AP Tekkali Election Fight: టెక్కలిలో అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నికల పోరుపై సర్వత్రా ఆసక్తి-achchennaidu vs duvvada srinivas in tekkali all interest in election fight ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Tekkali Election Fight: టెక్కలిలో అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నికల పోరుపై సర్వత్రా ఆసక్తి

AP Tekkali Election Fight: టెక్కలిలో అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నికల పోరుపై సర్వత్రా ఆసక్తి

Sarath chandra.B HT Telugu
Apr 26, 2024 07:13 AM IST

AP Tekkali Election Fight: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

టెక్కలిలో హ్యాట్రిక్ విజయం కోసం అచ్చన్నాయుడు ప్రయత్నాలు
టెక్కలిలో హ్యాట్రిక్ విజయం కోసం అచ్చన్నాయుడు ప్రయత్నాలు

AP Tekkali Election Fight: శ్రీకాకుళం Srikakulam జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గంలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. టెక్కలిలో టీడీపీ తరపున మూడోసారి గెలుపు కోసంAtchennaidu అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తుంటేDuvvada Srinivas దువ్వాడ శ్రీనివాస్ రెండో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019లో 6546 ఓట్లతో అచ్చెన్నాయుడు విజయం సాధించారు.

వైసీపీ తరపున పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌కు కొద్ది రోజుల క్రితం వరకు భార్య వాణి నుంచి పోటీ ఎదురైంది. ఎమ్మెల్యే టిక్కెట్ వాణికి కేటాయిస్తారని ప్రచారం జరిగినా చివరకు దువ్వాడకే కేటాయించారు. దీంతో తాను కూడా పోటీ చేస్తానని వాణి ప్రకటించారు. చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు. 2014లో టెక్కలి నుంచి పోటీ చసిన దువ్వాడ 8387 ఓట్లతో ఓడిపోయారు.

టెక్కలిలో గత ఐదేళ్లుగా టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో అచ్చెన్నాయుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలపై ఏపీ సిఐడి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెట్టారని టీడీపీ ఆరోపించింది.

నెరవేరని సిఎం జగన్ హామీలు…

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద రూ.360 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. టెక్కలి మండలం రావివలసలో మూతపడిన మెట్కోర్ ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమను తెరిపిస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. ఏడాది క్రితం పరిశ్రమ పునరుత్పత్తి ప్రారంభించినా స్థానికులను కార్మికులుగా తీసుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగుతున్నారు.

సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర కూడలిలో థర్మల్ పోరాటంలో ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని, థర్మల్‌ ప్లాంటుకు సంబంధించిన 1108 జీవో రద్దుచేస్తామని జగన్ హామీ ఇచ్చారు. 250 మంది ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని హామీఇచ్చినా ఇంతవరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఉద్యమకారులపై కేసులు నడుస్తూనే ఉన్నాయి.

నెరవేరని అచ్చెన్నాయుడు హామీలు…

ఆఫ్షోర్ జలాశయం పనులు పూర్తి చేస్తామని చెప్పినా చేయలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలిచినా, టీడీపీ ప్రభుత్వం ఏర్పడకపోవడంతో నిధులు రాక నందిగాంలో ఆఫ్ షోర్ జలాశయం పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు.

కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల రప్పిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసినా ఆ కాలేజీ పలాసకు తరలిపోయింది. సంతబొమ్మాళిలో ఇంటింటికి కొళాయిలు వేస్తామన్న హామీ నెరవేరలేదు. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 22 గ్రామాలకు కుళాయిలు వేయాల్సి ఉంది. భావనపాడు పోర్టు నిర్మాణం పనులు మొదలయ్యాయి. సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.

