Amazon Prime Video: గుడ్‌న్యూస్.. ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి ఆ వెబ్ సిరీస్, మూవీస్
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. వార్నర్ బ్రదర్స్‌కు చెందిన డిస్కవరీతో చేతులు కలిపిన ప్రైమ్ వీడియోలో కొత్తగా 11 వెబ్ సిరీస్, 10 మూవీస్‌ను తీసుకొచ్చింది.
ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. ఇందులో అన్ని సౌతిండియా భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్ వెబ్‌సిరీస్, మూవీస్ అందుబాటులో ఉంటాయి. అయితే తాజాగా డిస్కవరీతో చేతులు కలిపి కొత్తగా 11 వెబ్‌సిరీస్, 10 సినిమాలను తన సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇవన్నీ హెచ్‌బీఓ మ్యాక్స్‌కు చెందిన వెబ్‌సిరీస్, మూవీస్ కావడం విశేషం.
వీటిలో ది ఫ్లైట్ అటెండెంట్, పీస్‌మేకర్, అండ్ జస్ట్ లైక్ దట్, గాసిప్ గర్ల్, డూమ్ ప్యాట్రోల్, ద స్టెయిర్‌కేస్‌లాంటి వెబ్‌సిరీస్ ఉన్నాయి. ఇక హెచ్‌బీవో మ్యాక్స్ ఒరిజినల్ మూవీస్ అయిన యాన్ అమెరికన్ పికిల్, అక్వామాన్: కింగ్ ఆఫ్ అట్లాంటిస్, లెట్ దెమ్ టాక్, సూపర్‌ఇంటెలిజెన్స్‌లాంటి మూవీస్ అందుబాటులోకి రానున్నట్లు ప్రైమ్ వీడియో సోమవారం ప్రకటించింది.
పైగా ప్రైమ్ మెంబర్స్‌కు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా వీటిని చూసే అవకాశం కల్పించడం విశేషం. పాపులర్ హెచ్‌బీవో మ్యాక్స్ ఒరిజినల్స్‌ను తీసుకురావడం తమకు చాలా సంతోషంగా ఉన్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ మనీష్ మెంఘానీ చెప్పారు. ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజ్ గర్ల్స్, ప్రెట్టీ లిటిల్ లయర్స్: ఒరిజినల్ స్కిన్, డీఎంజెడ్, రేజ్డ్ బై వోల్వ్స్‌లాంటి సిరీస్‌లు కూడా ఇందులో ఉన్నాయి.