Biggest Flop Movie: బడ్జెట్ రూ.45 కోట్లు.. వచ్చింది రూ.45 వేలు.. ఇండియాలో ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ లేదు
Biggest Flop Movie: ఇండియాలో ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ మరొకటి లేదు. ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు వచ్చింది కేవలం రూ.45 వేలే అంటే నమ్మగలరా? గతేడాది రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలోనూ రిలీజ్ కాలేదు.
Biggest Flop Movie: ఫ్లాప్ మూవీ అంటే బాక్సాఫీస్ దగ్గర పెట్టిన బడ్జెట్ కంటే తక్కువ వసూళ్లు సాధించే మూవీని అంటారు. కానీ పెట్టిన బడ్జెట్ లో కేవలం 0.0001 శాతం మాత్రమే వసూలు చేసిన సినిమాను ఏమనాలి? ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ మరొకటి ఉండదేమో. ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెకకిన మూవీ వసూలు చేసింది మాత్రం కేవలం రూ.45 వేలు మాత్రమే.
బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇదే
ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు, అంతకు మించిన ప్రమోషన్లతో వచ్చే సినిమాలే ఉంటున్నాయి. కానీ ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినా.. కనీసం మూవీ కూడా పూర్తి కాకుండానే, అసలు ఎలాంటి ప్రమోషన్లు లేకుండా తెరకెక్కిన మూవీ ఒకటి ఉందంటే నమ్మగలరా? ఈ సినిమా పేరు ది లేడీ కిల్లర్.
ఇది ఇండియాలోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. గతేడాది నవంబర్ 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ నటించారు. ఎన్నో ఏళ్ల ఆలస్యం, అన్ని లెక్కలు దాటేసిన బడ్జెట్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రిలీజ్ చేసేశారు. ఫలితం డిజాస్టర్లకే డిజాస్టర్.
కేవలం 12 షోలు మాత్రమే
ది లేడీ కిల్లర్ సినిమాను రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 12 షోలు మాత్రమే ఆడాయి. తొలి రోజు రూ.38 వేలు రాగా.. మొత్తంగా రూ.45 వేలు మాత్రమే వసూలయ్యాయి. తొలి రోజు దేశం మొత్తం కలిపి 293 టికెట్లు అమ్ముడుపోయాయంటే ఈ సినిమా దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాను కనీసం పూర్తి చేయకుండానే థియేటర్లలో రిలీజ్ చేశారంటే నమ్మశక్యం కాదు. మూవీ డిజిటల్ హక్కులను ముందుగానే అమ్మేశారు. డిసెంబర్ లో స్ట్రీమింగ్ కు రావాల్సి ఉండటంతో నవంబర్ తొలి వారంలోనే హడావిడిగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. దీంతో కనీసం షూటింగ్ కూడా పూర్తి కాలేదని సమాచారం.
అసలు ప్రమోషన్లు లేకుండానే..
ఈ సినిమాలో నటించిన అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ఈ మూవీ ప్రమోషన్లు చేయమని తేల్చి చెప్పారు. దీంతో అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందనే ఎవరికీ తెలియదు. ఒక్క ట్రైలర్ తప్ప మూవీ నుంచి ఏ అప్డేట్ బయటకు రాలేదు. సినిమా ఇంత దారుణంగా రిలీజ్ కావడాన్ని మేకర్స్ జీర్ణించుకోలేకపోయారు.
అయితే ఏ ఓటీటీ రిలీజ్ కోసం సినిమాను హడావిడిగా రిలీజ్ చేశారో.. ఆ ఓటీటీ రిలీజ్ ఇప్పటికీ కాకపోవడం ఇక్కడ మరో విశేషం. ది లేడీ కిల్లర్ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నా.. ఇప్పటి వరకూ స్ట్రీమింగ్ కు రాలేదు. గతేడాది నవంబర్ రిలీజైంది. అంటే పది నెలలు గడిచిపోయినా మూవీ ఓటీటీ రిలీజ్ పైనా అప్డేట్ లేదు.