Gambhir praises Dhoni: ధోనీ టీమ్ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు: మాజీ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గంభీర్-gambhir praises dhoni says he sacrificed batter in him for the team cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gambhir Praises Dhoni: ధోనీ టీమ్ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు: మాజీ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గంభీర్

Gambhir praises Dhoni: ధోనీ టీమ్ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు: మాజీ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గంభీర్

Hari Prasad S HT Telugu
Sep 18, 2023 09:44 AM IST

Gambhir praises Dhoni: ధోనీ టీమ్ కోసం ఎన్నో త్యాగాలు చేశాడంటూ మాజీ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు గౌతమ్ గంభీర్. ఎప్పుడూ ధోనీ పేరెత్తితే చిరాకు పడే గంభీర్ నోటి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

2011 వరల్డ్ కప్ ఫైనల్లో గంభీర్, ధోనీ
2011 వరల్డ్ కప్ ఫైనల్లో గంభీర్, ధోనీ

Gambhir praises Dhoni: ధోనీ పేరెత్తితే చాలు గంభీర్ మండిపడతాడు. అలాంటిది మిస్టర్ కూల్ గురించి అతడు సానుకూలంగా మాట్లాడటం, టీమ్ కోసం ఎన్నో త్యాగాలు చేశాడంటూ ఆకాశానికెత్తడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2011 వరల్డ్ కప్ విషయంలో ధోనీ లక్ష్యంగా ఇప్పటికే గంభీర్ ఎన్నోసార్లు విమర్శలు చేశాడు. అయితే తొలిసారి ధోనీ గురించి గంభీర్ చేసిన పాజిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ధోనీలాంటి వ్యక్తి టీమిండియాకు దొరకడం అదృష్టమని గంభీర్ అనడం గమనార్హం. ఆసియా కప్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన అతడు.. మిస్టర్ కూల్ కెప్టెన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ కోసం తనలోని బ్యాటర్ ను ధోనీ త్యాగం చేశాడని, అతడు మూడోస్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఉంటే వన్డేల్లో ఎన్నో రికార్డులను తిరగరాసేవాడని అన్నాడు.

"తన బ్యాటింగ్ తో ఆటను మార్చేసిన తొలి ఇండియన్ వికెట్ కీపర్ ఎమ్మెస్. అతని కంటే ముందు వాళ్లు మొదట కీపర్లే, తర్వాతే బ్యాటర్లు. కానీ ఎమ్మెస్ మాత్రం మొదట బ్యాటర్, తర్వాతే వికెట్ కీపర్. ఎమ్మెస్ ధోనీ రూపంలో ఏడోస్థానంలో వచ్చిన మ్యాచ్ లు గెలిపించే ఓ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియాకు దొరకడం అదృష్టం. అతనిలో ఆ పవర్ గేమ్ ఉంది.

ఒకవేళ ధోనీ మూడోస్థానంలో ఆడి ఉంటే అతడు ఎన్నో వన్డే రికార్డులను తిరగరాసేవాడు. ధోనీ కెప్టెన్సీ ఘనతల గురించే అందరూ మాట్లాడుకుంటారు. అది నిజం కూడా. కానీ అదే కెప్టెన్సీ వల్ల అతడు తనలోని బ్యాటర్ ను త్యాగం చేశాడు. తన బ్యాట్ తో అతడు మరెన్నో గొప్ప రికార్డులను సాధించేవాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఓ కెప్టెన్ గా టీమ్ విజయాలే ముఖ్యం. తన గురించి తాను మరచిపోతాడు.

అతడు ఆరు లేదా ఏడోస్థానంలో బ్యాటింగ్ కు దిగడం ప్రారంభించాడు. ఒకవేళ అతడు కెప్టెన్ కాకపోయి ఉంటే మూడోస్థానంలో ఆడేవాడు. అలా జరిగి ఉంటే మరెన్నో పరుగులు, సెంచరీలు చేసేవాడు. ధోనీ సాధించిన ట్రోఫీలే అందరూ చూస్తారు. కానీ నాకు మాత్రం ఆ ట్రోఫీల కోసం అతడు త్యాగం చేసిన పరుగులు కనిపిస్తాయి" అని గంభీర్ అన్నాడు.

వన్డే క్రికెట్ లో ధోనీ 10773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అది కూడా గంభీర్ అన్నట్లుగా లోయర్ మిడిలార్డర్ లో వచ్చి సాధించడం విశేషం. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్ లో పైన వచ్చి ఉంటే.. కచ్చితంగా ధోనీ మరిన్ని పరుగులు, సెంచరీలు చేసేవాడే.

Whats_app_banner