T20 World Cup 2024 Team India Schedule: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
T20 World Cup 2024 Team India Schedule: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఇప్పటికే టీమిండియా అమెరికాలోని న్యూయార్క్ చేరుకుంది. మరి ఈ మెగా టోర్నీలో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉంది? మ్యాచ్ లను ఎక్కడ చూడాలి?
T20 World Cup 2024 Team India Schedule: టీ20 వరల్డ్ కప్ 2024 ఈ వీకెండ్ లోనే ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో.. ఐదు రోజుల గ్యాప్ లోనే మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ న్యూయార్క్ చేరుకున్నారు. మరి ఇందులో ఇండియా ఉన్న గ్రూప్, షెడ్యూల్, మ్యాచ్ లు ఎక్కడ చూడాలన్న మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా
టీ20 వరల్డ్ కప్ 2024కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా మాత్రం తన లీగ్ మ్యాచ్ లన్నింటినీ అమెరికాలోనే ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఇండియా గ్రూప్ ఎలో ఉంది. ఈ గ్రూపులో ఇండియాతోపాటు పాకిస్థాన్, కెనడా, ఆతిథ్య యూఎస్ఏ, ఐర్లాండ్ టీమ్స్ ఉన్నాయి. ఆ లెక్కన లీగ్ స్టేజ్ లో రోహిత్ సేన మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడుతుంది.
నిజానికి జూన్ 1వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్నా.. భారత కాలమానం ప్రకారం జూన్ 2 ఉదయం 6 గంటలకు తొలి మ్యాచ్ జరుగుతుంది. జూన్ 29 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ న్యూయార్క్ చేరుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ చేరిన కేకేఆర్, సన్ రైజర్స్ జట్లలో వరల్డ్ కప్ కు ఎంపికైన ప్లేయర్స్ ఎవరూ లేరు.
దీంతో ముందుగానే ఫస్ట్ బ్యాచ్ అమెరికా వెళ్లిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఆల్ రౌండర్లు జడేజా, శివమ్ దూబె, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లి ఇంకా వెళ్లలేదు. అతడు తొలి వామప్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదీ
ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఎలో భాగంగా లీగ్ స్టేజ్ లో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల వివరాలు, భారత కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సమయాలు ఇక్కడ చూడొచ్చు.
ఇండియా వెర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 రాత్రి 8 గంటలకు.. ( న్యూయార్క్)
ఇండియా వెర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)
ఇండియా వెర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)
ఇండియా వెర్సెస్ కెనడా - జూన్ 15 రాత్రి 8 గంటలకు (లాండర్‌హిల్)
టీ20 వరల్డ్ కప్ ఎక్కడ చూడాలి?
ఈసారి టీ20 వరల్డ్ కప్ లైవ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ఉండనుంది. టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో.. డిజిటల్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ మ్యాచ్ లను లైవ్ చూడొచ్చు. హాట్‌స్టార్ మొబైల్ లో అయితే అన్ని మ్యాచ్ లను ఫ్రీగా చూసే వీలుంది. ల్యాప్‌టాప్, టీవీల్లో చూడాలంటే మాత్రం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ ఇదీ
- ఈసారి టీ20 వరల్డ్ కప్ లో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్స్ ఉంటాయి.
- ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ సూపర్ 8 రౌండ్ కు వెళ్తాయి.
- సూపర్ 8కు చేరిన 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
- ఈ గ్రూపుల నుంచి రెండేసి టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి.
- సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో ట్రోఫీ కోసం తలపడతాయి.