Athidhi Series Review: అతిథి వెబ్ సిరీస్ రివ్యూ: ట్విస్టులు ఉన్నాయి.. కానీ: వేణు హర్రర్ సిరీస్ ఎలా ఉందంటే?-athidhi disney plus hotstar horror web series review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Athidhi Series Review: అతిథి వెబ్ సిరీస్ రివ్యూ: ట్విస్టులు ఉన్నాయి.. కానీ: వేణు హర్రర్ సిరీస్ ఎలా ఉందంటే?

Athidhi Series Review: అతిథి వెబ్ సిరీస్ రివ్యూ: ట్విస్టులు ఉన్నాయి.. కానీ: వేణు హర్రర్ సిరీస్ ఎలా ఉందంటే?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 19, 2023 02:50 PM IST

Athidhi Series Review: అతిథి హర్రర్ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

Athidhi Review: అతిథి వెబ్ సిరీస్ రివ్యూ: ట్విస్టులు ఉన్నాయి.. కానీ: వేణు తొట్టెంపూడి హర్రర్ సిరీస్ ఎలా ఉందంటే?
Athidhi Review: అతిథి వెబ్ సిరీస్ రివ్యూ: ట్విస్టులు ఉన్నాయి.. కానీ: వేణు తొట్టెంపూడి హర్రర్ సిరీస్ ఎలా ఉందంటే?

Athidhi Web Series Review:వెబ్ సిరీస్: అతిథి; స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‍స్టార్ (సెప్టెంబర్ 19 నుంచి.. తెలుగు సహా ఏడు భాషల్లో..)

ప్రధాన నటీనటులు: వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, అదితి గౌతమ్, రవివర్మ, వెంకటేశ్ కాకుమాను, భద్రం, రఘు కారుమంచి తదితరులు

ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల; డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: మనోజ్ కాటసాని; మ్యూజిక్: కపిల్ కుమార్

నిర్మాత, సమర్పణ: ప్రవీణ్ సత్తారు; రచయిత, దర్శకుడు: భరత్ వైజీ

స్వయంవరం, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో సహా చాలా చిత్రాల్లో హీరోగా నటించి ఒకప్పుడు మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు వేణు తొట్టెంపూడి. అయితే, కొన్నేళ్లుగా ఆయన ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. గతేడాది రామారావ్ ఆన్‍డ్యూటీ చిత్రంలో కీలకపాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అతిథి వెబ్‍ సిరీస్‍తో సెకండ్ ఇన్నింగ్స్ మొదటి పెట్టి.. తొలిసారి ఓటీటీలోకి అడుగుపెట్టారు. వేణు ప్రధాన పాత్ర చేసిన అతిథి హార్రర్ వెబ్ సిరీస్ నేడు (సెప్టెంబర్ 19) డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్‍ను నిర్మించారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

ఇదీ కథ

Athidhi Web Series Review: దెయ్యాల మిట్ట గురించి అందరూ భయపడుతుంటారు. రాత్రి అటుగా వెళ్లిన వారిని దెయ్యం చంపేస్తుందని చెబుతుంటారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే సంధ్య భవనం ఉంటుంది. అందులో రవి వర్ధన్ (వేణు తొట్టెంపూడి), ఆయన భార్య సంధ్య (అతిది గౌతమ్) ఉంటారు. పక్షవాతంతో సంధ్య మంచానికి పరిమితం కాగా.. రవి సేవలు చేస్తుంటాడు. కథలు కూడా రాస్తుంటాడు రవి. ఈ క్రమంలో మాయ (అవంతిక మిశ్రా) అనే అమ్మాయి అర్ధరాత్రి రవి ఇంట్లోకి వస్తుంది. దెయ్యాల మిట్టను షూట్ చేయడానికి వెళ్లిన సవారి (వెంకటేశ్ కాకుమాను) కూడా భయపడి రవి ఇంట్లోకి వస్తాడు. ఆ తర్వాత ఆ భవనంలో చాలా విషయాలు జరుగుతాయి. మాయను దెయ్యం ఆవహించిందని సవారీ భయపడతాడు. ఈ క్రమంలో ఓ క్రైమ్ కూడా జరుగుతుంది. రవి మాత్రం ఏం జరిగినా ధైర్యంగా ఉంటాడు. ప్రకాశ్ (రవివర్మ) కూడా ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అసలు మాయనే దెయ్యమా? రవి, అతడి భార్య సంధ్య వెనుకున్న కథేంటి? నిజమైన దెయ్యం ఎవరు? భవనంలో హత్యలు ఎవరు, ఎందుకు చేశారు? అనేదే అతిథి వెబ్ సిరీస్ ప్రధానమైన కథగా ఉంది.

కథనం ఎలా ఉందంటే..

