Winter Bike Care Tips : చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే బైక్‌తో ఎలాంటి సమస్యలూ ఉండవు
Winter Bike Care Tips In Telugu : ఏ కాలంలోనైనా బైక్‌ను సరిగా చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. చలికాలంలోనూ బైక్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఇప్పటికే చలి మెుదలైంది. అనేక ప్రాంతాల్లో చలి రోజురోజుకు పెరుగుతుంది. దీపావళి తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో మనుషులే కాదు.. వాహనాలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైక్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో కూడా మీ బైక్ సరిగా పనిచేయాలంటే.. కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి. వీటితో మీ బైక్ పనితీరు, మైలేజీ కూడా బాగుంటుంది. ఆ టిప్స్ ఏంటో చూద్దాం..
లైటింగ్‌ను చూసుకోండి
శీతాకాలంలో పొగమంచు కారణంగా ముందు వచ్చే వాహనాలు సరిగా కనిపించవు. అటువంటి పరిస్థితిలో మీ బైక్‌కి మంచి లైటింగ్ ఉండటం ముఖ్యం. మీ హెడ్‌లైట్‌లు, టైల్‌లైట్‌లను ఇప్పుడే చెక్ చేసుకోండి. వాటి కాంతి సరిపోకపోతే మార్చండి.
ఇంజిన్ ఆయిల్ చెక్ చేయండి
శీతాకాలంలో తేమ కారణంగా ఇంజిన్ ఆయిల్ సాధారణంగా చిక్కగా, చల్లగా ఉంటుంది. అందువల్ల శీతాకాలంలో బైక్ మెరుగైన పనితీరు కోసం ఇప్పుడు ఇంజిన్ ఆయిల్‌ను మార్చడం మంచిది. పాత ఇంజిన్ ఆయిల్‌తో సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు. నాణ్యమైన ఇంజిన్ ఆయిల్ మాత్రమే ఉపయోగించండి.
బ్రేకులు చూసుకోండి
చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్లు కొద్దిగా జారే అవకాశం ఉంటంది. అందువల్ల అటువంటి వాతావరణంలో బైక్ నడపడానికి, సరైన బ్రేకులను కలిగి ఉండటం అవసరం. బ్రేక్ ప్యాడ్‌లు, బ్రేక్ ఫ్లూయిడ్ మొదలైనవాటిని చెక్ చేసి అవసరమైతే వాటిని మార్చుకోండి.
బ్యాటరీపై శ్రద్ధ అవసరం
చలికాలంలో బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఈ సీజన్‌లో బ్యాటరీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. చలికాలం రాకముందే మీ బ్యాటరీ పరిస్థితిని చెక్ చేయండి. బ్యాటరీ పాతదైతే దాన్ని మార్చడం మంచిది.
బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ వద్దు
చలికాలంలో రాత్రిపూట బైకును బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయవద్దు. రాత్రి మంచు కారణంగా బైక్ ఇంజిన్ ఆయిల్ చల్లగా ఉంటుంది. దీని కారణంగా మీరు స్టార్ట్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. మంచులో పార్క్ చేసిన తర్వాత దానిని స్టార్ట్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది.
కిక్ స్టార్ట్
ఈ రోజుల్లో దాదాపు అన్ని బైక్‌లు సెల్ఫ్ స్టార్ట్ ఫీచర్‌తో వస్తున్నాయి. అయితే శీతాకాలంలో బ్యాటరీ డిశ్చార్జ్ కారణంగా సెల్ఫ్ స్టార్ట్ ప్రారంభించడంలో కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది. ఉదయాన్నే కిక్‌తో బైక్‌ను స్టార్ట్ చేయండి. ఇలా చేస్తే బ్యాటరీ కూడా పాడవకుండా ఉంటుంది.