Avatar Producer Dead: అవతార్, టైటానిక్ సినిమాల ప్రొడ్యూసర్ కన్నుమూత.. జేమ్స్ కామెరాన్‌తో ప్రత్యేక అనుబంధం
Avatar Producer Dead: టైటానిక్, అవతార్ వంటి ప్రాజెక్టులకు జేమ్స్ కామెరాన్ తో కలిసి పనిచేసిన జాన్ లాండౌ క్యాన్సర్ తో పోరాడి మరణించారు. అతని వయసు 63 ఏళ్లు.
Avatar Producer Dead: ఆస్కార్ అవార్డు గ్రహీత, దర్శకుడు జేమ్స్ కామెరాన్ తో కలిసి మూడు అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ టైటానిక్, రెండు అవతార్ చిత్రాలకు పనిచేసిన నిర్మాత జాన్ లాండౌ కన్నుమూశారు. ఆయన వయసు 63 ఏళ్లు. జాన్ కుటుంబం శనివారం (జులై 6) అతని మరణం గురించి ప్రపంచానికి తెలిపింది.
జేమ్స్ తో జాన్ భాగస్వామ్యం
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తో ప్రొడ్యూసర్ జాన్ లాండౌకి మంచి సంబంధాలు ఉన్నాయి. 1997లో వచ్చిన టైటానిక్ కు మూడు ఆస్కార్ నామినేషన్లు లభించగా.. ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ ఇద్దరూ కలిసి అవతార్, దాని సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ తో సహా చలనచిత్ర చరిత్రలో కొన్ని అతిపెద్ద బ్లాక్ బస్టర్లను రూపొందించారు.
జేమ్స్ కామెరాన్ సంతాపం
తన స్నేహితుడి మరణంపై జేమ్స్ కామెరాన్ స్పందించాడు. ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. "ఒక ప్రియమైన స్నేహితుడు, 31 సంవత్సరాల నా సన్నిహిత సహచరుడు అతడు. నాలో కొంత భాగం విడిపోయినట్లుగా అనిపిస్తోంది" అని అన్నాడు.
"అతని హాస్యం, గొప్ప ఉదారత, గంభీరమైన స్వభావం దాదాపు రెండు దశాబ్దాల పాటు మన అవతార్ విశ్వానికి కేంద్ర బిందువుగా నిలిచాయి" అని కామెరాన్ చెప్పాడు. “అతని వారసత్వం అతను నిర్మించిన చిత్రాలే కాదు, అతను నెలకొల్పిన వ్యక్తిగత లక్ష్యాలు కూడా. అతడో అనిర్వచనీయమైన, శ్రద్ధగల, సమ్మిళిత, అవిశ్రాంత, ప్రత్యేకమైన వ్యక్తి” అని కామెరాన్ అభిప్రాయపడ్డాడు.
జాన్ కెరీర్ ఇలా..
1980 లలో ప్రొడక్షన్ మేనేజర్ గా జాన్ కెరీర్ ప్రారంభమైంది. అతను క్రమంగా ఎదిగాడు, హనీ ఐ ష్రంక్ ద కిడ్స్ అండ్ డిక్ ట్రేసీకి సహ నిర్మాతగా పనిచేశాడు. 1912లో సముద్రంలో జరిగిన విపత్తుపై జేమ్స్ కామెరాన్ తీసిన టైటానిక్ లో అతను నిర్మాతగా మారాడు. ఇది వర్కౌట్ అయింది. టైటానిక్ ప్రపంచ బాక్సాఫీస్ వసూళ్లలో 1 బిలియన్ డాలర్లను దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. ఉత్తమ చిత్రంతో సహా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.
ఇక 2009లో ఈ ఇద్దరూ అద్భుతమైన 3డి టెక్నాలజీతో చిత్రీకరించి థియేటర్లలో ప్రదర్శించిన సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్.. టైటానిక్ బాక్సాఫీస్ విజయాన్ని అధిగమించింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూడో స్థానంలో ఉంది. అవతార్ ఫ్రాంచైజీలో జాన్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.
జాన్ మరణంపై డిస్నీ ఎంటర్టైన్మెట్ కో ఛైర్మన్ అలాన్ బెర్గ్‌మన్ స్పందించారు. "జాన్ ఒక దార్శనికుడు, అతని అసాధారణ ప్రతిభ, అభిరుచి కొన్ని మరపురాని కథలకు సిల్వర్ స్క్రీన్ పై ప్రాణం పోశాయి. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలు చెరగని ముద్ర వేశాయి. ఆయనను ఎప్పటికీ మిస్ అవుతాము. ఆయన ఒక ఐకానిక్, విజయవంతమైన నిర్మాత. ఇంకా మంచి వ్యక్తి" అని అలాన్ అన్నారు.
జులై 23, 1960న న్యూయార్క్ లో జన్మించిన జాన్.. సినిమా నిర్మాతలు ఎలీ, ఎడీ లాండౌల కుమారుడు. కుటుంబం 1970 లలో లాస్ ఏంజిల్స్ కు మారింది. లాండౌ దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఫిల్మ్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు. 1993లో ఎలీ లాండౌ మరణించారు. ఇక అతని తండ్రి ఎడీ.. 2022లో కన్నుమూశారు.