అచ్చెన్నాయుడుపై ఆరోపణలు…

అచ్చెన్నాయుడుకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములు, గోదాములు ఆదాయ వనరులుగా ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో అచ్చెన్నాయుడును కాదని ఎవరూ ఏ పనిచేయలేరు. మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల బదిలీలు, గుత్తేదారుల నుంచి కమీ షన్లు లేకుండా పనులు జరిగేవి కాదు. ఈఎస్ఐ కుంభకోణంలో ఏపీసిఐడి అరెస్ట్‌ చేసింది. ప్రసుత్తం ఈ అంశం కోర్టు విచారణలో ఉంది.

అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు ఎవరు స్థానికంగా ఉండరు.రాజకీయ కార్యక్రమాల్లోనూ తలదూర్చరు. కుమారుడు కృష్ణమోహన్ హరియాణాలోని జిందాల్ విశ్వ విద్యాలయంలో లా చదువుతున్నారు. రెండో కుమారుడు తనూజ్నాయుడు ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రభాకరరావు, డీఎస్పీగా ఏలూరు పోలీసు శిక్షణ కళాశాలలో పనిచేస్తున్నారు. మరో సోదరుడు కింజరాపు ప్రసాదరావు స్వగ్రామం నిమ్మాడలో ఉంటారు. స్థానిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు. కుటుంబానికి ఎఫ్సీఐ గోదాములు, గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలు ఉన్నాయి.

ప్రసాదరావు క్లాస్ 1 కాంట్రాక్టరుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడంలేదు. నరసన్నపేట, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ప్రసాదరావు కుమారుడు సురేష్ ప్రస్తుతం నిమ్మాడ సర్పం చిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఎంపీటీసీగా ఉన్నారు.

టెక్కలిలో ప్రధాన సమస్యలు…

టెక్కలి మండలం టెక్కలి పట్టణంలో 3వేలమంది వరకు ఇళ్లపట్టాలు ఇచ్చారు. అందులో 400 మందికి మాత్రమే ఇప్పటివరకు స్థలాలు చూపించారు. మిగిలిన వారికి ఇంతవరకు స్థలాలు చూపించలేదు. అంజనాపురం జగనన్న లేఅవుట్‌కు రహదారి సమస్య ఉండటంతో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. లబ్దిదా రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

టెక్కలి పట్టణంలోని చెరువుల్లోకి మురుగునీటిని మళ్లిస్తుండటం ప్రధాన సమస్యగా మారింది. కాలువల వ్యవస్థ సరిగా లేక పలుచోట్ల అవుట్లెట్లను చెరువుల్లోకే అమర్చారు.

టెక్కలి మండలంలో తాగునీరు ప్రజలకు పూర్తిస్థాయిలో అందడంలేదు. ఎర్రన్నాయుడు సమగ్ర నీటి పథకం ద్వారా 22 గ్రామాలకు ప్రస్తుతం కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అదనపు పైపులైన్లు వేసి ట్యాంకుల సామర్థ్యం పెంచకపోవడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు.

లింగాలవలస పంచాయతీ పరిధిలో సాగునీటికి తీవ్ర సమస్య ఉంది. అదే గ్రామం నుంచి ప్రస్తుతం జడ్పీ టీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమీ పంలోని కాట్రగడ రిజర్వాయర్ కు అంచనాలు రూపొందించినా నిర్మాణానికి నోచుకోలేదు. ఈ దిశగా వారు ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో 5 వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

టెక్కలిలో ఆది ఆంధ్రావీధి వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతీయులు ఎన్నో ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. దీన్ని నిర్మిస్తే ఆది ఆంధ్రా వీధి ప్రాంతంతో పాటు అంజనాపురం, సవరగోపాలపురం, జీడి పేట, వంగర ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.

కొటబొమ్మాళి మండలం:

కొత్తమ్మతల్లి ఆలయం రూ.5కోట్ల వ్యయంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రతిపాదించారు. రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గర్భాలయ విస్తరణ పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. రూ.50 లక్షలతో అన్నదాన సత్రం పనులు మోక్షానికి నోచుకోలేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

కొత్తపేట, కోటబొమ్మాళి కొండపై ఉన్న జిల్లా స్థాయి పోలీసు రిపీటర్ స్టేషన్ పనులు అస్తవ్యస్తంగా మారిపోయి మళ్లీ మొదటికే వచ్చాయి. పక్కా రోడ్డుకు ప్రతిపాదనలు జరిగినా నిధులు మంజూరు కాక అడు గులు ముందుకు పడలేదు.

