Lok Sabha elections : 'అబ్ కీ బార్ 400 పార్'- బిహార్ డిసైడ్ చేస్తుంది..!
Lok Sabha elections Bihar : 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి బిహార్‌లో గెలుపు చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
2024 Lok Sabha elections : 'అబ్ కీ బార్ 400 పార్' నినాదంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లోకి వెళ్లింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి. అయితే.. కొన్ని చోట్ల ఎక్కువ సీట్లు గెలవడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో సంపాదించుకున్న స్థానాలను సైతం కాపాడుకోవడం ఎన్డీఏ కూటమికి చాలా కీలకంగా మారింది. అలాంటి రాష్ట్రాల్లో ఒకటి.. 'బిహార్'! మహారాష్ట్ర, బిహార్‌లు.. ఎన్డీఏ గెలుపోటముల్లో ఈసారి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బిహార్‌లో ప్రస్తుత 'రాజకీయాలు', బీజేపీ- జేడీయూ దోస్తీ, ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి గురించి డీటైల్డ్‌గా ఇక్కడ తెలుసుకుందాము..
2019 లోక్‌సభ ఎన్నికల్లో..
బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. ఈ 40 సీట్లల్లో 39 చోట్ల ఎన్డీఏ కూటమి గెలిచింది! ఇది ఒక సంచలనం! నాడు భారీ విజయాన్ని అందించిన బీహార్.. ఇప్పుడు బీజేపీకి ఏ మాత్రం సాయం చేస్తుందో చూడాలి. ఎందుకంటే.. బిహార్‌లో బీజేపీ- ఎన్డీఏ సీట్లు పెంచుకోవడానికి ఏం లేదు! తగ్గించుకోకుండా మాత్రమే చూసుకోవాలి. ఇదే అతిపెద్ద సవాలు!
బీజేపీ- జేడీయూ దోస్తీతో నష్టమేనా?
దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర తర్వాత హైఓల్టేజ్ యాక్షన్ కనిపించింది బిహార్‌లోనే! రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటారో ఎవరికీ అర్థంకాదు. 2015 నుంచి 2023లో ఏకంగా 4సార్లు బీజేపీ- విపక్షాల మధ్య ఆయన స్విచ్ అవ్వడం ఇందుకు కారణం.
2015 బిహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన ఆయన.. 2017లో బీజేపీ దగ్గరికి వెళ్లారు. ఇక 2022లో మళ్లీ ఆర్జేడీ తలుపు తట్టిన ఆయన.. 2023లో మళ్లీ బీజేపీని పలకరించారు. వీటన్నింటిలో హైలైట్ అంశం.. విపక్ష ఇండియా కూటమి! ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ కూటమిలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్న నేత.. నితీశ్ కుమార్. అలాంటిది.. ఆయన మళ్లీ ఎన్డీఏలో చేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
BJP JDU lok Sabha elections : మరి.. 2023లో కుదురిని బీజేపీ- జేడీయూ దోస్తీ.. గెలుపును తెచ్చిపెడుతుందా? అన్నది ఇక్కడ అత్యంత కీలకమైన ప్రశ్న. జేడీయూతో మళ్లీ దోస్తీపై చాలా మంది బీజేపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా.. పొత్తులో భాగంగా.. 40 సీట్లల్లో కేవల 17 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. జేడీయూ లేకుండా సొంతంగా వెళ్లి ఉంటే, మరిన్ని నియోజకవర్గాల్లో పోటి చేసి, వాటన్నింటిలోనూ గెలిచే వాళ్లమని కమలదళ నేతలు అభిప్రాయపడుతున్నారట. 2019లో బీజేపీ 17 సీట్లల్లో గెలిచిన విషయం తెలిసిందే.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ మంచి ప్రదర్శన చేస్తుందా? లేదా? అన్న దానికన్నా.. జేడీయూ పరిస్థితేంటి? అన్న విషయమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 2019లో జేడీయూ 16 సీట్లల్లో గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. పార్టీ మునుపటిలా బలంగా లేదు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. 243 సీట్లకు గాను 43 స్థానాల్లోనే గెలిచింది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో నితీశ్ కుమార్ రాజకీయాలు సాగాయి.
