Lok Sabha elections: ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్; 102 స్థానాల్లో ఎన్నికలు; బరిలో ఉన్న ప్రముఖులు వీరే..-lok sabha elections 2024 phase 1 on april 19 check key seats candidates ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections: ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్; 102 స్థానాల్లో ఎన్నికలు; బరిలో ఉన్న ప్రముఖులు వీరే..

Lok Sabha elections: ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్; 102 స్థానాల్లో ఎన్నికలు; బరిలో ఉన్న ప్రముఖులు వీరే..

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 04:15 PM IST

Lok Sabha elections 2024: మరో రెండు రోజుల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha elections 2024: 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి దశ లోక్ సభ ఎన్నికలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ 19 న జరగనున్నాయి.

21 రాష్ట్రాల్లోని 102 స్థానాలు

అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లోని 102 లోక్ సభ స్థానాల్లో (Lok Sabha elections 2024) ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.

పోలింగ్ జరిగే నియోజకవర్గాలు

1. అరుణాచల్ ప్రదేశ్ (2): అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్

2. అస్సాం (5): దిబ్రూగఢ్, జోర్హాట్, కజిరంగా, లఖింపూర్, సోనిత్పూర్.

3. బిహార్ (4): ఔరంగాబాద్, గయ, జముయి, నవాడా.

4. ఛత్తీస్ గఢ్ (1): బస్తర్

5. మధ్యప్రదేశ్ (6): చింద్వారా, బాలాఘాట్, జబల్పూర్, మాండ్లా, సిద్ధి, షాడోల్.

6. మహారాష్ట్ర (5): నాగపూర్, చంద్రాపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, రామ్ టెక్

7. మణిపూర్ (2): ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్

8. మేఘాలయ (2): షిల్లాంగ్, తురా

9. మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ నుంచి ఒక్కో సీటు

10. రాజస్థాన్ (12): గంగానగర్, బికనీర్, చురు, ఝుంఝును, సికార్, జైపూర్ రూరల్, జైపూర్, అల్వార్, భరత్పూర్, కరౌలి-ధోల్పూర్, దౌసా, నాగౌర్.

11. తమిళనాడు: ఫేజ్ 1లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

12. ఉత్తరప్రదేశ్ (8): ఫిలిభిత్, సహారన్ పూర్, కైరానా, ముజఫర్ నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్

13. పశ్చిమ బెంగాల్ (3): కూచ్ బెహార్, అలీపుర్దువర్, జల్పాయిగురి.

14. అండమాన్ నికోబార్ దీవులు (1): అండమాన్ నికోబార్ దీవులు

15. జమ్ముకశ్మీర్ (1): ఉధంపూర్

16. త్రిపుర (1): త్రిపుర వెస్ట్

ఫేజ్ 1 లో బరిలో ఉన్న ప్రముఖులు

నితిన్ గడ్కరీ (మహారాష్ట్ర): కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్ పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు.

2. జితిన్ ప్రసాద (ఉత్తరప్రదేశ్): వరుణ్ గాంధీ స్థానంలో జితిన్ ప్రసాదను బీజేపీ బరిలోకి దింపడంతో ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ నియోజకవర్గానికి ఎన్నికల రంగంలో ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. బీజేపీ నుంచి జితిన్ ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ నుంచి భగవంత్ శరణ్ గంగ్వార్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి అనీస్ అహ్మెస్ ఖాన్ పోటీ చేస్తున్నారు.

3. తమిళిసై సౌందరరాజన్ (తమిళనాడు): బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. చెన్నై సౌత్ లోక్ సభ స్థానానికి ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తమిళిసై కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ కుమార్తె.

4. కార్తీ చిదంబరం (కర్ణాటక): శివగంగ స్థానం నుంచి కార్తి చిదంబరం పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఏడు సార్లు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కార్తి చిదంబరం బీజేపీ అభ్యర్థి టి.దేవనాథన్ యాదవ్, అన్నాడీఎంకే అభ్యర్థి జేవియర్ దాస్ లతో పోటీ పడ్తున్నారు.

5. అన్నామలై (తమిళనాడు): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన డీఎంకే నేత గణపతి పి.రాజ్ కుమార్, అన్నాడీఎంకే నేత సింగై రామచంద్రన్ తో తలపడనున్నారు.

6. దయానిధి మారన్ (తమిళనాడు): చెన్నై సెంట్రల్ లోక్ సభ స్థానంలో డీఎంకే, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇక్కడ డీఎంకే తరఫున ప్రస్తుత ఎంపీ దయానిధి మారన్, బీజేపీ నుంచి వినోజ్ పి సెల్వం పోటీ చేస్తున్నారు.

7. నకుల్ నాథ్ (మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ చింద్వారా నుంచి కాంగ్రెస్ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. 1980 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఈ స్థానం నుంచి కమల్ నాథ్ గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి నకుల్ నాథ్ గెలిచారు.

8. ఇమ్రాన్ మసూద్ (ఉత్తరప్రదేశ్): పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి అత్యంత కీలకమైన లోక్ సభ స్థానాల్లో ఒకటైన సహారన్ పూర్ లో ముక్కోణపు పోటీ నెలకొన్నది. కాంగ్రెస్-ఎస్పీ కూటమి అభ్యర్థి ఇమ్రాన్ మసూద్, బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్పాల్ శర్మ, బీఎస్పీ అభ్యర్థి మజీద్ అలీ బరిలో ఉన్నారు.

WhatsApp channel