YouTube Go Live Together । యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. కంటెంట్ క్రియేటర్‌లకు 'ప్రత్యక్ష' ప్రయోజనం!
YouTube Go Live Together: కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ 'గో లైవ్ టుగెదర్' అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఏమిటి?, ఎందుకు ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకోండి.
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ 'గో లైవ్ టుగెదర్' అనే సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది అర్హత కలిగిన క్రియేటర్‌లు ఎవరైనా అతిథిని తమతో పాటుగా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీలుకల్పిస్తుంది. అంటే యూట్యూబ్ హోస్ట్, గెస్ట్ ఇద్దరూ ఒకేసారి లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఎంపిక అయిన కొంత మంది యూట్యూబ్ క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే మరింత మంది క్రియేటర్లకు యాక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యూట్యూబ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
కాగా, YouTube డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఈ ‘గో లైవ్ టుగెదర్’ అనే ఫీచర్ అందుబాటులో ఉండదు. కాబట్టి సృష్టికర్తలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మాత్రమే సహ-ప్రత్యక్ష ప్రసారం చేయగలుగుతారు. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని షెడ్యూల్ చేయడానికి వారి కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు.
YouTube Go Live Together- ఏమిటి ఈ ఫీచర్?
యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ Go Live Together ఫీచర్ అందుబాటులోకి రావటంతో లైవ్ నిర్వహించే వారు మరొకరిని గెస్ట్‌గా లైవ్‌లోకి ఆహ్వానించవచ్చు. ఇక్కడ లైవ్ నిర్వహించే వారు హోస్ట్‌గా వ్యవహరిస్తారు. లైవ్ లింక్ అందుకున్న వారు ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనవచ్చు. క్రియేటర్లు ఎంతమందికైనా తమ లైవ్ లింక్‌ను పంపవచ్చు కానీ, ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే లైవ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే ప్రస్తుతం లైవ్‌లో ఉన్న వ్యక్తిని తొలగించి జాబితాలో ఉన్న మరొకరిని లైవ్‌లో చేర్చవచ్చు.
అంతేకాదు, మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన కంటెంట్ హక్కులు హోస్ట్‌లకు మాత్రమే ఉంటాయి గెస్ట్‌లకు ఉండవు అని యూట్యూబ్ పేర్కొంది.
అయితే ఈ లైవ్ కంటెంట్‌కు హోస్ట్ ఛానెల్ బాధ్యత వహిస్తుందని. ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న అతిథులందరూ అందులోని కంటెంట్ కు సంబంధించి కమ్యూనిటీ మార్గదర్శకాలు, కాపీరైట్ విధానం సహా YouTube జారీ చేసే ఇతర అన్ని షరతులు, నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని కంపెనీ పేర్కొంది.
మరోవైపు యూట్యూబ్ తమ వినియోగదారుల కోసం 'ప్రైమ్‌టైమ్ ఛానెల్స్' ప్రారంభ వెర్షన్‌ను యూఎస్‌లో విడుదల చేసినట్లు తెలిపింది. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన టీవీ షోలు, చలనచిత్రాలు, క్రీడలను వీక్షించవచ్చు.
సంబంధిత కథనం