కొందరు ఓ భవనంలోకి వెళ్లడం.. దాంట్లో దెయ్యం ఉండడం.. వారు భయడడం లాంటి అంశాలు హర్రర్ సినిమాలు, సిరీస్‍ల్లో ఉండడం కామన్. అతిథి సిరీస్ కూడా ఆ ట్రాక్‍లోనే ఉన్నట్టు అనిపించినా కథనం డెఫరెంట్‍గా ఉంటుంది. అయితే, కథ కొత్తది అనే ఫీలింగ్ మాత్రం కలగదు. ట్విస్టుల కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఇందులో కొన్ని ప్రేక్షకులు ఊహించే విధంగానే ఉండడంతో కాస్త థ్రిల్ తగ్గుతుంది. మరికొన్ని ట్విస్టులు మాత్రం బాగానే పండాయి. ప్రధాన కథలోకి వెళ్లేందుకు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు భరత్. మధ్యలో వచ్చే రెండు చిన్న కథలు మెప్పిస్తాయి. సిరీస్‍పై ఇంట్రెస్ట్ పెంచుతాయి. రెండో ఎపిసోడ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథనంలో వేగం పుంజుకుంటుంది.

అతిథి వెబ్ సిరీస్‍లో క్యారెక్టర్ల గురించి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయలేదు దర్శకుడు. క్రమంగా రివీల్ అయ్యేలా స్క్రీన్‍ప్లే రాసుకున్నాడు. అయితే, ట్విస్టులు రివీల్ అయ్యే కొద్ది.. ఆసక్తి పెరగాల్సింది పోయి.. తగ్గుతుంది. అదే ఈ అతిథి సిరీస్‍కు కాస్త ప్రతికూలతగా ఉంది. నాలుగు ఎపిసోడ్ల వరకు ఏదో కొత్త కథ చూడబోతున్నామని ఫీలయ్యే ప్రేక్షకులకు.. ఆ తర్వాత ఇది ఎక్కడో చూశామన్న భావన కలుగుతుంది. అయితే, ఈ సిరీస్ ఎక్కడా బోరు కొట్టదు. అలాగని మరీ క్షణక్షణం ఉత్కంఠ రేపేలా కూడా లేదు.

భయపడేలా కూడా హర్రర్‌ ఎలిమెంట్స్ అంతగా అతిథి వెబ్ సిరీస్‍లో లేవు. ప్రేక్షకులను భయపెట్టాలని అనవసరపు ఎఫెక్టులకు దర్శకుడు పోలేదు. అలాగే, కామెడీ ట్రాక్ పెట్టాలని కూడా ఆలోచించలేదు. కథను సీరియస్ ట్రాక్ మీదే నడిపించాలనుకున్నాడు. చివర్లో రాజు నేపథ్యంలో వచ్చే ఫ్లాష్‍బ్యాక్ అంత కన్విన్సింగ్‍గా అనిపించదు. చివర్లో ఆ భవనంలో ఉండేది మంచి దెయ్యమని తెలుస్తుంది. చివర్లో సందేశం ఉంటుంది. అది కూడా ఏదో అతికించినట్టే అనిపిస్తుంది. కథనం మరింత పకడ్బందీగా ఉండి ఉంటే అతిథి మరింత మెప్పించేది.

సాంకేతిక విషయాలు

దర్శకుడు భరత్ వైజీ కొన్నిచోట్ల ఇంప్రెస్ చేశాడు. కొత్తదనంతో ఈ అతిథి సిరీస్ తీయాలని తాపత్రయపడినట్టు తెలుస్తుంది. అయితే, ఇది కొన్ని చోట్లే వర్కౌట్ అయింది. మొత్తంగా చూస్తే కొన్ని ట్విస్టులు వర్కౌట్ అయినా.. కొన్ని పాత హర్రర్ మూవీ సీన్లు, సిరీస్‍లు గుర్తుకు వస్తాయి. మనోజ్ కెమెరాపనితనం మెప్పిస్తుంది. కలర్ గ్రేడింగ్, యాంగిల్స్ చాలా చోట్ల బాగున్నాయి. కపిల్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్టే సాగగా.. సౌండ్ డిజైన్ క్వాలిటీతో ఉంది. నిర్మాత ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ కోసం బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు ఎలా..

రవివర్ధన్ క్యారెక్టర్‌కు వేణు తొట్టెంపూడి సరిగ్గా సూటయ్యారు. డిఫరెంట్ షేడ్లలో బాగా మెప్పించారు. మాయపాత్ర చేసిన అవంతిక బాగా చేశారు. అందంతో పాటు యాక్టింగ్ తోనూ ఆకట్టున్నారు. సంధ్య పాత్ర చేసిన అదితికి నటించే ఛాన్స్ పెద్దగా లేకపోయింది. సవారి క్యారెక్టర్‌లో వెంకేటేశ్ కాకుమాను నటన మెప్పిస్తుంది. ప్రకాశ్ పాత్రను రవివర్మ బాగా చేశారు.

మొత్తంగా.. అతిథి వెబ్ సిరీస్ చాలా చోట్ల మెప్పిస్తుంది. కొత్తదనం, కొన్ని లాజిక్కులు లాంటివి పక్కనపెట్టి చూస్తే.. చాలా మందికి నచ్చుతుంది. నటీనటులు ఈ సిరీస్‍కు పెద్ద బలం. ఓటీటీలో కంటెంట్ చూడాలని అనుకుంటుంటే.. అతిథి సిరీస్ చూడొచ్చు. ఆరు ఎపిసోడ్లు ఉన్నా.. మొత్తంగా ఈ సిరీస్ నిడివి మూడు గంటలలోపే ఉంది. ఓసారి ఈ సిరీస్ చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

IPL_Entry_Point