WI vs PNG T20 World Cup 2024: పసికూనపై కిందామీదా పడి గెలిచిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్-wi vs png t20 world cup 2024 west indies won by 5 wickets against minows papua new guinea ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wi Vs Png T20 World Cup 2024: పసికూనపై కిందామీదా పడి గెలిచిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్

WI vs PNG T20 World Cup 2024: పసికూనపై కిందామీదా పడి గెలిచిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్

Hari Prasad S HT Telugu
Jun 03, 2024 07:53 AM IST

WI vs PNG T20 World Cup 2024: రెండుసార్లు ఛాంపియన్, ఆతిథ్య దేశం వెస్టిండీస్.. క్రికెట్ లో పసికూన అయిన పపువా న్యూ గినియాపై కిందామీదా పడి గెలిచింది. 5 వికెట్లతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

పసికూనపై కిందామీదా పడి గెలిచిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్
పసికూనపై కిందామీదా పడి గెలిచిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ (AP)

WI vs PNG T20 World Cup 2024: వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ ను రెండుసార్లు గెలిచింది. ఇప్పుడు కూడా టీమ్ లో టాప్ ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. అయినా ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే పపువా న్యూ గినియాలాంటి పసికూన చేతుల్లో ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. ఆదివారం రాత్రి గయానాలోని ప్రావిన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో విండీస్ 5 వికెట్లతో విజయం సాధించింది.

ఆదుకున్న చేజ్, రసెల్

టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఏకంగా 257 రన్స్ చేసింది వెస్టిండీస్. అయితే అసలు మ్యాచ్ కు వచ్చేసరికి ఆ టీమ్ తడబడింది. అది కూడా పపువా న్యూగినియా లాంటి చిన్న జట్టుపై 137 పరుగుల లక్ష్యాన్ని కష్టమ్మీద చేజ్ చేయగలిగింది. 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్ చేజ్ చేయడం గమనార్హం. రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 42), రసెల్ (9 బంతుల్లో 15) విండీస్ ను గెలిపించారు.

97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో చేజ్, రసెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఐదో వికెట్ గా రూథర్‌ఫర్డ్ (2) వెనుదిరిగే సమయానికి వెస్టిండీస్ కు చివరి నాలుగు ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో అసలు ఆ టీమ్ గెలుస్తుందా అన్న సందేహం కలిగింది.

కానీ చేజ్, రసెల్ మూడు ఓవర్లలోనే పని ముగించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే గెలిచి వెస్టిండీస్ ఊపిరి పీల్చుకుంది. ఇక్కడి పిచ్ బౌలర్లకు బాగా అనుకూలించింది. పేసర్లు స్లో బాల్స్ తో, స్పిన్నర్లకు మంచి టర్న్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో చేజింగ్ అంత సులువు కాలేదు. వామప్ లో 257 రన్స్ చేసిన విండీస్ పపువా న్యూగినియాపై 137 రన్స్ టార్గెట్ ను చాలా సులువుగా చేజ్ చేస్తుందని భావించినా.. అలా జరగలేదు.

ఆకట్టుకున్న పపువా బౌలర్లు

చేజింగ్ లో విండీస్ బ్యాటర్లు చెలరేగకుండా ముందు నుంచీ పపువా బౌలర్లు కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా పపువా బౌలర్లలో జాన్ కరికో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అసద్ వాలా 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో విండీస్ చేజ్ కిందామీదా పడుతూ సాగింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 రన్స్ చేసింది. సెసె బౌ హాఫ్ సెంచరీతో (43 బంతుల్లో 50) రాణించాడు. విండీస్ బౌలర్లలో రసెల్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లతో పపువా టీమ్ ను కట్టడి చేశారు. రసెల్ బౌలింగ్ లో తన ఐపీఎల్ ఫామ్ కొనసాగించాడు. ఇక అకీల్ హుస్సేన్ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

వెస్టిండీస్, పపువా న్యూగినియా టీమ్స్ గ్రూప్ సిలో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ తోపాటు ఇదే గ్రూపులో ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, ఉగాండా టీమ్స్ కూడా ఉన్నాయి.

Whats_app_banner