BCCI Boss in Pakistan: పాకిస్థాన్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్.. ఎందుకో తెలుసా?
BCCI Boss in Pakistan: పాకిస్థాన్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అడుగుపెట్టారు. అక్కడి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు వెళ్లారు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం (సెప్టెంబర్ 4) పాకిస్థాన్ కు వెళ్లారు.
BCCI Boss in Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల్లో ఇదొక చారిత్రక సందర్భం. రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని, ఎన్నో ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు జరగని నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆ దేశానికి వెళ్లడం గమనార్హం. సోమవారం (సెప్టెంబర్ 4) తమ దేశానికి వచ్చిన బీసీసీఐ పెద్దలకు పీసీబీ ఛైర్మన్ జాకా అష్రఫ్ స్వాగతం పలికారు.
రెండు రోజుల పాటు రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా పాకిస్థాన్ లో ఉండనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2023 కోసం వాళ్లు ఆ దేశానికి వెళ్లారు. ఈ ఏడాది ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్నా.. అక్కడికి వెళ్లడానికి ఇండియా నిరాకరించడంతో 13 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే ఆ దేశంలో జరుగుతున్నాయి. తాము పాకిస్థాన్ లో పర్యటించడం వెనుక కేవలం క్రికెట్ కారణాలు తప్ప, ఎలాంటి రాజకీయ కారణాలు లేవని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
వీళ్లు మంగళవారం (సెప్టెంబర్ 5) లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ కూడా చూసే అవకాశం ఉంది. ఇండియాతోపాటు అన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ దేశాలను పాక్ బోర్డు ఆహ్వానించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లకు డిన్నర్ హోస్ట్ చేశారని కూడా రాజీవ్ శుక్లా చెప్పారు. 2005లో చివరిసారి పాకిస్థాన్ వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మళ్లీ ఇన్నాళ్లకు ఆ దేశంలో అడుగుపెట్టారు.
మరోవైపు బీసీసీఐ పెద్దల పాకిస్థాన్ పర్యటన నేపథ్యంలో ఆసియా కప్ మిగిలిన మ్యాచ్ లను పూర్తిగా ఆ దేశానికి తరలిస్తారన్న పుకార్లు కూడా వినిపించాయి. శ్రీలంకలో కురుస్తున్న వర్షాలు మ్యాచ్ లకు అడ్డంకిగా మారుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. సూపర్ 4, ఫైనల్ జరిగే కొలంబోలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఆసియా కప్ 2023 సజావుగా సాగుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.