Khammam Congress : ఖమ్మంలో ఒకే ఊరి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు
Khammam Congress : ఖమ్మం జిల్లాలో ఒకే ఊరి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. జిల్లాలోని గండుగుపల్లి గ్రామానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి గెలుపొందారు.
Khammam Congress : ఖమ్మం జిల్లాలో ఒకే ఊరి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గండుగులపల్లి నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. గండుగులపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తాజా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,130 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అలాగే అదే గ్రామానికి చెందిన జారే ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితం అశ్వారావుపేట నియోజకవర్గానిదే కావడం విశేషం.
ఈ ఎన్నికల్లో ఆదినారాయణ 28,606 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఒకే గ్రామం నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చరిత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేత. అపార అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు.. 1983 నుంచి రాజకీయాల్లో ఉంటూ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మంత్రివర్గాల్లో పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కీలక పదవి చేపట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.
గత ఎన్నికల్లోనూ ఒకే ఊరి నుంచి ఇద్దరు
2018 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఒకే గ్రామం నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన సీనియర్ నేత సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అలాగే అదే గ్రామానికి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి పాలేరులో పోటీ చేసి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఘన విజయం పొందారు. కాగా వీరిద్దరూ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడం గమనార్హం.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.