Pushpa 2 leaked: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజైన గంటల్లోనే లీక్.. ఈ పని ఎవరు చేశారంటే?
Allu Arjun Pushpa 2 film leaked: పుష్ప 2 సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఈ పని ఎవరు చేశారంటే?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజైన గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో లీక్ చేసేశారు. సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ మూవీ బుధవారం అర్ధరాత్రి నుంచి థియేటర్లలోకి వచ్చింది. ఓవర్సీస్‌తో పాటు దేశవ్యాప్తంగా వసూళ్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప 2 మూవీ రిలీజైన గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తొలిరోజే రూ.250 కోట్లు?
అల్లు అర్జున్ నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మేరకు తొలి రోజే ఏకంగా 3 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయి సరికొత్త రికార్డ్ నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రోజే పుష్ప 2 రూ.250 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాజిటివ్ రివ్యూస్
మూవీలో అల్లు అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలోనూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మరోవైపు రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో డిసెంబరు మొత్తం ఈ మూవీ సందడి చేసే అవకాశం ఉంది. కానీ.. తమిళ్ రాకర్స్ ఈ సినిమాని పైరసీ చేసి వెబ్‌సైట్‌లో పెట్టేశారు. దాంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది.
పుష్ప 2 వసూళ్లు
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1,000 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాని లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
పుష్ప 2 ఓటీటీ
పుష్ప 2 ఓటీటీ హక్కుల్ని నెట్‌ప్లిక్స్ సొంతం చేసుకుంది. రూ.275 కోట్లకి ఈ రైట్స్‌ను నెట్‌ప్లిక్స్ కొనుగోలు చేయగా.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.