Narayankhed News : ఎన్నికల విధుల్లోని టీచర్ల ఆందోళన, పోలీసుల లాఠీఛార్జ్!
Narayankhed News : నారాయణఖేడ్ లో ఎన్నికల విధులకు తక్కువ వేతనాలు ఇచ్చారని టీచర్లు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
Narayankhed News : ఎన్నికల విధులు నిర్వహించునందుకు తమకు రావాల్సిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు, ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్లపైన పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటన నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. ఎన్నికల విధులకు హాజరైన పీఓలకు, ఏపీఓలకు రోజుకు రూ.600 లెక్కన వారికి రూ 3,150 చెల్లించాలని, కానీ నారాయణఖేడ్ లో వేతనాలు చెల్లించాల్సిన ఇద్దరు తహసీల్దారులు ఒక్కొక్కొ టీచర్ కు రూ 2,400 మాత్రం ఇవ్వటంతో ఈ రసాభాసకు తెరలేచింది.
నారాయణఖేడ్ లో తక్కువ వేతనం
మెదక్ జిల్లాలో పోలింగ్ సిబ్బంది అందరికీ రూ 3,150 ఇచ్చారని, తమకు కూడా అంతే ఇవ్వాలని టీచర్లు డిమాండ్ చేశారు. తమని ఈవీఎంలు భద్రపరిచిన ప్రదేశాలకు రావాలని అక్కడ పై అధికారులతో మాట్లాడి మిగతా డబ్బులు కూడా ఇప్పిస్తామని తహసీల్దార్లు చెప్పినట్టు టీచర్లు తెలిపారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తహసీల్దార్లు సరిగ్గా స్పందించకపోవడంతో టీచర్లు వారితో వాగ్వివాదానికి దిగారు. ఈవీఎంలకు రక్షణకు భంగం కలుగుతుందని, మీరు బయటికి వెళ్లాలని పోలీసులు టీచర్లను కోరాను. తమకు రావాల్సిన డబ్బులు వచ్చేవరకు వెళ్లేదిలేదని వారు చెప్పటంతో, పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి వారిని అక్కడి నుండి బయటకు పంపారు. ఈ సంఘటనతో పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది.
టీచర్లను అవమానించారు
టీచర్లు ఎంతో కష్టాన్నికోర్చి ఎన్నికలు సరిగ్గా నిర్వహించిన టీచర్ల పట్ల ఇంత అవమానకరంగా ప్రవర్తించడం సరైనది కాదని TSUTF రాష్ట్ర కోశాధికారి లక్ష్మా రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా నారాయణఖేడ్ లో తక్కువ వేతనాలు చెల్లించడం అన్యాయం చేయటమేనని, ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై తగిన విచారణ చేసి, బాధ్యులైన తహసీల్దార్ల పైన, పోలీసుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మా రెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని, ఎస్పీ చెన్నూరి రూపేష్ ని కోరారు. జహీరాబాద్ లోక్ సభ పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో విధులు నిర్వహించిన వారికి మాత్రమే ఇలాంటి అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఎన్నికలలో కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పటిష్ట భద్రత నడుమ EVMలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించామన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంలో పోలీసులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని, ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.