Asian Games: ఏషియన్ గేమ్స్‌లో పతకం పక్కా చేసుకున్న తెలంగాణ బాక్సర్ జరీన్.. ఒలింపిక్స్‌లో ప్లేస్ కూడా ఖరారు
Asian Games - Nikhat Zareen: ఏషియన్ గేమ్స్‌లోనూ సత్తాచాటుతోంది భారత బాక్సర్ నిఖత్ జరీన్. సెమీఫైనల్‍కు దూసుకెళ్లి పతకం ఖరారు చేసుకుంది. అలాగే ఒలింపిక్స్ బెర్త్ కూడా ఖాయం చేసుకుంది. వివరాలివే..
Asian Games - Nikhat Zareen: భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో దూసుకెళుతోంది. చైనాలోని హంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు (సెప్టెంబర్ 29) జరిగిన మహిళల 50 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్‍లో జోర్డాన్ బాక్సర్ హసన్ నస్సర్‌ను భారత స్టార్ నిఖత్ ఓడించింది. దీంతో సెమీఫైనల్‍లో అడుగుపెట్టింది. ఈ గెలుపుతో పతకాన్ని ఖరారు చేసుకుంది. వివరాలివే..
క్వార్టర్ ఫైనల్‍లో ఈ గెలుపుతో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్‍లో థాయ్‍లాండ్ బాక్సర్ చుతమత్ రక్సత్‍తో జరీన్ తలపడనుంది.
ఏషియన్ గేమ్స్ సెమీస్ చేరిన నిఖత్ జరీన్.. 2024 పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు కూడా అర్హత సాధించింది. పారిస్ గేమ్స్‌కు ప్లేస్ పక్కా చేసుకున్న తొలి భారత బాక్సర్‌గా నిలిచింది.
నిఖత్ ఏకపక్ష విజయం
ఏషియన్ గేమ్స్ బాక్సింగ్ 50 కేజీల మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్‍లో నిఖత్ జరీన్ అద్భుతంగా ఆడింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి హసన్ నస్సర్‌పై వరుసగా పంచ్‍లతో విరుచుకుపడింది. కేవలం రెండు నిమిషాల్లోగానే రిఫరీ స్టాప్ కౌంట్ ద్వారా నిఖత్ విజయం సాధించింది. సెమీస్‍లో అడుగుపెట్టి మెడల్ ఖరారు చేసుకుంది.
కాగా, ఏషియన్ గేమ్స్ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు (సెప్టెంబర్ 29 సాయంత్రం) 32 పతకాలను కైవసం చేసుకుంది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి. భారత్‍కు షూటింగ్‍లోనే ఇప్పటి వరకు ఆరు బంగారు పతకాలు దక్కాయి.
మరోవైపు, పురుషుల 400 మీటర్ల హీట్స్ విభాగంలో భారత అథ్లెట్ మహమ్మద్ అజ్మల్ వరియాతోడి ఫైనల్ చేరాడు.