Patancheru Neelam Madhu : రూట్ మార్చిన నీలం మధు - బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్!
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇవ్వటంతో నీలం మధు రూట్ మార్చేశారు. బీఎస్పీ పార్టీలో చేరిన ఆయన.. పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు.
Telangana Assembly Elections 2023: పటాన్ చెరు రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కపోవటంతో … కాంగ్రెస్ లో చేరిన నీలం మధుకు ఆ పార్టీ టికెట్ కేటాయించింన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన జాబితాలో నీలం మధు పేరును మార్చుతూ…. కాట శ్రీనివాస్ గౌడ్ పేరును చేర్చింది హస్తం పార్టీ. దీంతో కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నీలం మధు…. మళ్లీ రూట్ మార్చేశారు. ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని చెప్పిన ఆయన…. బీఎస్పీ గూటికి చేరారు.
బీఎస్పీ అభ్యర్థిగా పోటీ…
కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవటంతో బీఎస్పీ పార్టీలో చేరారు నీలం మధు ముదిరాజ్. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధును ప్రకటిస్తున్నట్లు బీఎస్పీ పార్టీ కూడా ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా బలమైన నేతలు… పటాన్ చెరు బరిలో ఉండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది.
బీఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి పోటీ చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ పేరు ఖరారైంది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి నందీశ్వర్ గౌడ్ పోటీ చేస్తుండగా… బీఎస్పీ నుంచి నీలం మధు బరిలో ఉండనున్నారు. చివరి నిమిషంలో బీఫామ్ అందుకున్న కాట శ్రీనివాస్ గౌడ్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు.
ఇక పటాన్ చెరు నియోజకవర్గంలో బీసీల జనాభా ఎక్కువగా ఉండటంతో… ఓటర్లు ఎవరివైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఓసీ అభ్యర్థి బరిలో ఉండగా… కాంగ్రెస్, బీజేపీ నుంచి గౌడ సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీ చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు కూడా ఎక్కువగా ఉండటంతో… వారి ఓట్లు ఎవరికి మళ్లుతాయనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే బీఎస్పీలో చేరిన నీలం మధు ఎంత వరకు ప్రభావం చూపుతారనేది చూడాలి…!
సంబంధిత కథనం