Bastar The Naxal Story Review: బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా రివ్యూ.. ఆదా శర్మ కొత్త సినిమా ఎలా ఉందంటే..-bastar the naxal story movie review adah sharma sudipto sen film failed to impress ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bastar The Naxal Story Review: బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా రివ్యూ.. ఆదా శర్మ కొత్త సినిమా ఎలా ఉందంటే..

Bastar The Naxal Story Review: బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా రివ్యూ.. ఆదా శర్మ కొత్త సినిమా ఎలా ఉందంటే..

HT Telugu Desk HT Telugu
Mar 15, 2024 08:38 PM IST

Bastar: The Naxal Story Review: ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ‘బస్తర్ - ది నక్సల్ స్టోరీ’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. నక్సలిజం బ్యాక్‍డ్రాప్‍లో, యదార్థ ఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే..

Bastar The Naxal Story Review: బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ఆదా శర్మ కొత్త సినిమా ఎలా ఉందంటే..
Bastar The Naxal Story Review: బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ఆదా శర్మ కొత్త సినిమా ఎలా ఉందంటే..
  • సినిమా: బస్తర్: ది నక్సల్ స్టోరీ
  • విడుదల: మార్చి 15, 2024
  • ప్రధాన నటీనటులు: అదా శర్మ, ఇందిరా తివారీ, నమన్ జైన్, రైమా సేన్, యశ్‍పాల్ శర్మ
  • సంగీతం: విశాఖ్ జ్యోతి
  • నిర్మాత: విపుల్ అమృత్‍లాల్ షా
  • దర్శకత్వం: సుదీప్తో సేన్

అదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా గతేడాది తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‍లో ‘బస్తర్': ది నక్సల్ స్టోరీ’ సినిమా వచ్చింది. ఈ హిందీ చిత్రం నేడు (మార్చి 15) థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

కథ ఇదే

చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం సుక్మాలో 2010లో నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటన ఆధారంగా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రం తెరకెక్కింది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంది. నక్సలైట్లు ఆ ప్రాంతం వారిని భయపెట్టినట్టు, భద్రతా దళాలను, అధికారులను చంపినట్టు ఈ మూవీలో మేకర్స్ చూపించారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లను నిలువరించేందుకు ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ)ను ప్రభుత్వం రంగంలోకి దించుకుంది. మరోవైపు నీరజ నకిలీ ఎన్‍కౌంటర్లు చేశారని కోర్టులో వాదిస్తుంటారు లాయర్ నీలమ్ నాగ్‍పాల్ (శిల్పా శుక్లా). మరోవైపు నక్సలైట్లు తమ కార్యకలాపాలను జోరుగా చేస్తుంటారు. మరి నక్సలైట్లను ఐపీఎస్ నీరజ నిలువరించిందా? తర్వాత ఏం జరిగింది? అనేదే మిగిలిన కథగా ఉంది.

విశ్లేషణ

నక్సలైట్ల సంక్లిష్టమైన చరిత్రను విభిన్న కోణాల్లో కాకుండా ఒకే తీరులో ఈ చిత్రంలో మేకర్స్ చూపించారు. రాసుకున్న కథకు అనుగుణంగా ఒకే దిశగా ఈ సినిమాను తెరకెక్కించారు. వివిధ కోణాల్లో నక్సలైట్ల అంశాన్ని చూపించే ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. నక్సలైట్లను దేశ వ్యతిరేకులుగా, అభివృద్దికి ఆటంకాలుగా చూపించారు. కొందరు ప్రొఫెసర్లు, కార్యకర్తలు.. యూనివర్సటీ విద్యార్థులు, విద్యార్థులకు నక్సలిజనాన్ని నూరిపోసినట్టు సీన్లు కూడా ఉన్నాయి. అయితే, నక్సలిజాన్ని నిరోధించడం ఎంత అవసరమో కూడా మేకర్స్ బలంగా తెరకెక్కించారు. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంది. చెప్పాలనుకున్న విషయాన్ని హార్డ్ హిట్టింగ్‍గా చూపించారు.

నక్సలిజాన్ని అంతం చేయాలన్న కసితోనే ఐపీఎస్ నీరజా మాధవన్ కనిపిస్తారు. అయితే, ఆమె క్యారెక్టర్ అంతా ఒకే దిశగా సాగుతుంది. కాసేపటి తర్వాత అంత రిలేట్ అవదు. జాతీయ గీతం పాడుతున్న సందర్భంలో నక్సలైట్లు ఓ వ్యక్తిని చంపినట్టు మేకర్స్ చూపించారు. ఆ బాధితుడి భార్య పోలీసుల్లో చేరగా.. కుమారుడు నక్సలైట్ అవుతారు. ఇలా కథలో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు. అయితే, కాసేపటికి కథనం ఏక రీతిన సాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే, ఎక్కువ శాతం గ్రిప్పింగ్‍గా ఉంటుంది. మొత్తంగా బస్తర్ సినిమా కూడా వివాదాస్పదంగానే మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

నటీనటులు ఎలా..

అదా శర్మ మరోసారి ఈ చిత్రంలో నటనపరంగా మెప్పించారు. అయితే, ట్రైనింగ్ ఎక్కువగా తీసుకోని కారణంగా షూటింగ్, ఫిట్‍నెస్ విషయాల్లో కాస్త లోపాలు కనిపిస్తాయి. అయితే, యాక్టింగ్‍లో ఇంటెన్సిటీ చూపించారు. తల్లీకొడుకులుగా నటించిన ఇందిరా తివారీ, నమన్ జైన్ వారి పాత్రలను న్యాయం చేశారు. నమన్ జైనా, యశ్‍పాల్ శర్మ, రైమా సేన్ వారి పరిధి మేర నటించారు.

హింస

ఈ చిత్రంలో చాలా చోట్ల హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉంటాయి. చాలా చోట్ల కళ్లు మూసుకోవాల్సిన అవసరం కూడా రావొచ్చు. కొన్ని సీన్లను చూడాలంటే గుండెను రాయి చేసుకోవాల్సిందే.

మొత్తంగా.. ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రం నక్సలైట్లను నిలువరించాల్సిన అవసరం గురించి చెబుతుంది. అయితే, నక్సలైట్ల అంశంలో చాలా అంశాలను మేకర్స్ విశదీకరించలేదు. ఒకే తీరులో చూపించేశారు. అయితే, భద్రతా తళాల త్యాగాలను ఈ చిత్రంలో బాగా హైలైట్ చేశారు. దేశభక్తి అంశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ చిత్రం ఎంగేజింగ్‍గానూ సాగుతుంది.

రేటింగ్: 2.5/5

Whats_app_banner