Netflix Kalki 2898 AD: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్.. రికార్డు వ్యూస్
Netflix Kalki 2898 AD: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతోంది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ ఓటీటీలో టాప్ గ్లోబల్ ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటికే రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది.
Netflix Kalki 2898 AD: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఆగస్ట్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్న నెట్‌ఫ్లిక్స్ లో ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రికార్డు వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి 2898 ఏడీ
కల్కి 2898 ఏడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్ లోకీ వచ్చింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు ప్రైమ్ వీడియోలో రాగా.. నెట్‌ఫ్లిక్స్ లో కేవలం హిందీ వెర్షన్ వచ్చింది. ఇప్పుడా వెర్షనే ఈ ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇంగ్లిషేతర భాషల సినిమాల గ్లోబల్ ట్రెండింగ్స్ లో కల్కి 2898 ఏడీ రెండో స్థానంలో నిలిచింది.
ప్రభాస్ నటించిన ఈ సినిమాకు ఇప్పటికే 4.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 25తో ముగిసిన వారానికిగాను ఈ లిస్ట్ రిలీజ్ చేశారు. అయితే కల్కి మాత్రం ఆగస్ట్ 22న అడుగుపెట్టి.. ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లడం విశేషం. తొలి స్థానంలో 5 మిలియన్ల వ్యూస్ తో ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ యు అనే మూవీ ఉంది. రెండు వారాలుగా ఆ సినిమానే టాప్‌లో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ మూవీస్ లో మాత్రం కల్కి 2898 ఏడీ టాప్ లోనే ఉంది. అయితే ఈ వారం మాత్రం గ్లోబల్ ట్రెండింగ్స్ లోనూ టాప్ లోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వారం మధ్యలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చినా.. 4 రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ పూర్తి వారం మరిన్ని రికార్డు వ్యూస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ప్రైమ్ వీడియోలోనూ రెండో స్థానంలోనే..
అటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ కల్కి 2898 ఏడీ తెలుగు వెర్షన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే టాప్ ట్రెండింగ్ మూవీస్ లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ధనుష్ రాయన్ మూవీ వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రభాస్ మూవీ రెండో స్థానానికి పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజైన కల్కి 2898 ఏడీ మూవీ రూ.1200 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటీటీలోకి కూడా ఊహించినదాని కంటే ముందే వచ్చిన ఈ సినిమా.. ఇక్కడా అదే జోరు కొనసాగిస్తోంది.