కానీ నితీశ్ కుమార్ మాటిమాటికి పొత్తులు మార్చడం.. ప్రజలనే కాదు పార్టీ సభ్యులను కూడా అయోమయానికి గురిచేస్తోందని తెలుసతోంది. ఎన్డీఏ టార్గెట్ 400లో నితీశ్ కుమార్ జేడీయూ ఒక మైనస్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన జేడీయూను కాకుండా.. ఈసారి ప్రజలు ఆర్జేడీకి ఓటు వేయొచ్చని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
బిహార్‌లో బలమైన విపక్షం..
lok Sabha elections 2024 : దేశంలో విపక్ష ఇండియా కూటమి బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి బిహార్. ఇక్కడ అనాదిగా ఆర్జేడీ బలంగా ఉంది. పైగా.. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జైలుకే పరిమితమైన ఆర్జేడీ సుప్రీమో లాలూ ప్రసాద్ యాదవ్.. ఇప్పుడు బయటే ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోతున్నప్పటికీ.. లాలూ ప్రసాద్ యాదవ్ సందేశాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. మరీ ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతోంది.
అయితే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలని ఆర్జేడీ చూస్తోందా? లేక 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం తాజా పరిస్థితులను ఉపయోగించుకుని సామాజిక బలాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తోందా? అన్నది ఆసక్తికరంగా మారింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆర్జేడీ.
40 లోక్‌సభ స్థానాల్లో ఆర్జేడీ కేవలం 23 చోట్ల పోటీ పడుతోంది. మిగిలినవి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు పంచుకున్నాయి. కానీ ఆర్జేడీ ఎంపిక చేసిన అభ్యర్థులను చూస్తుంటే.. యాదవేతర ఓబీసీ వర్గాలకు చేరువయ్యేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది పార్టీ బలమైన యాదవ వర్గాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
మోదీ వర్సెస్ తేజస్వీ యాదవ్..
Tejaswi Yadav Lok Sabha elections : ఆర్జేడీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ తేజస్వీ యాదవ్! తండ్రి ఆశిస్సులతో పార్టీ బాధ్యతలను, విపక్ష బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని.. చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు తేజస్వీ యాదవ్. ఇండియా కూటమి శ్రేణుల్లో చురుకుగా ఉండే నేతల్లో ఈయన ఒకరు. పైగా.. తండ్రి అడుగుజాడల్లో నడవకుండా.. యాదవులు, ముస్లింలనే కాకుండా, అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిరుద్యో సమస్యపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు ఆర్జేడీ తేజస్వీ యాదవ్. ఒక రకంగా చెప్పాలంటే.. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రచారాలకు భిన్నంగా.. బిహార్ ప్రజల ఉద్యోగాల సమస్యలంటూ ప్రచారాలు చేస్తున్నారు తేజస్వీ. బిహార్ ప్రజలపై తేజస్వీకి మంచి పట్టు ఉందని చెప్పడంలో సందేహం లేదు. కానీ.. తేజస్వీ యాదవ్‌ని బిహార్ సీఎంగా చూసే ప్రజలు.. మోదీనే ప్రధానిగా చూస్తే మాత్రం.. ఆర్జేడీ టార్గెట్ నెరవేరదు!
కానీ.. ఎప్పటిలానే ఈసారి కూడా బిహార్‌లో బీజేపీ మంచి ప్రదర్శన చేస్తుందని మోదీ అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో తాము చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు తమకు ఓట్లు వేస్తారని అంటున్నారు.
మరి.. బిహార్‌లో ఎన్డీఏ ఏ మేరకు ప్రదర్శన చేస్తుంది? ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? అనేది 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4తో తేలిపోతుంది.
సంబంధిత కథనం