YouTube Shorts on TV: టీవీలోనూ యూట్యూబ్ షార్ట్స్.. ఎలా చూడాలంటే!
YouTube Shorts on TV: ఇంతకాలం స్మార్ట్ ఫోన్‍లకే పరిమితమైన యూట్యూబ్ షార్ట్స్ టీవీల్లోనూ వచ్చేస్తున్నాయి. టీవీల్లోనూ షార్ట్స్ చూసేలా ఫీచర్ ను నేటి నుంచే గూగుల్ రోల్అవుట్ చేస్తోంది.
YouTube Shorts on TVs: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‍ఫామ్ యూట్యూబ్‍లో షార్ట్స్ ఎంతో ఫేమస్ అయ్యాయి. 60 సెకన్లు అంత కంటే తక్కువ నిడివి ఉండే ఈ షార్ట్స్ వీడియోలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. క్రియేటర్లు, వ్యూవర్ల సంఖ్య గణనీయంగా అధికమవుతోంది. ముఖ్యంగా టిక్‍టాక్ బ్యాన్ అయిన తర్వాత షార్ట్ వీడియోలకు యూట్యూబ్ షార్ట్స్ ప్రధానమైన ప్లాట్‍ఫామ్‍గా మారింది. స్మార్ట్ ఫోన్‍లలో షార్ట్స్ కు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఈ తరుణంలో యూట్యూబ్ పేరెంట్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్ ను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇవే..
YouTube Shorts on TVs: రోల్అవుట్ షురూ
స్మార్ట్ టీవీల్లోని యూట్యూబ్ యాప్‍లో యూజర్లు షార్ట్స్ వీడియోలు కూడా ప్లే చేసుకునే ఫీచర్ ను గూగుల్ తీసుకొస్తోంది. 2019, ఆ తర్వాత లాంచ్ అయిన టీవీ మోడళ్లలో యూట్యూబ్ షార్ట్స్ చూడొచ్చు. ఈ కొత్త ఫీచర్ రోల్అవుట్‍ను గూగుల్ ప్రారంభించింది. ఇప్పటికే కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో ఈ సదుపాయం సపోర్ట్ చేసే అన్ని టీవీలకు అందుబాటులోకి వస్తుంది.
అయితే, యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు (YouTube Short Videos) వెర్టికల్ (నిలువు) ఫార్మాట్‍లో ఉంటాయి. టీవీలు ల్యాండ్‍స్కేప్ (అడ్డం) మోడ్‍లో ఉంటాయి. దీంతో టీవీలో షార్ట్స్ ప్లే చేస్తే స్క్రీన్‍పై రెండు పక్కలా చాలా ఖాళీ స్పేస్ కనిపిస్తుంది. ఈ డిజైన్ సవాల్‍ను అధిగమించేందుకు కూడా గూగుల్ ఆలోచన చేసింది. ఇందుకోసం యూఐ డిజైన్‍లను తీసుకొచ్చింది. సాధారణ వీడియో ప్లేయర్, జ్యూక్ బాక్స్ స్టైల్, బ్లాంక్ స్పేస్‍ను వీడియోకు తగ్గట్టు కలర్స్ తో ఫిల్ చేసే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంది.
YouTube Shorts on TVs: యూఐ డిజైన్ ఇలా..
ప్రస్తుతం కొత్త యూఐ డిజైన్‍తో టీవీలకు యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్ ను గూగుల్ రోల్అవుట్ చేస్తోంది. ప్లే అవుతున్న షార్ట్స్ వీడియోలోని మెయిన్ క్లిప్ కలర్ ను బట్టి రెండు పక్కల ఖాళీ స్పేస్‍లో బ్యాక్ గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది. ఇక ప్లే అవుతున్న షార్ట్ వీడియో కుడి పక్క, వీడియో టైటిల్, క్రియేటర్, ఏ సౌండ్ వినియోగించారనే లాంటి సమాచారం కనిపిస్తుంది. భవిష్యత్తులో యూఐ డిజైన్ ద్వారా మరిన్ని ఫీచర్లను తీసుకొస్తామని యూట్యూబ్ యూఎక్స్ డిజైనర్లు బ్రిన్ ఇవాన్స్, మలానీ ఫిట్‍గెరాల్డ్ ఓ బ్లాక్ పోస్ట్ లో పేర్కొన్నారు.
YouTube Shorts on TVs: టీవీలో యూట్యూబ్ షార్ట్స్ ఎలా చూడాలంటే..
1.టీవీలో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి.
2. టీవీ రిమోట్‍ను ఉపయోగించి, షార్ట్స్ కేటగిరీలోకి వెళ్లండి. అక్కడ రెకమెండెడ్ యూట్యూబ్ షార్ట్స్ కనిపిస్తాయి.
3. మీరు చూడాలనుకుంటున్న వీడియోపై క్లిక్ చేయండి.
4. క్రియేటర్ యూట్యూబ్ చానెల్‍లోకి వెళ్లి కూడా షార్ట్స్ ను చూడవచ్చు. ఛానెల్‍లోకి వెళ్లాక షార్ట్స్ ట్యాబ్‍కి వెళ్లి ప్లే చేయచ్చు.
2019, ఆ తర్వాత లాంచ్ అయిన టీవీ మోడల్స్ కే యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్ వస్తుంది. ఇప్పటికే రోల్అవుట్‍ను గూగుల్ మొదలుపెట్టింది.