Video: నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్.. బంగ్లాదేశ్ బౌలర్‌ను హగ్ చేసుకున్న న్యూజిలాండ్ ప్లేయర్.. ఏం జరిగిందంటే..-new zealand ish sodhi hugs bangladesh bowler hasan mahmud ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  New Zealand Ish Sodhi Hugs Bangladesh Bowler Hasan Mahmud

Video: నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్.. బంగ్లాదేశ్ బౌలర్‌ను హగ్ చేసుకున్న న్యూజిలాండ్ ప్లేయర్.. ఏం జరిగిందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2023 09:49 PM IST

NZ vs BAN Video: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డేలో ఓ అనూహ్య ఘటన జరిగింది. నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్ చేయటంతో కాస్త గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఔటైన బ్యాటర్‌ను బంగ్లా ప్లేయర్లు వెనక్కి పిలిచారు. వివరాలివే..

Video: నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్.. బంగ్లాదేశ్ బౌలర్‌ను హగ్ చేసుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ (Photo: Twitter)
Video: నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్.. బంగ్లాదేశ్ బౌలర్‌ను హగ్ చేసుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ (Photo: Twitter)

NZ vs BAN Video: క్రికెట్‍లో నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్ చేయడం ఇప్పుడు లీగల్‍గా ఉంది. బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే బౌలర్ రనౌట్ (మన్కడింగ్) చేయవచ్చు. అయితే, ఇది లీగల్ అయినా.. నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేసిన ప్రతీసారి వివాదం తలెత్తుతుంది. గతేడాది మహిళల క్రికెట్‍లో భారత ప్లేయర్ దీప్తి శర్మ.. ఇంగ్లండ్ ప్లేయర్ చార్లీ డీన్‍ను ఇలా ఔట్ చేయగా.. వివాదం రేగింది. అంతకు ముందు కూడా ఇలా నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో ఔట్ చేసిన ప్రతీసారి క్రీడాస్ఫూర్తి అనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య నేడు (సెప్టెంబర్ 23) జరిగిన రెండో వన్డేలోనూ నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌట్ తంతు జరిగింది. అయితే, చివరికి ఔటైన బ్యాటర్‌ను మళ్లీ వెనక్కి పిలిచింది బంగ్లా. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

మీర్పూర్ వేదికగా ఆతిథ్య బంగ్లాదేశ్‍తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 46వ ఓవర్‌ను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ వేశాడు. అయితే, ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో క్రీజు దాటిన న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోదీని రౌనౌట్ చేశాడు మహమూద్. సోదీ క్రీజు దాటినట్టు గుర్తించిన మహమూద్ బంతిని వేయకుండా వికెట్లకు కొట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు.

ఇది రిప్లే చూసిన థర్డ్ అంపైర్ నిబంధనల ప్రకారం ఇష్ సోదీని ఔట్‍గా ప్రకటించాడు. దీంతో వెటకారంగా బ్యాట్‍తో చప్పట్లు కొట్టినట్టుగా చేస్తూ పెవిలియన్ వైపుగా నడిచాడు సోదీ. అప్పుడు బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, బౌలర్ మహమూద్ అంపైర్ వద్దకు వెళ్లి.. సోదీని వెనక్కి పిలవాలని ఆడిగారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. దీంతో మళ్లీ తిరిగి వచ్చిన కివీస్ ప్లేయర్ ఇష్ సోదీ.. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్‍ను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత సోదీ బ్యాటింగ్ కొనసాగించాడు.

ముందుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‍లో రనౌత్‍తో హీటెక్కిన ఈ వ్యవహారం చివరికి కౌగిలింతతో ప్రశాంతంగా ముగిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రీడాస్ఫూర్తిని చూపిన బంగ్లాదేశ్‍ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ రెండో వన్డేలో బంగ్లాదేశ్‍పై న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మూడు వన్డేల సిరీస్‍లో తొలి మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. మూడో వన్డే మంగళవారం (సెప్టెంబర్ 26) జరగనుంది.

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.