Satish Kaushik Passed Away: బాలీవుడ్‌లో విషాదం - రీమేక్ సినిమాల స్పెష‌లిస్ట్ స‌తీష్ కౌశిక్ క‌న్నుమూత-bollywood actor director sathish kaushik passed away due to cardiac arrest ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood Actor Director Sathish Kaushik Passed Away Due To Cardiac Arrest

Satish Kaushik Passed Away: బాలీవుడ్‌లో విషాదం - రీమేక్ సినిమాల స్పెష‌లిస్ట్ స‌తీష్ కౌశిక్ క‌న్నుమూత

Nelki Naresh Kumar HT Telugu
Mar 09, 2023 09:42 AM IST

satish kaushik passed away: బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌తీష్ కౌశిక్ గుండెపోటుతో గురువారంక‌న్నుమూశారు. మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో న‌టుడిగా వంద‌కుపైగా సినిమాలు చేశారు. ద‌ర్శ‌కుడిగా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్ని తెర‌కెక్కించారు.

 స‌తీష్ కౌశిక్
స‌తీష్ కౌశిక్

satish kaushik passed away: బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌తీష్ కౌశిక్ (66) గురువారం గుండెపోటుతో క‌న్నుమూశాడు. స‌తీష్ కౌశిక్ మ‌ర‌ణ‌వార్త‌ను అత‌డి ప్రాణ స్నేహితుడు, న‌టుడు అనుప‌మ్ ఖేర్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో న‌టుడిగా వంద‌కుపైగా సినిమాలు చేశాడు స‌తీష్ కౌశిక్‌. ద‌ర్శ‌కుడిగా తేరేనామ్‌తో పాటు ప‌దిహేనుకుపైగా సినిమాల్ని రూపొందించారు.

అనిల్ క‌పూర్‌, శ్రీదేవి జంట‌గా న‌టించిన రూప్ కి రాణి చోరోంకా రాజా సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌తీష్ కౌశిక్ కెరీర్ ఆరంభ‌మైంది. కానీ అదే ఏడాది కాక‌తాళీయంగా న‌టుడిగా అరంగేట్రం చేశారు.

కుంద‌న్‌షా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జానే బీ దో యారో సినిమాకు సతీష్ కౌశిక్ మాట‌లు రాశారు. ఆ సినిమాలో విల‌న్ అసిస్టెంట్ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు ప‌లువురు న‌టుల్ని అనుకున్నారు. కానీ వారు ఎవ‌రు సెట్ కాక‌పోవ‌డంతో స‌తీష్ కౌశిక్‌ను తీసుకున్నారు. ఈ పాత్ర‌లో స‌తీష్ కౌశిక్ కామెడీ టైమింగ్‌కు మంచి పేరు రావ‌డంతో న‌టుడిగా అవ‌కాశాలు వెల్లువెత్తాయి.

మిస్ట‌ర్ ఇండియాలో క్యాలెండ‌ర్‌గా, దీవానా మ‌స్తానాలో ప‌ప్పు పేజ‌ర్‌గా స‌తీష్ కౌశిక్ క్యారెక్ట‌ర్స్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయాయి. క‌మెడియ‌న్‌గా, విల‌న్ అసిస్టెంట్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాల్లో వైవిధ్య‌మైన న‌ట‌న‌తో మెప్పించారు. ఇటీవ‌ల ఓటీటీలో రిలీజైన ఛ‌త్రివాలీ అత‌డు న‌టించిన చివ‌రి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. స‌తీష్ కౌశిక్ మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది.

రీమేక్‌ల స్పెష‌లిస్ట్‌

సుదీర్ఘ ప్ర‌యాణంలో స‌తీష్ కౌశిక్ ప‌దిహేనుకుపైగా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అందులో ఒక‌టి రెండు మిన‌హా చాలా వ‌ర‌కు రీమేక్ సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం.

హ‌మ్ ఆప్‌కే దిల్ మే ర‌హ‌తాహై (ప‌విత్ర బంధం రీమేక్‌), హ‌మారా దిల్ ఆప్ కే పాస్ హై (పెళ్లి చేసుకుందాం రీమేక్‌), ముజే కుచ్ కెహ‌నా హై (తొలిప్రేమ రీమేక్‌), తేరేనామ్ ( త‌మిళ్ ఫిల్మ్ సేతు రీమేక్‌) ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2021 పంక‌జ్ త్రిపాఠితో స్వీయ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో కాగ‌జ్ అనే సినిమాను తెర‌కెక్కించారు స‌తీష్ కౌశిక్‌. ఇదే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చివ‌రి సినిమా.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.