Bigg Boss contestant arrested: బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. 14 రోజుల కస్టడీ.. ఇదీ కారణం
Bigg Boss contestant arrested: బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్ అయ్యాడు. అతన్ని 14 రోజుల కస్టడీకి పంపించారు. బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ వర్తూర్ సంతోష్ ను పులి గోరు ధరించాడన్న కారణంతో అరెస్ట్ చేయడం గమనార్హం.
Bigg Boss contestant arrested: బిగ్ బాస్ కంటెస్టెంట్ ను అరెస్ట్ చేసిన ఘటన సంచలనం రేపింది. బిగ్ బాస్ కన్నడలో కనిపించిన వర్తూర్ సంతోష్ అనే కంటెస్టెంట్ ను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. సోమవారం అతన్ని బెంగళూరులోని అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించారు.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో సంతోష్ మెడలో పులి గోరును ధరించడమే అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం. అటవీ శాఖ అధికారులు సంతోష్ ను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆదివారం రాత్రి బిగ్ బాస్ సెట్స్ లోనే అతన్ని అరెస్ట్ చేయడం విశేషం. నిర్వాహకులు సంతోష్ ను హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత అటవీ శాఖ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
సుమోటో కేసును ఫైల్ చేసిన తర్వాత అటవీ శాఖ అధికారులు సంతోష్ ను అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సంతోష్ నుంచి ఆ పులి గోరు ఉన్న లాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. అది పులి నుంచి తీసుకున్నదా లేక మరే ఇతర జంతువు నుంచి తీసుకున్నారా అన్నది తేల్చనున్నారు. దీనికోసం దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
ఈ విషయమై సంతోష్ ను ప్రశ్నించినప్పుడు అది తన పూర్వీకులు తనుకు ఇచ్చినట్లు చెప్పాడని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం.. పులి గోరును ధరించడం శిక్షార్హమైన నేరం. బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంతోష్.. బెంగళూరులోని వర్తూర్ లో ఆవులను అమ్మే వ్యాపారం చేస్తుంటాడు.
హల్లికార్ అనే జాతి ఆవులను సంతోష్ అమ్ముతుంటాడు. అంతేకాదు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాడని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ కావడంతో పాపులర్ అయ్యాడు. అదే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరయ్యేలా చేసింది.