Babar Azam Mohammed Rizwan: రిజ్వాన్ వెంట పడి బ్యాట్‌తో కొట్టబోయిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
Babar Azam Mohammed Rizwan: ఈ మధ్యే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్సీ వదులుకున్న బాబర్ ఆజం.. ఆ టీమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ వెంట పడి బ్యాట్ తో కొట్టబోయాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Babar Azam Mohammed Rizwan: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం.. ఆ టీమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ను బ్యాట్ తో ఎలా తరుముతున్నాడో పైనున్న ఫొటోలో చూశారా? ఈ ఫొటో చూసి నిజంగానే రిజ్వాన్ ను కొట్టబోతున్నాడా అన్న సందేహం కలుగుతుంది. అయితే ఈ ఇద్దరి మధ్య సరదాగా జరిగిన ఘటన ఇది.
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలోనే ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లబోతున్న పాకిస్థాన్ టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. అందులో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో ఇలా రిజ్వాన్ వెంటపడి కొట్టబోయాడు బాబర్ ఆజం. బౌలర్ వేసిన బంతిని అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ సమయంలో బాబర్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈలోపు వికెట్ కీపర్ రిజ్వాన్ అది వైడ్ ఎలా అవుతుందంటూ అంపైర్ ను ప్రశ్నిస్తూ స్టంప్స్ దగ్గరకు వచ్చాడు. పక్కనే ఉన్న బాబర్ ఆజం.. సరదాగా రిజ్వాన్ వైపు దూసుకెళ్లాడు. అతని వెంట పడి బ్యాట్ తో కొట్టబోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేషనల్ టీమ్ లో కీలకమైన ప్లేయర్స్ అయిన బాబర్, రిజ్వాన్ మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉంది.
క్రీజులోనూ ఈ ఇద్దరి పార్ట్‌నర్‌షిప్ పాకిస్థాన్ కు కీలకమైన విజయాలు సాధించి పెట్టింది. ఇక పాక్ టీమ్ ఆస్ట్రేలియా టూర్ కోసం కొత్త చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ ఈ మధ్యే టీమ్ అనౌన్స్ చేశాడు. వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన తర్వాత పాక్ జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కోచ్ గా మహ్మద్ హఫీజ్ వచ్చాడు.
విదేశీ కోచ్ లందరూ వెళ్లిపోయారు. ఇక బాబర్ ఆజం కెప్టెన్ గా దిగిపోగా.. అతని స్థానంలో టెస్టుల్లో షాన్ మసూద్, టీ20ల్లో షహీన్ అఫ్రిదిలకు కెప్టెన్సీ అప్పగించారు. వన్డేల్లో ఇంకా కెప్టెన్ ను అనౌన్స్ చేయలేదు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది పాకిస్థాన్ టీమ్. నాలుగు నెలల కిందట శ్రీలంకతో టెస్టులు ఆడిన పాక్.. మళ్లీ డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడబోతోంది.