.
మరోవైపు అమరన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి ఈ మధ్యే నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లి.. మేజర్ ముకుంద్ వరదరాజన్ తోపాటు ఇతర అమరులైన జవాన్లకు నివాళులర్పించింది.