Congress Fire On Sagar Issue: నాగార్జున సాగర్ వ్యవహారంపై కాంగ్రెస్ ఆగ్రహం
Congress Fire On Sagar Issue: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జున సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు పట్టారు. ఓటమి భయంతో ఎన్నికల సెంటిమెంట్ వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Congress Fire On Sagar Issue: ఎన్నికల రోజు కొత్త డ్రామాకు కేసీఆర్ తెర తీశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ జలాలపై నెలకొన్న వివాదాన్ని పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్‌గా మలచుకుని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
పోలింగ్ రోజు తెలంగాణ సెంటిమెంట్ తో కెసిఆర్ లబ్ధి పొందేందుకు కొత్త డ్రామాలకు తెరలేపాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాగు-సాగు నీటి కోసం నాగార్జునసాగర్ డ్యాంపై ఉద్రిక్త వాతావరణం నెలకొని ఇరు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది పోలీసులు మొహరించారు. ఇన్ని రోజులు లేనిది పోలింగ్ రోజే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే ఓటమి భయంతో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును వాడుకునేందుకు డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ పోరాట యోధులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను అర్థం చేసుకోవాలని, ఈ తరహా ఉద్రిక్తతలను ప్రజలు నమ్మవద్దని కోరారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో గెలవబోతుందని తెలిపారు. 2009లో చేసిన దీక్షల ఫోటోలు కూడా కెసిఆర్ నిన్న పేపర్ యాడ్స్ లో వేసుకొని తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ డ్రామాకు తెరలేపి తెలంగాణ సెంటిమెంట్ నాటకం ఆడుతున్నాడన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఏపీ, తెలంగాణల మధ్య ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని, వివాదానికి దిగడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. కృష్ణా జలాల వివాదం కృష్ణా బోర్డు పరిధిలో ఉందన్నారు. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, కృష్ణా బోర్డును అప్రమత్తం చేసి వివాదం లేకుండా చూడాలన్నారు. ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుందన్నారు.
మరోవైపు నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని ఏపీ సిపిఎం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో చర్చలు జరిపి పరిష్కరించాలన్నారు. ఆంధ్రాలో పంటలు ఎండి పోతున్నాయని కరువు ప్రాంతాలకు నీరు పంపేందుకు న్యాయంగా ఆంధ్రాకు రావాల్సిన నీరును తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి విడుదల చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
గురువారం అర్థరాత్రి నుంచి నాగార్జునసాగర్‌పై ఏపీ-తెలంగాణల మధ్య నెలకొన్న వివాదంపై తెలంగాణ సీఈవో వికాస్‍రాజ్ స్పందించారు. నాగార్జునసాగర్ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని, ఆందోళన అవసరం లేదన్నారు. రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దని, నేతలెవరూ నిబంధనలు అతిక్రమించొద్దని వికాస్ రాజ్ హెచ్చరించారు.