Inheritance tax: కాంగ్రెస్ ను ఇరుకున్న పెడుతున్న ‘వారసత్వ పన్ను’ అంశం.. ఏమిటీ వివాదం?
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను’ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఈ కామెంట్స్ ను చూపుతూ కాంగ్రెస్ పై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దాంతో, కాంగ్రెస్ కు ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది.
Inheritance tax: అమెరికా లోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వారసత్వ పన్ను (Inheritance tax) గురించి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు భారత్ లో పెను దుమారం లేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పై ప్రధాని మోదీ (PM Modi) సహా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడుతుండగా, కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలు పిట్రోడా వ్యక్తిగత వ్యాఖ్యలని, ఆ కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తున్నాయి.
ఏమిటీ వారసత్వ పన్ను?
సాధారణంగా భారత్ లో తన జీవిత కాలంలో సంపాదించిన స్థిర, చరాస్తులను, తను జీవించి ఉండగా, లేదా మరణించిన తరువాత తన సంతానానికి అందేలా చూస్తారు. అయితే, అమెరికాలో అమలులో ఉన్న ఒక చట్టం ప్రకారం, వ్యక్తి మరణించిన తరువాత వారసత్వ ఆస్తిని సంతానానికి బదిలీ చేసే సమయంలో, అందులో నుంచి దాదాపు 55% ఆస్తిని ప్రభుత్వం వారసత్వ పన్ను (Inheritance tax) రూపంలో తీసుకుంటుంది. మిగతా 45% ఆస్తిని మాత్రమే వారసులకు అందజేస్తుంది. అమెరికాలో అమలులో ఉన్న ఈ చట్టం భారత్ లో అమలులో లేదని శామ్ పిట్రోడా ఒక మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
శామ్ పిట్రోడా ఏమన్నారు?
సమాజంలో సంపద పునఃపంపిణీ దిశగా ఒక స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా నొక్కిచెప్పారు. ఆ సమయంలో అమెరికాలో అమలులో ఉన్న వారసత్వ పన్ను (Inheritance tax) భావనను వివరించారు. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. ఒక వ్యక్తికి 100 మిలియన్ డాలర్ల సంపద ఉంటే, అతను మరణించినప్పుడు అతను 45 శాతం మాత్రమే అతడి పిల్లలకు బదిలీ అవుతుంది. మిగతా, 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఒక ఆసక్తికరమైన నియమం. మీ తరంలో మీరు సంపద సృష్టించారు, ఇప్పుడు మీరు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదలోని కొంత భాగాన్ని ప్రజల కోసం విడిచిపెట్టాలి. ఇది నాకు సమంజసంగా అనిపిస్తుంది’’ అని శామ్ పిట్రోడా అన్నారు.
భారత్ లో అలాంటి విధానం లేదు
భారత్ లో అలాంటి విధానం లేదని పిట్రోడా చెప్పారు. ‘‘భారత్ లో ఆ విధానం లేదు. 10 బిలియన్లు విలువ చేసి ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే, అతని పిల్లలకు ఆ 10 బిలియన్లు వస్తాయి, ప్రజలకు ఏమీ లభించదు. కాబట్టి ఈ తరహా అంశాలపై ప్రజలు చర్చించాల్సి ఉంటుంది. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కేవలం సంపన్నుల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం కొత్త విధానాలు, కొత్త కార్యక్రమాల గురించి చర్చించాలి’’ అని పిట్రోడా అన్నారు. సంపద పంపిణీ మెరుగ్గా ఉండేలా కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని రూపొందిస్తుందని పిట్రోడా వెల్లడించారు.
శామ్ పిట్రోడా వివరణ
వారసత్వ పన్ను (Inheritance tax) పై తాను చేసిన వ్యాఖ్యలపై శామ్ పిట్రోడా కూడా వివరణ ఇచ్చారు. ప్రధాన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి బీజేపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన విమర్శించారు. ‘‘కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress manifesto) పై ప్రధాని ప్రచారం చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మరల్చడానికి అమెరికాలో వారసత్వ పన్నుపై ఒక వ్యక్తిగా నేను చెప్పిన విషయాన్ని గోడీ మీడియా వక్రీకరించడం దురదృష్టకరం. ప్రధాని మోదీ చేస్తున్న గోల్డ్ స్నాచింగ్ వ్యాఖ్యలు అవాస్తవాలు’’ అని పిట్రోడా ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు.
పిట్రోడా వ్యాఖ్యలపై వివాదం..
ఎన్నికల సమయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సరైన సమయంలో అందిన ఆయుధంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సంపద పున: పంపిణీ పేరుతో పేదల ఆస్తిని ప్రభుత్వం లాగేసుకుంటుందని బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పసాగారు. ఇది ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు వారసత్వ పన్ను అంశంపై వివరణ ఇవ్వడం ప్రారంభించారు. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తాము సామాజిక, ఆర్థిక సర్వే మాత్రమే చేపడ్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. శామ్ పిట్రోడా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ అన్నారు. అయితే, అది పార్టీ వైఖరి కాదని స్పష్టం చేశారు.
బీజేపీ నేతలు విమర్శలు
శామ్ పిట్రోడా ఇంటర్వ్యూ తర్వాత పలువురు బీజేపీ (BJP) నేతలు కాంగ్రెస్ (CONGRESS) పై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఛత్తీస్ గఢ్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర ఉద్దేశాలు మరోసారి తెరపైకి వచ్చాయని అన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే ఆస్తులపై వారసత్వ పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. సంపద పునఃపంపిణీపై శామ్ పిట్రోడా చేసిన ప్రకటనతో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు బట్టబయలయ్యాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మెజారిటీ ఆస్తులను స్వాధీనం చేసుకుని మైనారిటీలకు పంచాలన్నది పార్టీ ఉద్దేశమని మండిపడ్డారు.