Yuvraj Singh: టీమిండియాకు మెంటార్‌గా ఉండేందుకు యువరాజ్ ఆసక్తి.. ఏమన్నారంటే..
Yuvraj Singh: ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మెంటార్‌గా ఉండడంపై ఆసక్తిని కనబరిచారు మాజీ స్టార్ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్. మెగాటోర్నీల్లో ఆటతో పాటు మానసిక సవాళ్లను ఎదుర్కోవడం కూడా ముఖ్యమని అన్నారు.
Yuvraj Singh: భారత క్రికెట్ జట్టు చివరగా ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్లు దాటిపోయింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరే మెగాటోర్నీ టైటిల్ గెలవలేదు టీమిండియా. ఎక్కువగా నాకౌట్ మ్యాచ్‍ల్లో ఓటమి పాలవుతోంది. కీలక మ్యాచ్‍లో చేతులెత్తేస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‍లో ఫైనల్‍లో భారత్ ఓడిపోయి, టైటిల్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు మెంటార్‌గా ఉండేందుకు మాజీ స్టార్ ఆల్‍రౌండర్, దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తి వ్యక్తం చేశారు. టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను గెలవడంలో యువీ కీలకపాత్ర పోషించారు. భవిష్యత్తులో టీమిండియాకు మెంటరింగ్ చేసేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.
క్రికెట్‍కు తాను తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని, యువ ఆటగాళ్లకు సాయంగా ఉంటానని యువరాజ్ అన్నారు. కోల్‍కతాలో యువరాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. బిగ్ మ్యాచ్‍ల్లో ఆటగాళ్లు మానసిక సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొెంటారని యువీ అన్నారు.
“మెంటరింగ్ చేసేందుకు నేను ఇష్టపడతాను. నా పిల్లలు సెటిల్ అయ్యాక (స్కూల్‍కు వెళ్లడం మొదలుపెట్టాక) రానున్న సంవత్సరాల్లో నేను క్రికెట్‍కు తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నా. మెరుగయ్యేందుకు యువ ఆటగాళ్లకు సాయం చేయాలనుకుంటున్నా. పెద్ద టోర్నమెంట్‍లలో మనం చాలా మానసిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై భవిష్యత్తులో యువ ప్లేయర్ల కోసం పని చేస్తా. యువ ఆటగాళ్ల టెక్నిక్ సమస్యలను తీర్చడంతో పాటు క్రికెట్‍లో వారు ఎదుర్కొనే మెంటల్ చాలెంజ్‍లను కూడా అధిగమించేలా సూచనలు ఇస్తా” అని యువరాజ్ అన్నారు.
పెద్ద టోర్నీల్లో ఒత్తిడి ఎలా తట్టుకోవాలన్న విషయంలో ఆటగాళ్లకు సాయం చేస్తానని యువరాజ్ చెప్పారు. “నాకు తెలిసి ఆటగాళ్లలో ఏదో మిస్ అవుతోంది. పెద్ద టోర్నీలు వచ్చినప్పుడు శారీరకంగా సిద్ధమవుతారు.. కానీ మానసికంగానూ నిర్ణయాలు తీసుకోవాలి. యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూ.. ఒత్తిడిని ఎలా అధిగమించి తమ ఆట ఆడాలనే అంశంపై నేను మాట్లాడుతున్నా. జట్టులో ఒకరిద్దరు ఒత్తిడిని తట్టుకోగలిగితే సరిపోదు. అందరూ ఒత్తిడిని భరించేందుకు సిద్ధంగా ఉండాలి” అని యువీ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు తాను మెంటార్‌గా ఉండాలనుకున్నానని, అయితే ఆశిష్ నెహ్రా వద్దని సూచించారని యువరాజ్ సింగ్ వెల్లడించారు. అయితే, భవిష్యత్తులో ఐపీఎల్ టీమ్‍కు మెంటార్‌గా ఉండేందుకు కూడా ఆసక్తిని చూపారు.
“భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూద్దాం. కానీ ప్రస్తుతం నాకు నా పిల్లలే ప్రాధాన్యతగా ఉన్నారు. వారు స్కూల్‍కు వెళ్లడం ప్రారంభిస్తే నాకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఆ తర్వాత నేను ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. యువ ఆటగాళ్లతో పని చేయడం నాకు బాగా ఇష్టం. ఏదో ఒక ఐపీఎల్ జట్టుకు మెంటరింగ్ చేస్తా” అని యువరాజ్ సింగ్ చెప్పారు.
తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‍తో భారత జట్టుకు యువరాజ్ సింగ్ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించారు. 2007లో ధోనీ సారథ్యంలోని యువ భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్.. ఆల్‍రౌండ్ షోతో ప్రధాన పాత్ర పోషించారు. ఆ టోర్నీలో ఇంగ్లండ్‍తో జరిగిన మ్యాచ్‍లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. 2011 వన్డే ప్రపంచకప్‍లో అదరగొట్టిన యువరాజ్ సింగ్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 28 సంతవత్సరాల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2019లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‍కు నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు యువరాజ్ సింగ్.