PM Modi Biopic : త్వరలో థియేటర్లలోకి ప్రధాని మోదీ బయోపిక్..
Modi Biopic : ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సబ్బీర్ ఖురేషీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రధాని మోదీ(PM Modi) జీవిత చరిత్ర ఆధారంగా.. ఓ బయోపిక్(Biopic) వస్తుంది. మోదీ కథను వివరిస్తూ.., సబ్బీర్ ఖురేషీ 'ఏక్ నయా సవేరా'(ఒక కొత్త ఉదయం) పేరుతో సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం నరేంద్ర మోదీ(Narendra Modi) చిన్నతనం నుంచి భారతదేశ ప్రధానమంత్రి అయ్యే వరకు విజయవంతమైన ప్రయాణాన్ని చూపిస్తుంది. సబ్బీర్ ఖురేషీ దర్శకత్వం వహిస్తుండగా.. డాక్టర్ అబ్దుల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. సినిమా రన్ టైమ్ 1 గంట, 13 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. మోదీ వ్యక్తిత్వాన్ని హైలెట్ చేసేలా సినిమా ప్లాన్ చేశారు. మోదీ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను కూడా ఇందులో చూపిస్తారు. అయితే కీలకమైన వాటి మీదే ఫొకస్ చేసినట్టుగా తెలుస్తోంది. దర్శకుడు సబ్బీర్ ఖురేషీ మోదీ జీవిత కథను పరిశోధించడానికి ఆరు నెలలు సమయం కేటాయించాడు.
'మన ప్రధానిపై నాకు అపారమైన అభిమానం, గౌరవం ఉంది. ఆయన కథను సినిమా ద్వారా ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని మోదీ(PM Modi) బాల్యం నుంచి తనను తాను విజయవంతంగా నిరూపించుకునేవరకు సినిమాలో చూపిస్తాం. భవిష్యత్ తరాలను ప్రోత్సహించే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రం ముఖ్యంగా సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ, తదితర అంశాల గురించి కూడా చెబుతుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని మేం భావిస్తున్నాం.' అని దర్శకుడు సబ్బీర్ ఖురేషీ అన్నారు.
ఈ సినిమాలో నరేంద్ర మోదీగా రుద్ర రాంతేకర్, వయసు పెరిగిన తర్వాత మోదీగా వికాస్ మహంతే నటిస్తున్నారు. సికందర్ ఖాన్ మోదీ తండ్రిగా, శాంతి దేవి అగర్వాల్.. మోదీ తల్లి హీరాబెన్ పాత్రలో కనిపిస్తారు. సినిమాను కూడా త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
'ఏక్ నయా సవేరా నా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటి. PM గురించి అందరికీ తెలియదని నేను అనుకుంటున్నాను. మోదీ నిజమైన వ్యక్తిత్వం, ఆయన చరిష్మాలో ఇంతకు ముందు చూడనివి సినిమాలో చూపిస్తాం.' అని నిర్మాత డాక్టర్ అబ్దుల్లా అన్నారు.