YouTube CEO : యూట్యూబ్ సీఈఓగా భారతీయ అమెరికన్ నీల్ మోహన్
YouTube CEO Neal Mohan : యూట్యూబ్ సీఈఓగా నీల్ మోహన్ నియమితులయ్యారు. ఆయన ఒక భారతీయ అమెరికన్.
YouTube new CEO : మరో దిగ్గజ సంస్థకు సీఈఓగా భారతీయ అమెరికన్ వ్యక్తి ఎంపికయ్యారు. ప్రముఖ వీడియో యాప్ యూట్యూబ్ సీఈఓగా భారత సంతతికి చెందిన నీల్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆ బాధ్యతల్లో కొనసాగిన సూసన్ వోజ్కికి రాజీనామా చేయడంతో నీల్ మోహన్‌కు ఈ అవకాశం దక్కింది.
సూసన్ వోజ్కికి.. 25ఏళ్ల పాటు యూట్యూబ్‌తో బంధం ఉంది. 2014లో యూట్యూబ్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు.. తన ఆరోగ్యం, కుటుంబంపై దృష్టిసారించనున్నట్టు పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
తనకి ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ బృందానికి నీల్ మోహన్ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని స్పష్టం చేశారు.
ఎవరీ నీల్ మోహన్..?
Neel Mohan YouTube CEO : 2008లో గూగుల్‌లో చేరారు నీల్ మోహన్. ప్రముఖ అంతర్జాతీయ వర్సిటీ స్టాన్‌ఫర్డ్ నుంచి గ్రాడ్యువేషన్ తీసుకున్నారు. సీఈఓ బాధ్యతలు తీసుకునే ముందు.. యూట్యూబ్‌లో ఆయన చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా పనిచేశారు.
అంతకుముందు.. మైక్రోసాఫ్ట్, స్టిచ్ ఫిక్స్ అండ్ జీనోమిక్స్, బయోటెక్నాలజీ కంపనీ అయిన 23 అండ్ మీ వంటి సంస్థల్లో పని చేశారు.
ఇక యూట్యూబ్‌లో మోహన్, వోజ్కికి కలిసి దాదాపు 15ఏళ్ల పాటు పనిచేశారు. తొలుత యూట్యూబ్‌లో డిస్ప్లే అండ్ వీడియో యాడ్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2015లో చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.
"మా కంటెంట్, వ్యాపారం, క్రియేషన్, సమాచార వ్యవస్థ, ఉద్యోగులపై నీల్‌కు అద్భుతమైన జ్ఞానం ఉంది. ఇది సంస్థకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము షార్ట్స్, స్ట్రీమింగ్, సబ్స్క్రిప్షన్స్ చేస్తున్నాము. కృత్రిమ మేధతో కలిసి పనిచేస్తున్నాము. భవిష్యత్తులో రానున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుక నీల్ మోహన్ సరైన వ్యక్తి, అర్హుడు," అని వోజ్కికి స్పష్టం చేశారు.