రూ. అర కోటి వ్యయంతో కోటబొమ్మాళిలో రైతుబజారు నిర్మించారు. ఇందుకు ఓఈవో (ఎస్టేటు అధికారి) ఉన్నారు. అయినా ఇంతవరకు బజారు వినియోగంలోకి తీసుకు రాలేదు. దీంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

కోటబొమ్మాళిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గ్రామ పురోహితులు స్థలాన్ని వితరణగా అందించారు. ఇప్పటికీ భవన నిర్మాణానికి అడుగులు ముందుకు పడలేదు. అధికారులు సైతం దీని గురించి పట్టించుకో వడం లేదు.

సంతబొమ్మాళి మండలం:

నౌపడ- వెంకటాపురం, మేఘవరం- బోరుభద్ర, వడ్డితాండ్ర- రావివలస ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో ఆ రహదారుల్లో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

మూలపేట, ఎం. సున్నాపల్లి, కొత్త లింగూడు, ఆర్. సున్నాపల్లి, మేఘవరం, మరువాడ, తదితర 22 తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రక్షిత మంచినీరు వారికి గగ నంగా మారడంతో ఉప్పునీటి పైనే ఆధార పడుతున్నారు.

మర్రిపాడు, నౌపడ, భావనపాడు, ఆకాశలఖవరం, పోతునాయుడుపేట, మేఘవరం గ్రామాల్లో సాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. సాగునీటి కాలువలు నిర్వహణకు నోచుకోకపోవడంతో శివారు రైతులు అవస్థలు పడుతున్నారు.

వడ్డితాండ్రలో 1108జీవో రద్దు చేయడంతోపాటు స్వదేశీ మత్స్యకారులకు తంపర లీజు హక్కులకు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులకు, పాలకులకు సమస్యలను పలుమార్లు తెలియజే సినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

నందిగాం మండలం:

పెద్దతామరాపల్లి -తూముకొండ రహదారి మండలం కొండల ప్రాంతానికి సుమారు 45 గ్రామాలకు అత్యంత ప్రధాన రహదారి. సుమారు 14 కి.మీ.ల పొడవైన ఈ రహదారిని విస్తరిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. దీంతో పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

నందిగాం సమీపంలోని వల్లయ్య ఖానా జాతీయ రహదారి నుంచి పోలవరం, బెజ్జిపల్లి, పోతులూరు, చి తామరాపల్లి మీదుగా మాలపేటకి వెళ్లే సుమారు 8 కి.మీల బీటీ రహదారి నిర్మాణానికి 2017లో రెండు చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఇంత వరకు పనులకు అడుగులు ముందుకు పడలేదు. తూతూ మంత్రం కంకర వేసి వదిలే శారు.

పెంటూరు - పొల్లాడ బీటీ రహదారికి మరమ్మతులు చేపడతామని ప్రస్తుత వైకాపా ప్రభుత్వ నాయకు" ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదు. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

అచ్చెన్నాయుడు అనుచరుల అవినీతి…

హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్న అచ్చెన్నాడుకు ప్రధానంగా అనుచరుల వ్యవహారాలతో ఇబ్బందులు ఉన్నాయి. టెక్కలికి చెందిన లాడి శ్రీనివాసరావు అచ్చె న్నాయుడుకు అంతరంగికుడిగా ముద్రపడ్డారు. కోటబొమ్మాళి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్, టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైసుమిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచే శారు. మరో అనుచరుడు శిమ్మ పాపారావు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు. వీరి వ్యవహార శైలి నియోజక వర్గంలో ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది.

 

సంబంధిత కథనం