Avatar 2 Billion Dollar Collection: అవతార్ 2 అరుదైన రికార్డు.. బిలియన్ డాలర్ మార్కు అందుకున్న చిత్రం
Avatar 2 Billion Dollar Collection: అవతార్ 2 అరుదైన రికార్డును సాధించింది. విడుదలైన 12 రోజుల్లోనే బిలియన్ డాలర్ మార్కును కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారత కరెన్సీలో రూ.8200 కోట్ల వసూళ్లు వచ్చాయి.
Avatar 2 Billion Dollar Collection: జేమ్స్ కామెరూన్ ఎపిక్ మూవీ అవతార్ ది వే ఆఫ్ వాటర్ డిసెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రం 14 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్(దాదాపు రూ.8 వేల 200 కోట్లు) మార్కును అధిగమించింది. 12 రోజుల్లోనే బిలియన్ డాలర్ మార్కును సాధించడం గమనార్హం. ఫలితంగా ఈ ఏడాది వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా నిలిచింది.
2022లో ఇప్పటి వరకు మూడు సినిమాలు బిలియన్ డాలర్ మైలురాయిని అందుకున్నాయి. టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా విడుదలైన 31 రోజుల్లో ఈ రికార్డును సాధిస్తే.. క్రిస్ ప్రాట్ నటించిన జురాసిక్ డొమినియన్ విడుదలైన నాలుగు నెలలకు ఈ ఘనత సాధించింది. తాజాగా అవతార్ 2 విడుదలైన 12 రోజుల్లోనే ఈ రికార్డును కైవసం చేసుకుంది.
2019లో ప్రపంచ వ్యాప్తంగా 9 సినిమాలు 1 బిలియన్ డాలర్ మార్కును అందుకున్నాయి. అయితే 2021 నుంచి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్(12 రోజుల్లో) తర్వాత అత్యంత వేగంగా 1 బిలియన్ డాలర్ మార్కును అందుకున్న చిత్రంగా అవతార్ 2 రికార్డు సృష్టించింది. మొదటి రెండు వారాల్లో 1 బిలియన్ డాలర్ మార్కును అందుకున్న సినిమాలు కేవలం ఆరు మాత్రమే ఉండటం గమనార్హం. తాజాగా ఈ జాబితాలో అవతార్ 2 కూడా చేరిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం జేమ్స్ కామెరూన్ అవతార్ మొదటి భాగం 2.97 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే అవతార్ 2కు మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. మొత్తంగా 1.025 బిలియన్ డాలర్లు రాగా.. ఉత్తర అమెరికాలో 317 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 712 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.
ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల్లో ఒకటైన జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని అధిగమించి అవతార్-2 రెండో స్థానానికి చేరింది. మహమ్మారి కాలంలో అత్యధిక వసూళ్ల సాధించిన మూడో చిత్రంగా ఇది నిలిచింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై ప్రభావం పడింది. మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా బయటపడకపోవడం అవతార్ 2 వసూళ్లు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. ప్రధాన థ్రియేట్రికల్ మార్కెట్లు అయిన చైనా కరోనాతో సతమతమవడం, పాశ్చాత్య దేశాల సినిమాలు రష్యాలో నిషిద్ధం కావడం లాంటి కారణాల వల్ల ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి.
సంబంధిత కథనం
టాపిక్