IND vs SL: వన్డే చరిత్రలో టీమిండియా తొలిసారి ఇలా.. విజృంభించిన లంక స్పిన్నర్లు.. స్వల్ప టార్గెట్-india lost all 10 wickets to spinners for the first time in odi history vs sri lanka in asia cup 2023 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl: వన్డే చరిత్రలో టీమిండియా తొలిసారి ఇలా.. విజృంభించిన లంక స్పిన్నర్లు.. స్వల్ప టార్గెట్

IND vs SL: వన్డే చరిత్రలో టీమిండియా తొలిసారి ఇలా.. విజృంభించిన లంక స్పిన్నర్లు.. స్వల్ప టార్గెట్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 12, 2023 08:29 PM IST

IND vs SL: ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక స్పిన్నర్లు అదరగొట్టారు.

IND vs SL: వన్డే చరిత్రలో టీమిండియా తొలిసారి ఇలా.. విజృంభించిన లంక స్పిన్నర్లు
IND vs SL: వన్డే చరిత్రలో టీమిండియా తొలిసారి ఇలా.. విజృంభించిన లంక స్పిన్నర్లు (AP)

IND vs SL: శ్రీలంక స్పిన్నర్లు విజృంభించారు. ఆసియాకప్ 2023 టోర్నీ సూపర్-4 మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. శ్రీలంకలోని కొలంబో ఆర్.ప్రేమదాస మైదానంలో నేడు (సెప్టెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (53 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33) మోస్తరుగా ఆడారు. చివర్లో అక్షర్ పటేల్ (26) విలువైన పరుగులు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో సత్తాచాటగా.. మరో స్పిన్నర్ చరిత్ అసలంక నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్ స్పిన్నర్ మహీశ్ పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‍లో స్పిన్నర్లకే 10కి 10 వికెట్లు సమర్పించుకోవడం భారత జట్టుకు ఇదే తొలిసారి. తొలుత వికెట్లేమీ కోల్పోకుండా 80 పరుగులు చేసిన భారత్.. అక్కడి నుంచి వెనువెంటనే వికెట్లు కోల్పోయి 213 పరుగులకే ఆలౌటైంది. పిచ్ స్పిన్‍కు సహకరించగా.. లంక దాన్ని పూర్తిగా వినియోగించుకుంది. శ్రీలంక ముందు 214 పరుగుల లక్ష్యం ఉంది.

అదరగొట్టిన రోహిత్..

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ దూకుడుగా ఆడాడు. గిల్ నిలకడగా ఆడుతున్నా క్రమంగా హిట్‍మ్యాన్ వేగం పెంచాడు. లంక బౌలర్లను ఇద్దరూ దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో వికెట్ కోల్పోకుండా 10 ఓవర్లలో 65 పరుగులు చేసింది భారత్.

వెల్లలాగే విజృంభణ

అయితే, 12వ ఓవర్లో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే.. శుభ్‍మన్ గిల్‍ (19) బౌల్డ్ చేశాడు. దీంతో 80 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3)ని కూడా వెల్లలాగే పెవిలియన్‍కు పంపాడు. మరో ఎండ్‍లో ధాటిగా ఆడిన రోహిత్ 44 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో వెల్లలాగే వేసిన బంతి సరిగా బౌన్స్ కాకపోవటంతో రోహిత్ బౌల్డ్ అయ్యాడు. కాసేపు నిలకడా ఆడిన కేఎల్ రాహుల్‍ను 30వ ఓవర్లో వెల్లలాగే ఔట్ చేశాడు. పిచ్ స్పిన్‍కు అనుకూలించటంతో పరుగులు రావడం కష్టమైంది. అనంతరం లంక మరో స్పిన్నర్ చరిత్ అసలంక కూడా అదరగొట్టాడు. భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ (33) పెవిలియన్‍కు పంపాడు. హార్దిక్ పాండ్యా (5)ను ఔట్ చేసి ఐదో వికెట్ దక్కించుకున్నాడు వెల్లలాగే.

అనంతరం రవీంద్ర జడేజా (4), జస్‍ప్రీత్ బుమ్రా (5), కుల్‍దీప్ (0)ను వెనువెంటనే అసలంక ఔట్ చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ (26) రాణించటంతో టీమిండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. మహమ్మద్ సిరాజ్ (5 నాటౌట్).. అక్షర్‌కు సహకరించాడు.

Whats_app_banner